కొను‘గోల్‌మాల్‌’

ABN , First Publish Date - 2020-11-21T06:06:19+05:30 IST

ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి ధాన్యం విక్రయానికి రైతులకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోగా,మరోవైపు తూకాల్లో మోసాలతో రైతులు నష్టపోతున్నారు.

కొను‘గోల్‌మాల్‌’

చివ్వెంల మండలంలో మిల్లు వేబ్రిడ్జి వద్ద మోసాలు

హుజూర్‌నగర్‌లో పీఏసీఎస్‌ లీలలు

ధాన్యం తూకమెంతో రైతులకు చెప్పని మిల్లర్లు

చివ్వెంల, హుజూర్‌నగర్‌, నవంబరు 20: ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి ధాన్యం విక్రయానికి రైతులకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోగా,మరోవైపు తూకాల్లో మోసాలతో రైతులు నష్టపోతున్నారు. ధాన్యం తేమ17 శాతంలోపుఉంటే క్వింటాకు రూ.1888మద్దతుధర ఇవ్వాలి. కాగా,మిల్లర్లు రూ.1550 నుంచి రూ.1650 వరకే చెల్లిస్తున్నారు. ఇకవేబ్రిడ్జి కాంటాల తూకాల్లో సైతం గోల్‌మాల్‌ చేస్తున్నారు.

 పెన్‌పహాడ్‌ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాక్టర్‌లో ఈ నెల 18న వల్లభాపురం గ్రామ సమీపంలోని జగన్‌మాత రైస్‌మిల్లుకు ధాన్యం తెచ్చాడు. వేబ్రిడ్జి తూకం వేయగా, ట్రాక్టర్‌తో కలిపి 8630 కిలోలో వచ్చింది. అందులో ట్రాక్టర్‌ ట్రక్కుతో కలిపి 3665 కిలోలు వచ్చింది. అంటే ధాన్యం తూకం 4965 కిలోలు. అదే ట్రాక్టర్‌ లో గ్రామానికి చెందిన మరో రైతు శుక్రవారం అదే మిల్లుకు ధాన్యాన్ని తెచ్చాడు. ట్రాక్టర్‌తో కలిపి ధాన్యం 5725 కిలోలు తూగింది. అందులో ట్రాక్టర్‌ ట్రక్కుతో కలిపి తూకం 3550 కిలోలు రాగా, ధాన్యం 2175 కిలోలు వచ్చింది. ఈ నెల 18న వచ్చిన ట్రాక్టర్‌ తూకానికి, శుక్రవారం అదే ట్రాక్టర్‌ తూకానికి మధ్య 115 కిలోల తేడా వచ్చింది. అనుమానం వచ్చిన ఈరైతు మరో ట్రాక్టర్‌లోని ధాన్యాన్ని దురాజ్‌పల్లి వద్ద ఉన్న వేబ్రిడ్జి కాంటాలో తూకం వేయించగా 5425 కిలోలు వచ్చింది. అదే లోడు రైస్‌ మిల్లులోని వేబ్రిడ్జి వద్ద ఒక మారు 5310 కిలోలు, ఇంకోమారు తూకం వేయగా, 5380 కిలోలు రావడంతో నివ్వెరపోయాడు. ఇదేంటని మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించగా, అదనంగా రెండు క్వింటాళ్ల ధాన్యానికి డబ్బు చెల్లిస్తానని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. గట్టిగా వాదిస్తే బెదిరింపులకు దిగడంతో ఆ రైతు ధాన్యం విక్రయించకుండానే వెనుతిరిగాడు.

