సూర్యాపేట జిల్లాలో మరో..నాలుగు పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-06-22T11:21:49+05:30 IST

సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఒక్కరోజే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

సూర్యాపేట జిల్లాలో మరో..నాలుగు పాజిటివ్‌ కేసులు

 గరిడేపల్లిలో ఒకే కుటుంబంలో ముగ్గురికి 

 నల్లగొండలో ఇద్దరికి, యాదాద్రిలో ఒకరికి పాజిటివ్‌ లక్షణాలు 

 ధ్రువీకరించని వైద్యాధికారులు


సూర్యాపేట(ఆంధ్రజ్యోతి)/గరిడేపల్లి, పెన్‌పహాడ్‌, జూన్‌ 21: సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఒక్కరోజే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి, కారు డ్రైవర్‌కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గరిడే పల్లికి చెందిన అన్నదమ్ములు కానిస్టేబుళ్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తమ్ముడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అప్పటికే పలుసార్లు అన్నదమ్ములు కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నను కరోనా పరీక్షలు చేసుకోవాలని తమ్ముడు సూ చించాడు. అంతకుముందే అన్న గరిడేపల్లికి వచ్చి కొద్ది రోజులు ఇంటి వద్ద ఉన్నాడు. దీంతోపాటు హుజూర్‌నగర్‌లోని బూరుగడ్డలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లాడని, కీతవారిగూ డెం గ్రామంలోని బంధువుల ఇంట్లో కొద్దిసేపు గడి పాడని తెలిసింది. కాగా, ఈ నెల 17వ తేదీన కానిస్టేబుల్‌ తనతో పాటు కుటుంబసభ్యులను హైదరాబాద్‌కు కారులో తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. ఈ నెల 19వ తేదీన వచ్చిన పరీక్ష ఫలితాల్లో కానిస్టేబుల్‌(అన్న)తో పాటు అతడి తల్లి, కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. వీరితో పాటు సూర్యాపేటకు చెందిన కారు డ్రైవర్‌కు సైతం పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.


వీరందరికీ సూర్యాపేట జనరల్‌ అస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. గరిడేపల్లిలోని కానిస్టేబుల్‌ ఇంట్లో ఉండే మరో ఇద్దరిని సైతం ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటివరకు వీరి సమీప బంధువులై న గరిడేపల్లి మండల కేంద్రంలో 16 కుటుంబాలను, గడ్డిపల్లి, కీతవారిగూడెం గ్రామానికి చెందిన ప్రైమరీ కాంటాక్టులు 8 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్టు వైద్యాధికారి రమ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన కానిస్టేబుల్‌ హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా పాజిటివ్‌తో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలకు నెగటివ్‌ రావటంతో స్వస్థలమైన పెన్‌పహాడ్‌ మండలం భాగ్యతండాలో హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఈ కేసులన్నీ హైదరాబాద్‌ పరిధిలో నమోదవడంతో సంఖ్యను జీహెచ్‌ఎంసీ కోటాలో అధికారులు చూపించారు. కాగా, గరిడేపల్లిలో పాజిటివ్‌ కేసు నమోదవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. పట్టణంలో ఆరోగ్య సర్వే నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే గరిడేపల్లిని కంటైన్‌మెంట్‌, రెడ్‌జోన్‌గా గుర్తించడం లేదని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-22T11:21:49+05:30 IST