ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరు కావాలి
ABN , First Publish Date - 2020-11-27T05:40:44+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులకు పోలింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.

నల్లగొండ రూరల్, నవంబరు 26: జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధులకు పోలింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవనంలో పోలింగ్ అధికారులకు జరిగిన శిక్షణలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 532 మంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారని తెలిపారు. పీవోలు, ఏపీవోలుగా నియమితులైన వీరికి ఎన్నికల విధుల నుంచి ఎలాంటి మినహాయింపు లేదన్నారు. విధులపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 1న నిర్వహించే ఎన్నికకు ఒకరోజు ముందుగానే కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బందిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఈ నెల 30న ఉదయం 7 గంటలకు ఎన్జీ కళాశాల మైదానం నుంచి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్నిక పూర్తయ్యాక, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి నల్లగొండకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. బ్యాలెట్ బ్యాక్సుల వినియోగం, ఇతర విధులను శిక్షణలో వివరంగా తెలుసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల సంఘం నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. అంశాలపై గురువారం శిక్షణకు హాజరు కాని సిబ్బందికి శుక్రవారం మరోమారు శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణకు సైతం గైర్హాజరైన సిబ్బందిపై చర్యలుంటాయని అన్నారు. శిక్షణలో అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, డీఈవో బి.బిక్షపతి, మాస్టర్ టైన్రర్లు బి.రంగారావు, తరాల పరమేశ్ యాదవ్, రమేష్, కిషోర్ కుమార్, శేషగిరిరావు, సలీం తదితరులు పాల్గొన్నారు.