కల్యాణలక్ష్మి ఏమాయె?.. ఏడాదిగా 7398 దరఖాస్తులు పెండింగ్

ABN , First Publish Date - 2020-08-12T17:12:09+05:30 IST

పేదింటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం ఇస్తానన్న కల్యాణలక్ష్మి సాయం అందట్లేదు. పెళ్లయి ఏడాదైనా నిధులు మంజూరు గాక లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

కల్యాణలక్ష్మి ఏమాయె?.. ఏడాదిగా 7398 దరఖాస్తులు పెండింగ్

రెవెన్యూ సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్దిదారులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): పేదింటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం ఇస్తానన్న కల్యాణలక్ష్మి సాయం అందట్లేదు. పెళ్లయి ఏడాదైనా నిధులు మంజూరు గాక లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు, ఇప్పుడంటూ, చివరికి బడ్జెట్‌ రానిది ఏమీ చేయలేమని కాలం వెళ్లబుచ్చిన అధికారులు, తాజాగా కరోనా బూచి చూపి తప్పించుకుంటున్నారు.


కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,00,116 సాయంగా ఇస్తోంది. ఈ పథకం 2016 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. కాగా, 2019లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కోసం 7,398 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కల్యాణ లక్ష్మి 7,100, షాదీముబారక్‌ 298 దరఖాస్తులు ఉన్నాయి. వీరికి ఏడాదికాలంగా ఎదురు చూపులే మిగిలాయి. అయితే ఈ పథకానికి వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు విచారణ నిర్వహించాలి. అనంతరం వాటిని స్థానిక ఎమ్మెల్యేతో ధ్రువీకరించు కొని ఆయా సంక్షేమశాఖలకు పంపాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వచ్చిన దరఖాస్తులను క్లియర్‌ చేయ కుండా తహసీల్దార్లు వాటిని పక్కనపెడుతున్నారు. ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు జమ అయ్యాక అన్నీ ఒకేసారి విచారణ నిర్వహించి, ఎమ్మెల్యేలతో ధ్రువీక రించుకుంటున్నారు. ఫలితంగా జాప్యం ఏర్పడుతుండ గా, లబ్ధిదారుల జాబితా సంక్షేమశాఖలకు సకాలంలో చేరడంలేదు. బడ్జెట్‌ మంజూరై తీరా నిధులు వెనక్కి వెళ్లే సమయంలో రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల జాబితాలు పంపిస్తుండటంతో సంక్షేమశాఖ అధికారులకు ఏంచేయాలో తోచడం లేదు. ఈ రెండు శాఖ ల మధ్య సమన్వయలోపం కారణంగా నెలలకొద్దీ లబ్ధి దారులు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ తిరగాల్సి వస్తోంది. 2019లో వచ్చిన దరఖాస్తులకు నేటికీ మోక్షం లభించకపోగా, మొన్నటి వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే మేం ఏంచేయాలని చెప్పిన అధికారులు, ప్రస్తుతం కరోనా పేరుచెప్పి నిధులు రావడంలేదని తప్పించుకుంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి

కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి జిల్లా వ్యాప్తం గా 7,100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అం దులో తహసీల్దార్లు విచారణ చేయాల్సినవి 1710 ఉండగా, ఎమ్మెల్యేల అనుమతి కోసం 936 దర ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు ధ్రువీకరించి, ఆయా సంక్షేమశాఖల వద్ద 1,404 దర ఖాస్తులు, నిధులు మంజూరైనా కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ కోసం రెండు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. నిధులు లేక ట్రెజరీలో 1,305 పెండింగ్‌ ఉండగా, ట్రెజరీలో నిధులు మంజూరై లబ్ధిదారుల చేతికి ఇంకా సొమ్ము అందని దరఖాస్తులు 1,738 ఉన్నాయి. దేవరకొండ డివిజన్‌ నుంచి రెండు వేల దరఖాస్తులు, మిర్యాలగూడ డివిజన్‌ నుంచి 2,110, నల్లగొండ డివిజన్‌ నుంచి 2,990 దరఖాస్తులు వివిధ దశల్లో పెం డింగ్‌లో ఉన్నాయి. ఇక షాదీముబారక్‌ దరఖాస్తులు 298వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్ల విచారణ కోసం ఎదరుచూస్తున్న వాటి సంఖ్య 122 కాగా, విచారణ పూర్తయి ఎమ్మెల్యేల అనుమతి కోసం ఉన్నవి 41. ఎమ్మెల్యేల అనుమతి పొంది సెక్షన్లలో పెండింగ్‌లో ఉన్నవి 21, నిధులు లేక ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉన్నవి 62, బిల్లుపాసై నిధులు లేక లబ్ధిదారులకు సొమ్ము అందని దరఖాస్తులు 52 ఉన్నా యి. దేవరకొండ డివిజన్‌ నుంచి 54, మిర్యాలగూడ నుంచి 113, నల్లగొండ నుంచి 131 మొత్తంగా, 298 షాదీముబారక్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 


ఏడాదిగా నిధులు లేవు: గోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ, సూపరింటెండెంట్‌

ఏడాదిగా నిధులు రాక కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మధ్య నిఽధులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం. అప్పుడు ట్రెజరీల ద్వారా లబ్ధిదారులకు బిల్లులు పాసై సొమ్ము చేతికి అందుతుంది.


రోజు కూలి తప్ప వేరే ఆధారం లేదు: వెలుగు రాములు, లబ్ధిదారుడు, అనంతారం

రోజు కూలి తప్ప నాకు వేరే ఆధారం లేదు. నా బిడ్డకు హైదరాబాద్‌ సంబంధం చూసి పెళ్లి చేసి ఎనిమిది నెలలు అయింది. కల్యాణలక్ష్మికి దరఖా స్తు చేసి ఆరు నెలలైంది. ఈ పైసలు వస్తే కొంత ఆసరా అవుతుందని రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. అధికారులను అడిగితే ఆన్‌లైన్‌ అయిందని, అప్పుడు.. ఇప్పుడంటూ చెబుతున్నారు.


రెవెన్యూ అధికారుల స్పందనలో జాప్యం: జి.వెంకటేశ్వర్లు, మైనారిటీ సంక్షేమశాఖ అధికారి

నిధుల కొరత లేదు. దరఖాస్తులు వచ్చాక విచారణ, ఎమ్మెల్యేల అనుమతి తీసుకొని మాకు జాబితా పంపాలి. గత ఏడాది మైనారిటీ సంక్షేమశాఖకు రూ.1.20కోట్లు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిధుల వెనక్కి వెళ్తాయని ఒత్తిడి చేస్తే రెవెన్యూ అధికారులు 120 మంది జాబితా పంపించగా, వారికి డబ్బులు అందాయి. చివరి నిమిషంలో రెవెన్యూ అధి కారులు జాబితాలు ఇస్తుండటం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


ఎమ్మెల్యే సంతకం పెండింగ్‌లో ఉంది: కంచుకొమ్ముల సైదులు, లబ్ధిదారుడు, తిప్పర్తి

ఈ ఏడాది జనవరిలో నా కూతురుకు వివాహం చేశా. ఫిబ్రవరిలో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేయగా, ఇప్పటి వరకు డబ్బులు అందలేదు. ఏం జరిగిందా అని విచారిస్తే నా దరఖాస్తు ఎమ్మెల్యే వద్ద పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-08-12T17:12:09+05:30 IST