రైతు వేదికల నిర్మాణంలో..పుంజుకున్న వేగం
ABN , First Publish Date - 2020-06-18T11:21:55+05:30 IST
రైతు కేంద్రం గా వ్యవసాయం, కొనుగోళ్లు ఉండాలనేది రాష్ట్రప్రభుత్వ సంక ల్పం. అందులో భాగంగా రైతువేదికలు రానున్న
ఉమ్మడి జిల్లాలో రూ.69.80 కోట్లతో 314 ప్రాంతాల్లో నిర్మాణం
భూ సేకరణ 90శాతం పూర్తి
నల్లగొండ, జూన్, 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతు కేంద్రం గా వ్యవసాయం, కొనుగోళ్లు ఉండాలనేది రాష్ట్రప్రభుత్వ సంక ల్పం. అందులో భాగంగా రైతువేదికలు రానున్న నాలుగు నెల ల్లో పూర్తి చేయాలని తాజాగా కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో రూ.69.80 కోట్లతో 314 ప్రాంతాల్లో వేదికల నిర్మాణానికి అవసరమైన భూసేకర ణ ఇప్పటికే 90శాతం పూర్తయ్యింది. ప్రధాన అంకం పూర్తవడంతో రూ.22లక్షలతో నిర్మించే ప్రతి కేంద్రానికి టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఖరారు చేసే పనిలో జిల్లా కలెక్టర్లు ఉన్నారు.
రైతు కార్యకలాపాలన్నీ ఇక ఈ వేదికల నుంచే
20 గుంటలు అంటే దాదాపు అర ఎకరం విస్తీర్ణంలో సుమారు 1,600 చదరపు అడుగుల మేర ప్రతి వేదికను నిర్మించనున్నారు. హైదరాబాద్‌నుంచి వ్యవసాయ శాస్త్రవేత్త లు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులకు అందజేస్తారు. స్థానికంగా రైతులు సాగు చేస్తున్న పంటలు, మార్కెట్‌లో వాటి ధరలు వంటి సమాచారాన్ని వేదికల ద్వారా అందిస్తారు. మార్కెట్లలో ఉన్న సౌకర్యాలను వివరిస్తారు. వ్యవసాయాధికారులు పూర్తిగా ఈ వేదికల నుంచే విధులు నిర్వహిస్తారు.
90శాతం పూర్తయిన భూ సేకరణ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 314 ప్రాంతాల్లో రూ.69.80 కోట్లతో రానున్న నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తికానుంది. నల్లగొండ జిల్లాలో 140 చోట్ల వేదికలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే 120 ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు భూ సేకరణ పూర్తి చేసి వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించారు. మిగిలిన 20ప్రాంతాల్లో ఎన్‌ఎ్‌సపీ, ఆర్‌అండ్‌బీ శాఖల భూములు కావడంతో సేకరణ ప్రక్రియలో జాప్యం జరిగింది. నల్లగొండ జిల్లాలో రెండు చోట్ల దాతలు భూదానం చేశారు. యాదాద్రిలో 92 చోట్ల, సూర్యాపేటలో 82 చోట్ల వేదికలు నిర్మించాలని ఉండగా ఆ రెండు జిల్లాల్లో భూ సేకరణ నూటికి నూరుశాతం పూర్తయింది. 20 గుంటల భూమిలో చేపడుతున్న నిర్మాణాల్లో ఒక గదిలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఇఓ), మరో గదిలో రైతు సమన్వయ సమితి నేతలు, రైతుల కోసం మీటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి జగదీ్‌షరెడ్డి ఇప్పటికే భూమిపూజ చేశారు.
దేశచరిత్రలో లేని విధంగా వేదికలు పనిచేస్తాయి
దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రైతు వేదికల పనితీరు, ఫలితాలు ఉంటాయి. జిల్లా ప్రజలు మున్ముందు ఆ ఫలితాలను స్వయంగా చూస్తారు. ఇప్పటివరకు అసంఘటితంగా ఉన్న రైతును సంఘటింత చేసేందుకు రైతు వేదికలే కేంద్రం కానున్నాయి. రైతులకు సంబంధించిన సకల కార్యకలాపాలు ఈవేదికల్లోనే జరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి పంట వేయడం మొదలు రైతు తను మెచ్చిన ధరకు పంట అమ్ముకునే వరకు వేదికలోనే కార్యక్రమాల రూపకల్పన జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే వేదికలన్నిటికీ వరుసగా శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తాం.
మంత్రి జగదీష్ రెడ్డి