అప్పులు తీర్చలేక కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-29T05:47:54+05:30 IST
సాగుకోసం చేసిన అప్పులు భారమై యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ కౌలు రైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
వలిగొండ, డిసెంబరు 28: సాగుకోసం చేసిన అప్పులు భారమై యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ కౌలు రైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బొడ్డు స్వామి(40) అదే గ్రామానికి చెందిన కొమ్మిడి మోహన్‌రెడ్డి వద్ద ఎనిమిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, రెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలం పంటలో నాలుగు ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో వరిని, ఒక ఎకరం పశుగ్రాసం సాగు చేశాడు. అధిక వర్షాలకు పత్తి దిగుబడి రాలేదు. దానికి తోడు వరి పైరు కూడా దెబ్బతిన్నది. సాగుకు రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఈ అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం పొలంలో పశువుల పాకలో ఉన్న దూలానికి ఉరి వేసుకున్నాడు. పొలం వద్దకు వెళ్లిన భార్యకు స్వామి విగతజీవుడై కనిపించాడు. స్వామి భార్య శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపారు.