కొత్త చట్టం ప్రజల చేతిలో బ్రహ్మస్త్రం

ABN , First Publish Date - 2020-10-03T10:48:08+05:30 IST

కొత్త మునిసిపల్‌ చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని, భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేయడమేగాక ..

కొత్త చట్టం ప్రజల చేతిలో బ్రహ్మస్త్రం

యాదాద్రి, అక్టోబరు2 (ఆంధ్రజ్యోతి): కొత్త మునిసిపల్‌ చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని, భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేయడమేగాక అధికారులను జవాబుదారీ చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఆయన జయంతి సందర్భంగా డంపింగ్‌ యార్డ్‌లో సభ నిర్వహించడం నిజమైన నివాళి అని కొనియాడారు. చారిత్ర క భువనగిరి పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో త్వరలో పట్టణ రూపురేఖలు మారనున్నాయన్నారు. యాదగిరిగుట్ట ఆలయం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని, భువనగిరి మీదుగా ఎంఎంటీఎస్‌ వస్తుందన్నారు.


భువనగిరి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలని, ప్రధాన రహదారిని వెడల్పు చేస్తూ విస్తరించాలన్నారు. ఫుట్‌పాత్‌లు నిర్మించి పాదచారులు నడిచేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి వెడల్పుతో కొంత మందికి నష్టం జరిగినా, ఎక్కువ మందికి సదుపాయం ఏర్పడుతుందన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు కూడా యజమానులను ఒప్పించేందుకు కలిసిరావాలన్నారు. మూడేళ్ల తర్వాత రాజకీయాలు చేసుకుందామని, ఇప్పుడు మాత్రం కలిసికట్టుగా అభివృద్ధికి ముందుకురావాలన్నారు. రూ.25కోట్లతో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసుకున్నామన్నారు. భువనగిరిలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారని, అయితే ఆదాయం పెరిగాక ఈ పనులు చేద్దామన్నారు. భువనగిరిలో స్టేడియం, స్విమ్మింగ్‌పూల్‌ నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు. భువనగిరిలో 60వేల జనాభా ఉండగా, కేవ లం 18మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణే జరుగుతోందని, కనీ సం 30మెట్రిక్‌ టన్నులు సేకరించాలన్నారు. వార్డుకు ఒక ఆటో ఏర్పాటు చేయాలని సూ చించారు.


మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సీఎం కేసీఆర్‌ 2001 ఉద్యమ కాలంలోనే రూపొందించారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ కొత్త పథకాలతో దేశంలో అగ్రస్థానంలో నిలపడంలో కేటీఆర్‌ పాత్ర అమోఘమని కొనియాడారు. సభ లో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్‌, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మె ల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, సీడీఎంఏ డాక్టర్‌ సత్యనారాయణ, కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


చెత్తతో ఉత్పత్తులకు రెండు సంస్థలతో ఒప్పందం

మునిసిపాలిటీల పరిధిలో సేకరించే చెత్త నుంచి ఎరువులు, ఇతర పదార్థాల తయారీకి మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో సీడీఏంఏ డాక్టర్‌ సత్యనారాయణ రెండు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చెత్త నుంచి సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి చేసి తెలంగాణ సిరి పేరుతో రైతులకు అందించేందుకు అగ్రో ఇండస్ట్రీస్‌ ఎండీ రాములు, పట్టణాల్లోని ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను వినియోగించి అగర్‌బత్తుల తయారీకి హోలీవేస్ట్‌ సంస్థ ప్రతినిధి మాయ వివేక్‌తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.


పీపీటీఎంఎస్‌ యాప్‌ ఆవిష్కరణ

రాష్ట్రంలోని 142 మునిసిపాలిటీల్లో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణకు పీపీటీఎంఎస్‌ యాప్‌ను మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ యాప్‌ సాయంతో మునిసిపాలిటీల్లో ప్రతి వెయ్యి జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన టాయిలెట్ల నిర్వహణను అధికారులు మానిటరింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, స్మతి వనాలు, డంపింగ్‌యార్డులు, పచ్చదనం అభివృద్ధికి సంబంధించిన ఛాయా చిత్రాలను ఆయన పరిశీలించారు. అదే విధంగా మునిసిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచార త్రైమాసిక న్యూస్‌ లెటర్‌ను ఆయన ఆవిష్కరించారు.


 నిరసనల సెగ

పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన మునిసిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌, మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు నిరసనలు ఎదురయ్యాయి. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొనగా ఆందోళనకారులను పోలీసులు బీబీనగర్‌, వలిగొండ, ఆలేరు స్టేషన్లకు తరలించారు. బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులకు నిరసనలు ఎదురయ్యాయి.

Updated Date - 2020-10-03T10:48:08+05:30 IST