టీపీసీసీ అధ్యక్ష పదవి నాదే: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ABN , First Publish Date - 2020-12-10T18:57:28+05:30 IST
టీపీసీసీ అధ్యక్ష పదవి తనదేనంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో నాలుగు రోజుల్లో ప్రజలే చూస్తారని ఏబీఎన్‌తో మాట్లాడుతూ చెప్పారు.

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష పదవి తనదేనంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో నాలుగు రోజుల్లో ప్రజలే చూస్తారని ఏబీఎన్‌తో మాట్లాడుతూ చెప్పారు. అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకపోయినా తాను మాత్రం బీజేపీలో చేరేది లేదని మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీలు మారే సంస్కృతి తనది కాదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడికి కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తాను.. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వైఎస్సార్ మాదిరి గ్రామగ్రామాన పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చెప్పారు. ‘కాంగ్రెస్‌లో గ్రూపులు ఉన్నాయి కదా?’ అని ఏబీఎన్ ప్రశ్నించగా.. టీఆర్ఎస్‌లో కూడా గ్రూపులు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.