ట్రాన్స్‌ఫార్మర్ల గోల్‌మాల్
ABN , First Publish Date - 2020-11-25T05:53:21+05:30 IST
విద్యుత్‌శాఖ మంత్రి జిల్లావారే అనే భయం కూడా ఆ శాఖ సిబ్బందిలో లేదు. చేయి తడిపితే చాలు మూడు రోజుల్లో ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తున్నారు.

కాసులిస్తే మూడు రోజుల్లోనే ఏర్పాటు
పేరు ఒకరిది, కనెక్షన్ మరొకరికి
దళితుల పేరిట మీటర్లు ఇతరులకు వినియోగం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): విద్యుత్‌శాఖ మంత్రి జిల్లావారే అనే భయం కూడా ఆ శాఖ సిబ్బందిలో లేదు. చేయి తడిపితే చాలు మూడు రోజుల్లో ట్రాన్స్‌ఫార్మర్ బిగిస్తున్నారు. ఒకరి పేరు మీద మంజూరు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ మరొకరికి అమరుస్తున్నారు. దళితులకు విద్యుత్ బిల్లుల్లో ప్రభుత్వం రాయితీ ఇస్తుండగా, వారికి తెలియకుండానే మీటర్లు మంజూరవడంతోపాటు, బిల్లులు సైతం వస్తున్నాయి. వీటిని ఇతరుల ఇళ్లలో బిగిస్తున్నారు. నాగార్జునసార్ నియోజవర్గంలో ఏఈలు, లైన్‌మన్లు ఈ విషయంలో ముందుండి చేతివాటం చూపుతున్నారు. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సీరియల్ నిబంధనలను తుంగలో తొక్కారు. కొత్త స్తం భం ఎత్తాలంటే రూ.3వేలు, పొలంలో స్తంభానికి రూ.10వేలు, సీరియల్‌తో సంబంధం లేకుండా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.50వేలకు పైగానే ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు.
అనుముల మండలం రామడుగు గ్రామస్థుడికి 19517-18, 24-06-17 మెమో నంబర్ల కింద ట్రాన్స్‌ఫార్మర్, సామగ్రి మంజూరైనట్టు మిర్యాలగూడ ఆఫీసులో రిజిష్టర్ అయింది. దీనికి సంబంధించిన లైను రామడుగు శివారులో కాకుండా నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామ శివారులో లాగి వదిలేశారు. ఇప్పటికీ ఇక్క డి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కడ ఉందో తెలియదు.
అనుముల మండలం రామడుగు శివారు అయిన చింతగూడెంలో ఎలాంటి ఎస్టిమేషన్స్, మంజూరు లేకుండానే ఈ ఏడాది జూన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ బిగించారు. ఆ తరువాత పలువురి ఫిర్యాదుతో సెప్టెంబరు 26న ఆ గ్రామ హెల్పర్ ట్రాన్స్‌ఫార్మర్ తీసుకొని వెళ్లిపోయాడు. భారీ మొత్తంలో డబ్బు తీసుకొని ట్రాన్స్‌ఫార్మర్ తీసుకొ ని ఎవరో ఫిర్యాదు చేస్తే తీసుకెళ్తారా అని ఆ రైతు గొడవ చేయగా, శ్రీనాథపురం శివారులో ఉన్న ఓ తోట నుంచి అనఽధికారికంగా సర్వీస్ కనెక్షన్ కలిపారు. తొలుత రైతుకు బిగించిన 200492201 నెంబర్ ట్రాన్స్‌ఫార్మర్ ఎటు వెళ్లిందో, అధికారులు ఎక్కడికి తరలించారో కూడా తెలియదు.
ట్రాన్స్‌ఫార్మర్ నెంబర్ 200467546అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామస్థుల పేరిట 2018లో మంజూరైనట్టు కార్యాలయ రికార్డులో ఉంది. కానీ ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఇబ్రహీంపేటకు కాకుండా,శ్రీనాథపురం గ్రామంలో ఓరైతు పొలంలో బిగించారు.
అనుముల మండలం చింతగూడెం, రామడుగుశివారులో ఉన్న సర్వీసునెం. 43827 00160 ఇంటిమీటరు 2000లో మంజూరైంది. ఈసర్వీసు నెంబరుపై 2016నాటికి రూ.20,251 బిల్లు వచ్చింది. ఈబిల్లు ట్రాన్స్‌కోకు చెల్లించిన ఆధారాలు లేవు.వాస్తవంగా ఈ మీటరు చింతగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి పేరుతో ఉంది. దీనికి డీడీకట్టినట్టు ఎటువంటి ఆధారాలు కూడా ట్రాన్స్‌కో అధికారుల వద్దలేవు. ఇప్పటికీ ఈ కనెక్షన్ మరోవ్యక్తి పేరుతో నడుస్తోంది. దళితులకు విద్యుత్ బిల్లులో రాయితీ ఉన్న మీటర్‌ను ఇతరులకు అమర్చారు.
మాడ్గులపల్లి మండలం కన్నెకల్ సబ్‌స్టేషన్ పరిధి లో ఏడు గ్రామాలున్నాయి. ప్రతి గ్రామంలో 150కిపైగా వ్యవసాయ మోటర్లు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 50కిపైగా వీధిలై ట్లు ఉన్నాయి. ఈ ఏడు గ్రామాల్లో విద్యుత్‌కు సంబంధించిన ఏ ప ని జరగాలన్నా అధికారుల చేతులు తడపాల్సిందే. ఇలాంటివి ఉమ్మ డి జిల్లాలో కోకొల్లలు. స్తంభం మార్చాలన్నా, కొత్త స్తంభం ఎత్తాల న్నా రూ.3వేలు సమర్పించాల్సిందే. ఇక వ్యవసాయ స్తంభాలు ఎత్తాలంటే రూ.10వేలు, ట్రాన్స్‌ఫార్మర్ రావాలంటే రూ.50వేలు చెల్లించాల్సిందే.
కాసులిస్తేనే కనెక్షన్
ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో ఫీఫో (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్) విధానాన్ని అమలు చేస్తోంది. కానీ, జిల్లా అధికారు లు దీన్ని తుంగలోతొక్కారు. గతంలో రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల అవినీతి కారణంగా ఫీఫో విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. కాగా, దీన్ని పక్కదారిపట్టిస్తూ కాంట్రాక్టర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. కట్టంగూరు మండలంలో సీరియల్ 45 ట్రాన్స్‌ఫార్మర్ల నడుస్తుండగా, సీరియల్ నంబర్ 100 ఉన్న వారికి సామగ్రి ఇచ్చారు. తిప్పర్తి మండలంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు : కృష్ణయ్య, ట్రాన్స్‌కో నల్లగొండ ఎస్‌ఈ
ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో సీరియల్ పాటిస్తాం. డీఈల స్థాయిలోనే అవి మంజూరవుతాయి. ఎక్కడైనా తప్పు జరిగినట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. రాజకీయ ఒత్తిళ్లతో ట్రాన్స్‌ఫార్మర్లు ఒక చోట మంజూరైతే మరో చోట పెట్టి ఉండొచ్చు. అది కూడా తప్పే. దళితుల పేరిట మంజూరైన మీట ర్లు ఇతరుల ఇళ్లలో ఉండటం తీవ్ర నేరం. దీనిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.