ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?
ABN , First Publish Date - 2020-12-15T06:14:13+05:30 IST
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సమగ్ర, సత్వర విచారణకు ఆదేశించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) లేఖ రాసింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతడి నివాసాల్లో జరిపిన తనిఖీల్లో పదుల సంఖ్యలో ఆయుధాలు, పెద్దమొత్తంలో మందుగుండు, పేలుడు పదార్థాలు లభించాయని.. వాటిని సమకూర్చుకోవడంలో పోలీసు అధికారులు అతడికి సహకరించి ఉంటారని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో కోరారు.

ఏకే-47సహా పెద్ద మొత్తంలో తుపాకులు
ఉగ్రవాదులతోనూ సంబంధాలు ఉండొచ్చు!
అంటకాగిన అందరిపై విచారణ జరపాలి
గ్యాంగ్‌స్టర్ కేసుపై గవర్నర్‌కు ఎఫ్‌జీజీ లేఖ
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సమగ్ర, సత్వర విచారణకు ఆదేశించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) లేఖ రాసింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతడి నివాసాల్లో జరిపిన తనిఖీల్లో పదుల సంఖ్యలో ఆయుధాలు, పెద్దమొత్తంలో మందుగుండు, పేలుడు పదార్థాలు లభించాయని.. వాటిని సమకూర్చుకోవడంలో పోలీసు అధికారులు అతడికి సహకరించి ఉంటారని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో కోరారు. దీనిపై విచారణ జరిపించి, నిజాలను నిగ్గు తేల్చాలని ఆయన గవర్నర్‌ను కోరారు. ఏకే-47 వంటి ఆయుధాలను సమకూర్చుకున్న నయీంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నయీంతో అంటకాగిన పోలీసు, రాజకీయ నాయకులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులపై సమగ్ర విచారణ జరిపి, వారందరిపైనా చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత లభించిన ఆయుధాలు, డబ్బు, పత్రాలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారిగా ఉన్న ఐజీ నుంచి సేకరించిన వివరాల్ని లేఖలో గవర్నర్‌కు వివరించారు. ఐజీ సమర్పించిన సిట్ నివేదికను గవర్నర్‌కు రాసిన లేఖకు జతచేశారు.
ఏకే 47.. గ్రనేడ్లు..
నయీం నివాసాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో పెద్దమొత్తంలో ఆయు ధాలు, ముందుగుండు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారని పద్మ నాభరెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో వివరించారు. మూడు ఏకే-47లు, 9 పిస్టళ్లు, 3 రివాల్వార్లు, 7 తపంచాలు, ఒక ఎస్‌బీబీఎల్ 12 బోర్ గన్, ఒక స్టెన్‌గన్, రెండు హ్యాండ్ గ్రనేడ్లు, 10 జెలిటెన్ స్టిక్స్, 5 కేజీల అమోనియం నైట్రేట్, 10 మీటర్ల ఫ్యూజ్ వైరు, ఆరు మేగజీన్లు, 616 తూటాలు, 30 డిటోనేటర్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సమకూర్చుకోవడంలో పోలీసుల సహకారం ఉంటుందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. నయీం ఇళ్లలోంచి రూ. 2.16 కోట్ల నగదు, 1.944 కిలోల బంగారం, 2,482 కిలోల వెండి, 21 కార్లు, 26 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. వీటన్నింటిపైనా విచారణ జరపాల్సిన అవసరం పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు.
752 భూమి పత్రాలు..
కొన్ని వేల ఎకరాలకు సంబంధించి 752 భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు నయీం ఇళ్లలో జరిపిన సోదాల్లో లభించాయి. సాధారణ వ్యక్తి భూమి కొనాలన్నా, అమ్మాలన్నా ఆధార్, పాన్‌కార్డు, లింకు డాక్యుమెంట్లు.. ఇలా రకరకాల నిబంధనలు ఉంటాయి. ఫొటో, వేలిముద్రలు తీసుకుంటారు. నయీం వేల ఎకరాల భూమి 752 రిజిస్ట్రేషన్లు ఎలా చేయగలిగాడనే విషయంపై విచారణ జరపాల్సి ఉందని గవర్నర్‌కు రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు. రాజకీయ నాయకులు, పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం లేనిదే సాధ్యం కాదన్నారు. నయీం చనిపోయినా అతడు స్థాపించిన నేరసామ్రాజ్యం ఇంకా ఉందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మరో నయీం అవతరించకుండా ఉండాలంటే.. అతనికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులపై సమగ్ర విచారణ జరిపి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి కోరారు.
కాల్‌డేటా పరిశీలించని సిట్..
నయీం నివాసాల్లో 602 సెల్‌ఫోన్లు దొరి కాయ ని, వాటి కాల్‌డేటాను పరిశీలిస్తే నయీంతో టచ్ లో ఉన్నవారి వివరాలు తెలుస్తాయని పద్మనాభ రెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ సిట్ ఆ పని చేయ డం లేదని, ప్రతి చిన్న కేసులో నిందితుడి కాల్ డేటా సేకరిస్తున్న పోలీసులు.. నయీం విషయం లో ఎలాంటి కాల్‌డేటాను పరిశీలించలేదని వివరిం చారు. కాల్ డేటా తీగ కదిలిస్తే.. రాజకీయ నాయకు లు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే అలా చేయడం లేదన్నారు. నయీం ఇంట్లో లభించిన 130 డైరీల్లో చాలా మంది ఆఫీసర్లు, రాజకీయ నాయకుల పేర్లు ఉండి ఉంటా యని, అలాంటి డైరీల్ని సరిగా పరిశీలించకుండా న్యాయస్థానాల్లో డిపాజిట్ చేశారన్నారు.