పల్లెల్లో మళ్లీ గుడుంబా రక్కసి
ABN , First Publish Date - 2020-12-06T05:23:08+05:30 IST
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపింది. సారా తయారీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాపారులు, తయారీదారులపై ఎక్సైజ్‌శాఖ పీడీయాక్ట్ నమోదు చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సారాయి తయారీ పూర్తిగా బంద్ అయింది. దీంతో పని పూర్తయిందని అధికారులు భావించి క్షేత్రస్థాయి విధులను పక్కనపెట్టారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు మళ్లీ గుడుంబా(సారా) తయారీ, అమ్మకాలు ప్రారంభించారు.

పొరుగు జిల్లాలు, రాష్ట్రం నుంచి దిగుమతవుతున్న బెల్లం, పటిక
గుట్టుగా సాగుతున్న దందా
తండాలు, మారుమూల గ్రామాల నుంచి సరఫరా
ఎక్సైజ్ తనిఖీలు నిల్
మిర్యాలగూడ అర్బన్, డిసెంబరు 5: రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపింది. సారా తయారీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాపారులు, తయారీదారులపై ఎక్సైజ్‌శాఖ పీడీయాక్ట్ నమోదు చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సారాయి తయారీ పూర్తిగా బంద్ అయింది. దీంతో పని పూర్తయిందని అధికారులు భావించి క్షేత్రస్థాయి విధులను పక్కనపెట్టారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు మళ్లీ గుడుంబా(సారా) తయారీ, అమ్మకాలు ప్రారంభించారు. ప్రధానంగా లాక్‌డౌన్ సమయంలో మద్యం ప్రియులు మందుచుక్క కోసం వెంపర్లాడారు. ఇదే సమయంలో తండాలు, మారుమూల గ్రామాల్లో గుడుంబా రక్కసి చాపకింద నీరులా విస్తరించింది.
రాత్రివేళలో బెల్లం, పటిక విక్రయాలు
సారా తయారీకి అవసరమైన ముడిసరుకులపై ప్రభుత్వం నిషేధం విధించినా కొందరు వ్యాపారులు చీకటి బేరానికి తెరతీశారు. ప్రైవేటు వాహనాలు, ట్రాన్స్‌ఫోర్టు లారీల్లో బెల్లం, పటికను తండాలు, రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు తరలించి డంప్ చేస్తున్నారు. ప్రధానంగా ఏపీ సరిహద్దు జిల్లాతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా రు. రహస్య ప్రదేశాల్లో నిల్వచేసిన ముడిసరుకును రాత్రివేళల్లో నమ్మకమైన వినియోగదారులకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అధికారుల ఉదాసీనవైఖరి అక్రమార్కులకు కలిసొస్తుండగా, ఉమ్మడి జిల్లాలోని శివారు గ్రామాలు, తండాలతోపాటు కృష్ణపట్టెలో గుడుంబా తయారీ యథేచ్ఛగా సాగుతోంది.
ప్యాకెట్ రూ.300
సారా తయారీదారులు ప్యాకెట్లలో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 650ఎంఎల్ ప్యాకెట్‌ను రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. సారా తయారీకి నల్లబెల్లం లభించకపోవడంతో తెల్లబెల్లం, పట్టికతోపాటు యూరియా, కుళ్లిన పండ్లతో సారా తయారు చేస్తున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ , హుజూర్‌నగర్ డివిజన్ల పరిధిలోని కృష్ణపట్టె ప్రాంతాల్లో తయారయ్యే సారాను మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గుడుంబాపై నిషేధం విధించిన క్రమంలో తయారీదారులకు జీవనోపాధికి అవసరమైన రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో కృష్ణపట్టెతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలవాసులు పాతవృత్తికి ప్రాధాన్యమిస్తున్నారు. కృష్ణపట్టె ప్రాంతాల్లో తయరైన గుడుంబాను కొందరు పగలు, రాత్రివేళల్లో పుట్టిసాయంతో కృష్ణానది దాటించి ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ప్యాకెట్‌కు అక్కడ రూ.400 వరకు గిట్టుబాటవుతోంది. ఇదిలా ఉంటే దామరచర్ల, అడవిదేవులపల్లి, పాలకవీడు, నేరేడుచర్ల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర, దేవరకొండ తదితర మండలాల్లో చిన్నసైజు ప్యాకేట్లలో గుడుంబా లభిస్తుండగా, ఒక్కో ప్యాకేట్‌కు రూ.50 చెల్లించి మద్యం ప్రియులు ఆస్వాదిస్తున్నారు. జేబుల్లో పెట్టుకొని వెళ్లేందుకు వీలుండడంతో యువత సైతం బానిస అవుతోంది.
తనిఖీలు లేక..
సారా తయారీ, అమ్మకాలను కట్టడి చేసే విషయంలో ఎక్సైజ్‌శాఖ విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్కడినుంచైనా సమాచారం అందితేగానీ ఎక్సైజ్ అధికారులు కార్యాలయం దాటి వెళ్లడంలేదు. ఎస్‌ఐ స్థాయి అధికారులైతే గ్రామాలకు వెళ్లడమే మానేశారు. బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాలని ఎవరు మెరపెట్టుకున్నా పెడచెవిన పెడుతున్నారు. గ్రామాలకు వెళితే ప్రజలు నిలదీస్తారన్న భయం, మద్యం బాటిళ్లు పట్టుకుంటే వ్యాపారుల నుంచి ఒత్తిడి వెరసి క్షేత్రస్థాయి విధులను ఎక్సైజ్ శాఖ మరిచిపోయింది. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో శివారు గ్రామాలు, తండాల్లోని కొందరు బెల్టుషాపుల నిర్వాహకులు సారా కూడా తయారు చేసి గుట్టుగా విక్రయిస్తున్నారు. సారాతోపాటు ఉమ్మడి జిల్లాలో గంజాయి అమ్మకాలు కూడా పెరిగాయి.
తనిఖీలు చేస్తున్నాం : మురళీధర్, మిర్యాలగూడ ఎక్సైజ్ సీఐ
గుడుంబా తయారీని కట్టడి చేసేందుకు తనిఖీలు చేస్తున్నాం. గ్రామాల్లో ఎవరై నా సారా తయారు చేసి విక్ర యిస్తే సమాచారం ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 18 గుడుంబా కేసులు నమోదు చేసి 22మందిని అరెస్టు చేశాం. ఆయా కేసుల్లో 70లీటర్ల సారాతోపాటు, 12క్వింటాళ్ల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నాం. వీటి రవాణాకు వినియోగించిన 12 వాహనాలను సీజ్‌చేశాం. అధికారులు గ్రామస్థాయిలో పర్యటించేలా చర్యలు తీసుకుంటాం.