కాటేసిన కరోనా

ABN , First Publish Date - 2020-11-16T05:26:26+05:30 IST

కరోనా పేద మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేసింది. ఉపాధి కోల్పోయిన బడుగుజీవులు ఇద్దరు నల్లగొండ జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డారు.

కాటేసిన కరోనా
కరోనాతో ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లు, శంకర్ (ఫైల్)

ఉపాధి లేక, ఉద్యోగం దొరక్క

ఇద్దరి బలవన్మరణం

పండుగపూట విషాదాలు


మిర్యాలగూడ అర్బన్‌, నార్కట్‌పల్లి, నవంబరు 15: కరోనా పేద మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేసింది. ఉపాధి కోల్పోయిన బడుగుజీవులు ఇద్దరు నల్లగొండ జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. మిర్యాలగూడ పట్టణంలోని సీతారామపురం కాలనీకి చెందిన బొమ్మకంటి వెంకటేశ్వర్లు(32) కొంతకాలంగా రెండు ప్రైవేట్‌ కళాశాలల్లో కామర్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో భార్య, ఇద్దరు కుమార్తెలతో సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. లాక్‌డౌన్‌తో కళాశాలలు మూతపడటంతో ఎనిమిది నెలలుగా కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ఇటీవల పెద్దకుమార్తె హర్షితకు అనారోగ్య సమస్య తలెత్తటంతో శస్త్రచికిత్సకు రూ.70వేలు ఖర్చు పెట్టాడు. ఆర్థిక ఇబ్బందులు, కుమార్తెకు అనారోగ్యంతో కొద్దికాలంగా మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నాడు. భార్యాపిల్లలు దీపావళి పండుగకు బంధువుల ఇంటికి వెళ్లగా, ఒంటరిగా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర్లు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. శనివారం సాయంత్రం ఊరికి వస్తానని చెప్పిన వెంకటేశ్వర్లుకు కుటుంబీకులు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో, ఇంటికొచ్చి చూడగా ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడడాన్ని చూసి బోరుమన్నారు. నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన బొబ్బలి యాదయ్య-ఆండాలు దంపతులకు కుమార్తె, కుమారుడు శంకర్‌(21) ఉన్నారు. శంకర్‌కు ఏడాది క్రితం చెర్వుగట్టుకు చెందిన యువతితో వివాహమైంది. తండ్రి యాదయ్యకు మండలంలోని అక్కెనపల్లిలో రెండు ఎకరాల సొంత భూమి ఉండగా, కౌలుకు ఇచ్చి, చెర్వుగట్టు సమీపంలోని ఓ రైతుకు చెందిన నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పంటనష్టంపోగా అప్పు మిగిలింది. అప్పులు తీర్చేందుకు కుమారుడు శంకర్‌ను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని తండ్రి యాదయ్య మందలించాడు. ఉద్యోగం దొరక్కలేదన్న మనస్తాపానికి గురైన శంకర్‌ ఇంటి నుంచి ఈ నెల 12వ తేదీన బైక్‌పై బయటికివెళ్లి తిరిగిరాలేదు. నల్లగొండ మండలం చర్లపల్లి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పురుగుల మందు తాగిన ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు శనివారం పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది శంకర్‌ మృతదేహంగా గుర్తించారు. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.


మూసీలో పడి బాలిక మృతి

పండుగ పూట విషాదం

వలిగొండ, నవంబరు 15: ఆడుకునేందుకు వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు మూసీలో పడి మృతి చెందింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సంగెం గ్రామానికి చెందిన మహేష్‌ పద్మ దంపతుల కుమార్తె మన్విత(11) మరో ముగ్గురు చిన్నారులతో కలిసి పొలాల వద్దకు ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు భీమలింగం కత్వ వద్ద మూసీ నదిలో పడింది. ఒడ్డున ఉన్న మిగిలిన పిల్లలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా; గాలింపు చేపట్టడంతో మృతదేహం దొరికింది. దీపావళి పండుగ మర్నాడే చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బాలిక తల్లి బీబీనగర్‌లోని పీహెచ్‌సీలో వైద్య సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-11-16T05:26:26+05:30 IST