కౌలు రైతు బలవన్మరణం

ABN , First Publish Date - 2020-11-25T06:16:34+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని పల్లెపహాడ్‌ గ్రామంలో ఈ ఘటన మంగళవారం జరిగింది.

కౌలు రైతు బలవన్మరణం

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌ గ్రామంలో ఘటన

నార్కట్‌పల్లి, నవంబరు 24: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.  మండలంలోని పల్లెపహాడ్‌ గ్రామంలో ఈ ఘటన మంగళవారం  జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం పల్లెపహాడ్‌ గ్రామానికి చెందిన ఆలకుంట్ల సైదులు (45)కు భార్య సునీత ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు.  స్వగ్రామంలో ఇద్దరు రైతుల ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తిని సాగు చేశాడు. ఈఏడాది అధిక వర్షాలకు పంటకు నష్టం వాటిల్లడంతో ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి సైదులును 108లో నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.  భార్య సునిత  కొన్ని రోజుల క్రితం పుట్టింటికి  కరీంనగర్‌  వెళ్లింది. ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి

నాంపల్లి, నవంబరు 24: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. నాంపల్లి మండలం ముస్తిపల్లిలో  ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది  ముస్తిపల్లి గ్రామనికి చెందిన నల్లగాసు జగత్‌(21) సోమవారం సాయంత్రం తమ వ్వవసాయ భూమి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావి లో పడ్డాడు. రాత్రి వరకు  జగత్‌ ఇంటికి రాకపోవడంతో  కుటుం బసభ్యులు పొలంలో వెతకగా బావిలో మృతదేహం కనిపించింది.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి పోలీసులు తెలిపారు. 


నగల దుకాణంలో చోరీ

రూ.6 లక్షలు విలువచేసే వెండి ఆభరణాల అపహరణ 

కొండమల్లేపల్లి, నవంబరు 24: కొండమల్లేపల్లి  బస్‌స్టేషన్‌ సమీపంలోగల శ్రీవెంకటే శ్వర నగల దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున దొంగలు పడి రూ.6 లక్షల విలువైన ఆరున్నర కేజీల వెండి ఆభరణాలను చోరీ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణం వెనుకభాగంలో ఉన్న వెంటిలేటర్‌ను దొంగలు తొలగించి లోపలికి ప్రవేశించి ఆరున్నర కేజీల వెండి ఆభరణాలు అపహరించారు.  నల్లగొండ  నుంచి వచ్చిన క్లూస్‌టీం, దుకాణంలో వేలిముద్రలు సేకరించింది. ఈ మేరకు దుకాణ యజమాని గద్దె వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు    ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి  తెలిపారు. ఇద్దరు మహిళా దొంగలు అరెస్టు

ఫ రూ.1.17 లక్షల సామగ్రి స్వాధీనం

నల్లగొండ క్రైం, నవంబరు 24: కాగితాలు ఏరుకుంటూ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత మహిళా దొంగలను నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.  వన్‌టౌన్‌ సీఐ నిగిడాల సురేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న జియో నెట్‌వర్క్‌ కార్యాలయంలో  ఈనెల 14వ తేదీన రిమోట్‌ రేడియో హెడ్‌ (ఆర్‌ఆర్‌హెచ్‌) చోరీ చేశారు.  ఈ మేరకు కట్టెమోని యాదగిరి ఫిర్యాదు  చేయ డంతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానంతో మంగళవారం మిర్యాల గూడ రోడ్డులో మహిళా ప్రాంగణం సమీపంలో రాంనగర్‌కు చెందిన చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే అన్నెపురి కోటమ్మ, అన్నెపురి రేణుకలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  రూ.95వేల విలువైన ఆర్‌ఆర్‌హెచ్‌తో పాటు మరో మూడు ఇస్త్రీ పెట్టెలను చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరి మహిళల నుంచి రూ.1.17 లక్షల విలువైన ఆర్‌ఆర్‌హెచ్‌, మూడు ఇస్ర్తీ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరిపై గతంలో నల్లగొండ టూటౌన్‌, నల్లగొండ రూరల్‌ పోలీస్‌స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, సిబ్బంది పాయిలి రాజు, ఎం.రాము, ఎండీ షకీల్‌, శ్రీను తదితరులు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 

చింతపల్లి, నవంబరు 24: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. చం డూరు మండలం ఘట్టుప్పల గ్రామానికి చెందిన భీమగాని లింగస్వామి(26) చింతపల్లి మండలంలోని కేవీఎస్‌ స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేస్తున్నాడు. ఈనెల 19న రాజ్యతండాలో రోడ్డు దాటుతున్న లింగస్వామిని  గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.  ఈఘటనలో తీవ్రంగా గాయపడిన లింగస్వామిని దేవరకొండ సివిల్‌ ఆసుపత్రికి తరలించగా, పరి స్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. లింగస్వామి సోదరుడు కిరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కల్లు దుకాణాల్లో శాంపిళ్ల సేకరణ 

కనగల్‌, నవంబరు 24: మండలంలోని నల్లగొండ - దేవరకొండ ప్రధాన రహదారిలో  పర్వతగిరి గ్రామశివారులో ఉన్న కల్లు దుకాణాల్లో ఎక్సైజ్‌ అధికారులు మంగళవారం శాంపిళ్లను సేకరించారు.  నల్లగొండ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ అశోక్‌ తన సిబ్బందితో కలిసి  దుకాణాల్లో విక్రయించే కల్లు శాంపిళ్లను సేకరించారు.  ఈ శాంపిల్స్‌ను టెస్టులకు పంపి  రిపోర్టు ఆధారంగా టీఎఫ్‌టీ లైసెన్స్‌దారులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. 


Read more