 హుజూర్‌నగర్‌ పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరు మరోలా ఉంది. సాధారణంగా రైతులు తెచ్చిన ధాన్యాన్ని పీఏసీఎస్‌ కేంద్రంలో కాంటా వేసి మిల్లుకు తరలించాలి. కానీ ఇక్కడ మాత్రం రైతులకు ఖాళీ బస్తాలు ఇస్తున్నారు. రైతులు వాటి నిండా ధాన్యం నింపి ట్రాక్టర్‌కు లోడు ఎత్తాక పీఏసీఎస్‌ నిర్వాహకులు ట్రక్‌ షీట్‌ ఇచ్చి మిల్లుకు పంపుతున్నారు. అక్కడ మిల్లర్లు ధాన్యాన్ని వేబ్రిడ్జి వద్ద కాంటా వేసి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే వేబ్రిడ్జి వద్ద ధాన్యం ఎంత తూగిందో రైతుకు చెప్పడం లేదు. వేబ్రిడ్జి బిల్లుగానీ, ట్రక్‌ షీట్‌గానీ రైతులు ఇవ్వడం లేదు. దీంతో రైతుకు తన ధాన్యం ఎంతో కూడా తెలియడం లేదు. ఇదేంటని మిల్లర్‌ను ప్రశ్నిస్తే పీఏసీఎస్‌ నిర్వాహకులు బిల్లులు ఇవ్వవద్దని చెప్పారని సమాధానమిస్తున్నారు. అయితే పీఏసీఎస్‌ నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం తూకం చెప్పకుండా ఎంతో కొంత బిల్లు ఇస్తూ మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.


ధాన్యం విక్రయించిన రోజు బిల్లులు ఇవ్వలేదు : రంగయ్య, రైతు, హుజూర్‌నగర్‌

ధాన్యం 120 బస్తాలు పీఏసీఎస్‌ అధికారులకు విక్రయించా. ట్రాక్టర్‌లో మిల్లుకు తరలించగా, వేబ్రిడ్జి వద్ద వేసిన తూ కంలో ఎన్ని క్వింటాళ్లు వచ్చిందో చెప్పలేదు. బిల్లు ఇవ్వాలని అడిగితే కుదరదన్నారు. పీఏసీఎస్‌ నిర్వాహకులను అడిగితే డబ్బులు ఇచ్చేటప్పుడు ధాన్యం ఎన్ని క్వింటాళ్లో చెబుతామన్నారు. కాంటా వేయగానే బిల్లు ఎందుకు ఇవ్వడం లేదు?


రైస్‌మిల్లు యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు

మద్దతు ధర ఇవ్వడం లేదని రైతుల ఫిర్యాదు

మిర్యాలగూడ రూరల్‌: మద్దతు ధర చెల్లించకుండా సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్న మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలోని రాఘవేంద్ర రైస్‌మిల్లు యాజమాన్యంపై శుక్రవారం క్రిమినల్‌ కేసు నమోదైంది. రైస్‌మిల్లులో రూ.1700-రూ.1710కే ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయమై రైతులు కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేయటంతో సివిల్‌ సప్లై డీటీ, మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ పరమేష్‌, దామరచర్ల ఏవో కల్యాణ చక్రవర్తి తనిఖీ చేశారు. ధరలు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల సూచన మేరకు మిల్లు సీజ్‌ చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ బృందం ఫిర్యాదు మేరకు మిల్లు యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేశామని ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సన్నాలు కొనుగోలు చేయాలి

నూతన్‌కల్‌ : సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నూతన్‌కల్‌, ఎడవెల్లి గ్రామానికి చెందిన రైతులు సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాల్లో సాంబమసూరి, ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మిగతా రకాలను కొనుగోలు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. మిగతా సన్నాలను మిర్యాలగూడ రైస్‌ మిల్లుల్లో విక్రయించాలని అధికారులు చెప్పడం దారుణమన్నారు. అంత దూరం ట్రాక్టర్‌ కిరాయిలకే ఎక్కువ ఖర్చు అవుతుందని, దీంతో రైతులపై భారం పడుతుందన్నారు. వెంటనే సన్నాల్లోని అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల రాస్తారోకోకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి మట్టిపెల్లి సైదులు, సీపీఎం మండల కార్యదర్శి శంకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. గంట సేపు రాస్తారోకోతో రెండువైపులా ట్రాఫిక్‌ నిలిచింది. సమచారం తెలుసుకున్న సూర్యాపేట ఆర్డీవో సీపీఎం నాయకులతో ఫోన్‌లో మాట్లాడి రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

Read more