వలసల భయం

ABN , First Publish Date - 2020-05-17T10:05:05+05:30 IST

జిల్లాలో స్థానికంగా ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని ఏళ్ల క్రితం ముంబై, సూరత్‌, రాజస్థాన్‌, చత్తీ్‌సఘడ్‌, పంజాబ్‌ ఇలా ఉత్తరభారత దేశంలోని పలు రాష్ట్రాలకు

వలసల భయం

సిటీ న్యూస్ : జిల్లాలో స్థానికంగా ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని ఏళ్ల క్రితం ముంబై, సూరత్‌, రాజస్థాన్‌, చత్తీ్‌సఘడ్‌, పంజాబ్‌ ఇలా ఉత్తరభారత దేశంలోని పలు రాష్ట్రాలకు జిల్లావాసులు తరలివెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అందులో అత్యఽధికంగా పాలు, కల్లు వ్యాపారంపై ఆఽధారపడ్డవారు అధికంగా ఉన్నారు. ముంబైలో పాల  వ్యాపారం, డ్రైవర్లు, ఓనర్లు కమ్‌ డ్రైవర్లుగా స్థిరపడ్డవారు చాలా మంది ఉన్నారు. రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో తాటి, ఈత చెట్లను గుత్తకు తీసుకొని కల్లుగీసి విక్రయిస్తున్నవారు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణభయంతో వారు స్వగ్రామాల బాట పట్టారు. లాక్‌డౌన్‌తో  పనులు నిలిచి ఉపాధి లేక, అక్కడి నుంచి వచ్చేందుకు రవాణా సౌకర్యం లేక, ఇక్కడి అధికారులు అనుమతించకోవడంతో ఇన్నిరోజులు వారు ఆయా రాష్ట్రాల్లోనే ఉండిపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం మూడో విడత లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో టూరిస్టు బస్సుల్లో చాలా మంది, సొంత వాహనాల్లో మరికొందరు జిల్లాకు చేరుకున్నారు. ఇప్పటికే జిల్లాకు 3,500 మంది చేరారని అధికారుల అంచనా. వివిధ చెక్‌పోస్టుల్లో నమోదు చేసిన వివరాలు, కలెక్టర్‌లో ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు వీరిని గుర్తించాయి.


భద్రత గాలిలో దీపం

సరిహద్దుల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌తో జిల్లాలోకి వలస కూలీలను అనుమతిస్తున్నారు. ప్రభుత్వం వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ జరిపి కరోనా లక్షణాలు లేవని సర్టిఫికెట్‌ ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించి పంపుతున్నారు. వీరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా చూడాలని, సర్పంచులకు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ సూచించారు. సూర్యాపేట పట్టణంలో కిరాణా వ్యాపారి ద్వారా 51 మందికి కరోనా సోకితే అందులో 50 మందికి వ్యాధి లక్షణాలే లేవు. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో పల్లెలకు చేరుతున్న వారి నుంచి వైరస్‌ రాదని నిర్ధారించలేం. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి వచ్చిన యువకుడికి ఈనెల 15న వైరస్‌ లక్షణాలు బయటడ్డాయి. వలస కూలీలకు ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తే తప్ప వైర్‌సను అడ్డుకోలేం. స్థానికంగా ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో వలస కూలీలు నిత్యావసరాల కొనుగోలు పేరిట యథేచ్ఛగా సంచరిస్తున్నారు.


ఇలా మద్యం కొనుగోలుకు వచ్చిన వలస కూలీలు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీల చేతులపై వేసిన క్వారంటైన్‌ ముద్రలు చెరిగిపోయినట్టు ఈనెల 15న గ్రామాల్లో ఎస్పీ రంగనాథ్‌ పర్యటించినప్పుడు వెలుగులోకి వచ్చింది. వైరస్‌ సోకుతుందన్న ఆందోళనతో గ్రామాల్లో వలస కూలీలను అనుమతించకపోవడం, అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని పోలీసు, రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తుండటంతో ఆందోళన వాతావరణం నెలకొంది. కొన్ని గ్రామాల్లో స్థానికులను అధికారులు అడ్డుకొని కూలీలకు ప్రభుత్వ పాఠశాలల్లో బస  కల్పించారు. అక్కడ కనీస వసతులు లేకపోవడంతో నడి వేసవిలో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఆత్మహత్య చేసుకుందామనుకున్నా

నేను ముంబైలో కాంట్రాక్టర్‌గా పనులు చేస్తున్నా. ముంబైలోని అందేరి నుంచి మిత్రు డు స్వామితో కలిసి బస్సులో స్వగ్రామం చీకటిమామిడికి వచ్చా. కరోనా భయంతో మా ఊరో ళ్లు రానివ్వకపోవడంతో ఊరిబయటి సబ్‌ స్టేషన్‌ వద్ద ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీలో రెండు రోజులు పడుకు న్నా. సొంత ఊరోళ్లు ఇలా వ్యవహరించడంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్న.

- వి.కోటి, చీకటిమామిడి


ప్రభుత్వమే వసతి కల్పించాలి

ప్రభుత్వమే వలస కార్మికులకు ఒకే దగ్గర వసతి కల్పిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్రామల్లో ప్రజలు వలస కూలీల రాకను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వసతి ఏర్పాటు చేయాలని చూస్తే గ్రామస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలువురు గ్రామస్థులు సమన్వయం కోల్పోయి నన్ను దూషించారు.

- తాటికొండ సంతోష సైదులు, సర్పంచ్‌, చీకటిమామిడి


తొమ్మిది నెలల పాపతో ఇబ్బంది పడుతున్నాం

గ్రామ సర్పంచ్‌, అధికారుల చొరవతో ప్రభుత్వ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రస్తుతం భోజనం అందుతోంది. నడి వేసవిలో మా తొమ్మిది నెలల పాపతో ఇబ్బంది పడుతున్నాం. వేల కిలోమీటర్లు దాటి సొంత గ్రామానికి వచ్చి, అందరికీ దూ రంగా ఉండటం బాధాకరం. 20 ఏళ్లుగా ముంబైలో రిలయన్స్‌ కేబుల్‌లో పనిచేస్తున్నా. ప్రస్తుతం ఇక్కడికి వస్తే ఇదీ పరిస్థితి.

- జానయ్య వలస కూలీ, పలివెల


Updated Date - 2020-05-17T10:05:05+05:30 IST