కాస్త నెమ్మదించిన కృష్ణమ్మ

ABN , First Publish Date - 2020-09-25T07:50:02+05:30 IST

ఎగువ నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో గురువారం సాయంత్రం నాలుగు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

కాస్త నెమ్మదించిన కృష్ణమ్మ

నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద

నాలుగు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల


నాగార్జునసాగర్‌, చింతలపాలెం, కేతేపల్లి, డిండి, శాలిగౌరారం, సెప్టెంబరు 24: ఎగువ నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో గురువారం సాయంత్రం నాలుగు క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు మొత్తం 1,05,185 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0405 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.60 అడుగులుగా(310.8498 టీఎంసీలుగా) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8,604 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6097, ఎస్‌ఎల్‌బీసీకి 1800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 28,948, నాలుగు క్రస్ట్‌ గేట్ల నుంచి 59,736, మొత్తం 1,05,185 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,17,626క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు (45.77టీఎంసీలు)కాగా, 174.60అడుగులకు (45.15టీఎంసీలు) చేరింది. ప్రాజెక్టు ఐదు క్రస్ట్‌గేట్లను మూడు మీటర్లు ఎత్తి, విద్యుత్‌ కేంద్ర ద్వారా మొత్తం 1,26,681క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో తగ్గింది. ఎగువ నుంచి 2940క్యూసెక్కుల వరద వస్తుండగా, ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 1504క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 645అడుగులు కాగా, ప్రస్తుతం 644.20అడుగులుగా ఉంది. ఇదిలా ఉండగా, మూసీ ఆయకట్టుకు రెండో విడత సాగునీటిని అధికారులు గురువారం విడుదల చేశారు. అక్టోబరు 9వ తేదీ వరకు 15రోజుల పాటు రెండో విడత నీటి విడుదల కొనసాగనుంది. ఇటీవల ప్రాజెక్టు కుడి కాల్వకు కేతేపల్లి శివారులో గండిపడటంతో దాన్ని శుక్రవారం పూడ్చి నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు. కాగా, డిండి ప్రాజెక్టు గరిష్ఠనీటిమట్టం 36 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఎగువ నుంచి 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టు జేఈ ఫయాజ్‌ తెలిపారు. శాలిగౌరారం ప్రాజెక్టు 21 అడుగుల గరిష్ఠ నీటిమట్టం వద్ద నిలకడగా ఉంది.

Updated Date - 2020-09-25T07:50:02+05:30 IST