మొక్కులు చెల్లించుకున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-02-08T11:08:49+05:30 IST

రాజాపేట మండలం చిన్నమేడారం శ్రీసమ్మక్క సారలమ్మల నాలుగు రోజులపాటు జరిగే జాతరలో భాగంగా శుక్రవారం భక్తులు మొక్కులు

మొక్కులు చెల్లించుకున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి

రాజాపేట, ఫిబ్రవరి 7: రాజాపేట మండలం చిన్నమేడారం శ్రీసమ్మక్క సారలమ్మల నాలుగు రోజులపాటు జరిగే జాతరలో భాగంగా శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెలపై కొలువైన సమ్మక్క సారలమ్మలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల గద్దెల చుట్టూ భక్తులు ప్రదక్షిణలుచేస్తూ టెంకాయ, బంగారం, ఒడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణం శివసత్తుల పూనకాలతో మారుమోగింది. బంగా రం, తలనీలాలు అమ్మవార్లకు సమర్పించుకున్నారు. వివిధ జిల్లాలనుంచి వచ్చిన భక్తులు ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. 

ప్రముఖుల పూజలు

చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని ప్రముఖులు శుక్రవారం సందర్శించారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. గద్దెల చుట్టూ ప్రదక్షణలు చేసి అమ్మవార్లను వేడుకున్నారు.  అదేవిధంగా కాంగ్రెస్‌ నాయకులు  క ల్లూరి రాంచంద్రారెడ్డి, బీర్ల అయిలయ్య, బీజేపీ నాయకులు ఊట్కూరి అశోక్‌గౌడ్‌, తహసీల్దార్‌ జయమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

ప్రభుత్వ విప్‌ సందడి 

చిన్న మేడారం ఆలయాన్ని విప్‌ సునీత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర జరిగే ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు నిర్వాహకులతో కలియతిరిగారు. దుకాణదారులను యోగ క్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు. మహిళా నాయకులకు గాజులను కొనుగోలుచేసి ఇచ్చారు. బొమ్మలు ఉంగరాలు, కీ చైన్లను కొని సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు బహూకరించారు. బూరలు, విజిల్స్‌ కొనుగోలుచేసి ఊదారు. మిఠాయి దుకాణాల్లో మిఠాయిలు కొనుగోలుచేసి కార్యకర్తలకు తినిపించారు. 

నేడు జనంనుంచి వనంలోకి దేవతలు 

నాలుగు రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న సమ్మక్క సారలమ్మలు జనంనుంచి వనంలోకి శనివారం చేరుతారు. భక్తుల పూజలందుకున్న సారలమ్మను చిన్నమేడారంనుంచి కుర్రారం వైపుఉన్న ఏదులగుట్ట పైకి, సమ్మక్కను బూరుగుపల్లి వైపునున్న పులిగుట్టపైకి సాగనంపుతారు.  


Updated Date - 2020-02-08T11:08:49+05:30 IST