మృతుడి ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నాలు

ABN , First Publish Date - 2020-03-02T11:38:15+05:30 IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మారుతీరావు ఖాళీ ఇంటిస్థలంలో శనివారం లభ్యమైన మృతదేహం ఆచూకీ

మృతుడి ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నాలు

ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో పోస్టుమార్టం

మృతుడి జేబులో లభ్యమైన కాగితం, చెరిగిన అక్షరాలు


మిర్యాలగూడ అర్బన్‌, మార్చి 1: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మారుతీరావు ఖాళీ ఇంటిస్థలంలో శనివారం లభ్యమైన మృతదేహం ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుడు ధరించిన ప్యాంట్‌లో రూ. 20 నోటుతోపాటు లభించిన ఓ కాగితం ