ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2020-09-21T06:56:16+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ

ముంచెత్తిన వాన

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, సెప్టెంబరు 20: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఉదయం 8.30గంటల వరకు 14.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. దేవరకొండ 57.4మి.మీ, అనుమల 46.7, కొండమల్లేపల్లి 43, పీ.ఏ.పల్లిల్లో 33, పెద్దవూర 21.2, మర్రిగూడ 39.1, చింతపల్లి 29, డిండి 13.9, చందంపేట 8.8, గుర్రంపోడు 8.4, నాంపల్లిలో 7.5, నేరేడుగొమ్ములో 5.8 మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 458.1మీ.మీ కాగా, 576.5 మీ.మీ వర్షపాతం నమోదైంది. 26 శాతం వర్షం అధికంగా కురిసింది. తాజా వర్షాలతో జిల్లాలో సుమారు 4వేల ఎకరాల్లో పత్తి పంట నీటమునిగింది. హాలియా మునిసిపాలిటీ, అనుముల మండలంలో భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి.


జంగాల కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. హాలియా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనుముల-రామడుగుకు వెళ్లే బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో కేతేపల్లి మండలంలోని గుడివాడ, భీమారం, చెరుకుపల్లి, చీకటిగూడెం, కొర్లపహాడ్‌, కేతేపల్లి, కొత్తపేట గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 600ఎకరాల్లో వరి, 300ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నట్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భూదాన్‌పోచంపల్లితోపాటు మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మైసమ్మకత్వ, పెద్దరావులపల్లి, పిలాయిపల్లి లోలెవల్‌ బ్రిడ్జిల వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. పిలాయిపల్లి కాల్వకు వరద తాకిడి ఎక్కువైంది. పోచంపల్లి, రేవణపల్లి చెరువులు అలుగుపోస్తున్నాయి. తుంగతుర్తి మండలంలో భారీ వర్షానికి పలు గ్రామాల్లో విద్యుత్‌కు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్‌ అధికారులు మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు.


ప్రాజెక్టులకు పర్యాటకుల తాకిడి

నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తడం, ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్‌కు తరలివచ్చారు. కొవిడ్‌-19 నిబంధనల కారణంగా సాగర్‌కు రావొద్దని ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు పర్యాటకులను హెచ్చరించినా ఎవరూ లెక్కచేయలేదు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉండగా, కిలోమీటరు దూరంలో ఉన్న కొత్త వంతెనపై నుంచి పర్యాటకులు సాగర్‌ అందాలు తిలకించారు. సాగర్‌కు భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో కొత్త వంతెనపై, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. సాగర్‌ ఎస్‌ఐ శీనయ్య ఆధ్వర్యంలో సిబ్బందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మూసీ పొంగిపొర్లుతుండటంతో పరిసర గ్రామాలు, సూర్యాపేట, నకిరేకల్‌ పట్టణాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. గేట్ల ద్వారా దుముకుతున్న వరద పరవళ్లు, మత్స్యకారుల చేపల వేటను తిలకించి పరవశించారు. డ్యాంతో పాటు ఇరువైపులా ఉన్న ఎర్త్‌డ్యాంలు సందర్శకులు, వాహనాలతో కిక్కిరిశాయి. డిండి ప్రాజెక్టుకు సైతం పర్యాటకుల తాకిడి పెరిగింది.

Updated Date - 2020-09-21T06:56:16+05:30 IST