ఎంజీయూ అధికారుల నిర్లక్ష్యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా

ABN , First Publish Date - 2020-12-20T05:08:06+05:30 IST

ఎంజీయూ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాన్ని వెంటనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

ఎంజీయూ అధికారుల నిర్లక్ష్యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న ఎంజీయూ బాధిత విద్యార్థులు

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ క్రైం, డిసెంబరు 19 :
ఎంజీయూ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాన్ని వెంటనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి అన్నారు. ఎంజీయూ బాధిత విద్యార్థులు శనివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. ఎంజీయూ ఇటీవల విడుదల చేసిన 6వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల్లో కావాలనే కొంతమంది విద్యార్థులను ఫెయిల్‌ చేశారన్నారు. 1నుంచి 5వ సెమిస్టర్‌ వరకు అన్నింటిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఆరో సెమిస్టర్‌లో ఫెయిల్‌ చేశారన్నారు. సమాధాన పత్రాల జీరాక్సు ఇవ్వాలని దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదన్నారు. ఒక సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులకు శాతవాహన యూనివర్సిటీలో నిర్వహిస్తున్న విధంగా తిరిగి పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రిజిస్ర్టార్‌ ప్రొ.యాద గిరిని ఫోన్‌లో పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ర్టార్‌ ఎమ్మెల్యేకు సర్దిజెప్పే ప్రయత్నం చేయగా యూనివర్సిటీలో జరిగే విషయాలన్నీ తన దృష్టికి వచ్చాయని వీటన్నింటినీ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని హెచ్చరించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి న్యాయం చేసేలా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఎంజీయూ పరిరక్షణ సమితి నాయకులు పందుల సైదులు మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు యూనివర్సిటీ పని తీరులో మార్పు రావడం లేదన్నారు. కావాలనే విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్‌ చేయడం దారుణమని అన్నారు. అన్ని సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆరో సెమిస్టర్‌లో ఫెయిల్‌ చేయడంతో ఉన్నత చదువులకు దూరమ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
తరిగిపోతున్న పశుసంపదను కాపాడాలి
నల్లగొండ రూరల్‌ : తరగిపోతున్న పశుసంపదను కాపాడుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రైతులకు సూచించారు. పశు వైద్య, సంవర్దక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అప్పాజిపేట గ్రామంలో శనివారం నిర్వహించిన నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమానికి పశు వైద్య, సంవర్దక శాఖ సంచాలకుడు లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుసంపద తరిగిపోవడం బాధాకరమన్నారు. రైతులు విధిగా పశువులకు నట్టల నివారణ మందులు  అందించి వాటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. నియోజకవర్గంలో మరో పది పశు కేంద్రా ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర సంచాలకుడు లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం గ్రామంలో రూ.43లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పబ్బతిరెడ్డి రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బకరం వెంకన్న, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పిన్నపరెడ్డి మధుసూదన్‌రెడ్డి, పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ తవిటి కృష్ణ, ఎంపీటీసీలు రాజుపేట మల్లే్‌షగౌడ్‌, ఇరిగి సహదేవ్‌, సర్పంచ్‌లు మేకల అరవిందరెడ్డి, సైదులు,  జంగయ్య,  శ్రీనాథ్‌,  తిరుమలేష్‌,  సైదులు, జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు
 మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
తిప్పర్తి : మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని గంగన్నపాలెం గ్రా మ చెరువులో మత్స్యశాఖ వారు అందించిన 500 రొయ్య పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సంపద వృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో మత్స్య శాఖ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఏడీఏ చరితరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, సర్పంచ్‌ యాదయ్య, శ్రీనివాస్‌, రవీందర్‌రెడ్డి, లింగారావు పాల్గొన్నారు.
జిల్లాలో రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్‌ పోటీల నిర్వహణకు కృషి
నల్లగొండ క్రైం : రానున్న రోజుల్లో జిల్లాలో రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్‌ పోటీల నిర్వహణకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన సంఘం జిల్లా అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని అసోసియేషన్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభ్యున్నతితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:08:06+05:30 IST