లక్ష్యం చేరని ఎత్తిపోతలు

ABN , First Publish Date - 2020-03-13T12:04:02+05:30 IST

కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు చివరి భూములకు

లక్ష్యం చేరని ఎత్తిపోతలు

హుజూర్‌నగర్‌, మార్చి 12 : కృష్ణానదిపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. అయితే నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ఎడమ కాల్వ పరిధిలో స్థిరీకరించిన భూములకు నీరందక కొన్నేళ్లుగా రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దశాబ్దం కిందట కిందట పలు ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. రైతులకు నిర్వహణ అప్పగించడంతో సమన్వయ లోపంతో పథకాలు మూలనపడుతున్నాయి.


ఒక్కొక్క లిఫ్ట్‌కు చైర్మన్‌ను ఎన్నుకుని పనిచేస్తున్నా ఫలితాలు కనిపించడంలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. నీటి సంగతి ఏమోకాని ; ఎత్తిపోతల నిర్వహణ ఖర్చులను భరించలేక రైతులు తలపట్టుకుంటున్నారు. మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లోని ఎత్తిపోతల పథకాలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం ప్రతినెలా సుమారు రూ.2 కోట్ల మేరకు చెల్లిస్తుంది. అయినా కొన్ని పథకాలకు నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయి. మఠంపల్లి, చింతలపాలెం ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు నిర్మించారు.


2016లో నిర్మించిన అమరవరం ఎత్తిపోతల పథకం కింద సుమారు 4,910ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. అమరవరం పరిధిలోని మట్టపల్లి మేజర్‌ వద్ద సంప్‌ ఏర్పాటుచేశారు. రెండేళ్లు ఆయకట్టుకు నీరందించింది. కానీ రెండేళ్ళుగా ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో ఈ పథకం మూలనపడింది. దీంతో ఎత్తిపోతల పథకం మూడునాళ్ళ ముచ్చటగా మారింది. ఈ ఏడాది యాసంగిలో వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ పథకం పరిధిలో మఠంపల్లి మండలంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు విడతలుగా వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. మరో రెండు విడతలు అందించాల్సి ఉంది. పంటలు ఎండిపోతన్నాయని రైతులు ఆందోళన చెందగా అమరవరం పరిధిలోని భూములకు నీటి సామర్థ్యం పెంచి కాల్వలకు నీటిని విడుదల చేశారు. ప్రతి ఏటా చివరి భూముల రైతులు నీటి కోసం రాత్రింబవళ్ళు కాల్వల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా చింతలపాలెం మండలంలోని వెల్లటూరు ఎత్తిపోతల పథకం ద్వారా 13 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా కేవలం 9వేల ఎకరాలకు మాత్రమే నీరు పారుతోంది. ఈ పథకం కింద బుగ్గమాదారం, చింతిర్యాల పరిధిలోని భూములకు నీరు సరఫరా అవుతోంది. సుమారు నాలుగున్నరవేల ఎకరాల ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.


దొండపాడు ఎత్తిపోతల పథకం కింద 4,500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా 3 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నక్కగూడెం, చౌటపల్లి, ఎర్రగట్టుతండా పరిధిలోని భూములకు నీరు సక్రమంగా రావడం లేదనే ఆరోపణలున్నాయి. కృష్ణానది, వేములూరి వాగుకు మధ్య మంచ్యాతండా, గుర్రంపోడు లిఫ్ట్‌లు ఉన్నాయి. కాగా మంచ్యాతండా లిఫ్ట్‌ మోటార్‌ ఒకటి మరమ్మతుకు గురైంది. గుర్రంపోడు లిఫ్ట్‌ కింద పైప్‌లైన్లు వేయడం పూర్తికాలేదు. గతంలో వేసిన పైప్‌లైన్లు తరచూ లీకవుతున్నాయి. ఇక మఠంపల్లి లిఫ్ట్‌ చిన్నది కాగా ఆ మేరకే పనిచేస్తోంది. తుమ్మలతండా లిఫ్ట్‌ ఆగిపోయి కొన్నేళ్లవుతుంది. పెదవీడు లిఫ్ట్‌లో రెండు మోటార్లు కాలిపోయాయి. గుండ్లపల్లి లిఫ్ట్‌ మోటర్‌ ఒకటి పనిచేయడంలేదు. ఇదిలా ఉండగా పాలకీడు మండలంలోని శూన్యంపాడు, మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. మహంకాళిగూడెం ఎత్తిపోతల పథకం మూలనపడింది. కాగా వీటిని కాంగ్రెస్‌ హయాంలో  నిర్మించారు. కృష్ణా నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో కొన్ని మోటార్లు కాలి పోగా, కొన్ని నడుస్తున్నాయి. కొన్ని మాత్రం పూర్తిగా ఆగిపోయాయి.


సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు కృషి చేస్తామని 2019లో జరిగిన ఉప ఎన్నిక అనంతరం హుజూర్‌నగర్‌లో జరిగిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టంచేశారు. దీంతో ఇటీవల కాలంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను రిటైర్డ్‌ ఇంజనీర్లు, ఎన్‌ఎ్‌సపీ చీఫ్‌, ఇతర ఉన్నతాధికారులు, ఈఎన్‌సీ అధికారులు పర్యటించారు. చివరి భూములకు నీరందించేందుకు కొత్త పథకాలపై ప్రణాళిక తయారుచేశారు. హుజూర్‌నగర్‌ ప్రాంతంలో కృష్ణా నదిపై మరో ఎత్తిపోతల పథకం నిర్మించి వేపలసింగారం వద్ద సంప్‌ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఆ నీటి ద్వా రా మట్టపల్లి, గుండ్లపల్లి, చింతిర్యాల మేజర్లకు నీటిని సరఫరాచేయాలని నిర్ణయించారు. ఇది ప్రాథమిక దశలోనే ఉంది. 


Updated Date - 2020-03-13T12:04:02+05:30 IST