నీటి ఎద్దడి నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2020-03-18T11:39:34+05:30 IST

వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ఆవాసా గ్రామాలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ముందస్తు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

మిషన్‌ భగీరథ అధికారులతో జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డి


భువనగిరి రూరల్‌, మార్చి17: వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ఆవాసా గ్రామాలకు తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మిషన్‌ భగీరథ సర్కిల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్య ఉన్న గ్రామాల్లో స్వయంగా మండలస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని ఆవాసా గ్రామాలకు ఏఏ సెగ్మెంట్ల ద్వారా రోజుకు ఎంత నీరు సరఫరా అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.


జిల్లావ్యాప్తంగా ప్రతి రోజు దాదాపు 5కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నామని మిషన్‌ భగీరథ ఎస్‌ఈ కృష్ణయ్య, ఈఈ లక్ష్మణ్‌ తెలిపారు. మిషన్‌ భగీరథ పథకంలో వేసిన కొత్త పైపులను వినియోగించి నీటిని సరఫరా చేస్తున్నామని, మరికొన్ని గ్రామాల్లో పాత పైపులైన్లను అనుసంధానంచేసి నీటి సరఫరా చేపడుతున్నట్లు వివరించారు. అదేవిధంగా నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఈ సంపత్‌కుమార్‌, జిల్లాలోని వివిధ మండలాల మిషన్‌ భగీరథ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-18T11:39:34+05:30 IST