ఏనెగుట్టు విప్పేదెలా ?
ABN , First Publish Date - 2020-04-25T09:49:05+05:30 IST
అంగబలం, అర్ధబలంతో ఎన్ని అక్రమాలైనా చేయవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నాయకులు. కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ

రూ.7కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హాంఫట్
నాయకులు, అధికారుల పరస్పర సహకారం?
కరోనా మాటున భూ అక్రమాల పర్వం
హుజూర్‌నగర్, ఏప్రిల్ 24: అంగబలం, అర్ధబలంతో ఎన్ని అక్రమాలైనా చేయవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నాయకులు. కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. వీరి అక్రమాల పర్వానికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలకడంతో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం శ్రీనివాసపురంలో భూ ఆక్రమణకు తెరలేపారు కొంత మంది నేతలు. గ్రామంలోని కుందూరు ఏనెలో 715, 718, 720, 720/అ సర్వే నెంబర్లలో సుమారు 20ఎకరాల గుట్ట ఉంది. గ్రామానికి చెందిన ఓ రాజకీయపార్టీ నేతల కన్నుపడింది. అక్కడ శ్మశాన వాటిక అంటూ రాజకీయం మొదలుపెట్టారు. దాని చుట్టూ ఉన్న గుట్టను కొల్లగొట్టారు. ఐదుగురు నేతలు కలిసి మూడెకరాల చొప్పున ఆక్రమించారు. ఇంకేముంది నెలరోజుల్లో శ్రీనివాసపురంలోని కుందూరు ఏనెగట్టు పిండిలా కరిగిపోయింది.
రాత్రింబవళ్ళు తవ్వించి దానిని చదును చేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు కావడంతో గ్రామస్థులు నోరు మెదిపేందుకు భయపడుతున్నారు. కుందూరు ఏనెగట్టు సమీపంలో పంటపొలాలు సుమారు ఎకరం రూ.50లక్షల వరకు పలుకుతోంది. సుమారు 15ఎకరాలంటే రూ.7.5కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. గతంలో ప్రభుత్వం నిరుపేదల కోటాలో ఓ సర్వే నెంబరులో నలుగురు పేదలకు పట్టాలు సైతం ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి కూడా కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములు కాపాడాల్సిన యంత్రాంగం అధికారుల అవినీతి మాటున భూమి కబ్జాకోరల్లో చిక్కుకుంది. కరోనా సందర్భంగా కొంతమంది అధికారులు డ్యూటీ చేస్తుండగా, మరో కొంతమంది అధికారులతో కుమ్మకై కోట్లాది రూపాయల విలువచేసే భూములకు ఎసరు పెడుతున్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా
ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఈ భూకబ్జాలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేయగా అదేపార్టీకి చెందిన నాయకులు ప్రజా ప్రతినిధులకు, ఇతర ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా అందించినట్లు సమాచారం. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
కొందరు అధికారులకు పెద్దఎత్తున ముడుపులు ఇచ్చిన తరువాతే ఏనెగట్టును కబ్జాచేసి చదును చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని శ్రీనివాసపురం గ్రామస్థులు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. ఆర్‌ఐ సూర్యానారాయణ మాట్లాడుతూ ఈవిషయం తన దృష్టికి రాలేదన్నారు. వీఆర్‌ఓ నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఎలాంటి కబ్జా జరగలేదన్నారు.