అడిగిన అందరికీ ఉపాధి : నల్లగొండ జిల్లా కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-08T06:19:08+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. గురువారం

అడిగిన అందరికీ ఉపాధి :  నల్లగొండ జిల్లా కలెక్టర్‌

వచ్చే వారం నుంచి  ఉపాధి కూలీ రూ.160కి పెంపు


నల్లగొండ అర్బన్‌, మే 7 : ఉపాధి హామీ పథకం కింద కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, నర్సరీ నిర్వహణ, మొక్కల సంరక్షణ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని 844 గ్రామపంచాయతీల్లో 1,37,810మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని, ప్రతి గ్రామ పంచాయతీలో సరాసరీ 175మంది పనులకు హాజరవుతున్నారన్నారు. గ్రామంలో కనీసం 200మంది పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు.


ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.138వేతనం వస్తోందని, వచ్చే వారం నుంచి రూ.160 వచ్చేలా పనులు కల్పించాలన్నారు. గతంలో జరిగిన పనులకు సామగ్రి విడుదల చేశామన్నారు. ఉపాఽధి పనుల్లో భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించి నిబంధనలు పాటించాలన్నారు. నర్సరీల మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 85 శాతం మొక్కలను బతికించాలని, నిర్లక్ష్యంగా వ్యహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంబంధిత అధికారులు నర్సరీలపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి, పంచాయతీ అధికారి విష్ణువర్దన్‌, జడ్పీ డిప్యూటీ సీఈవో సీతాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-08T06:19:08+05:30 IST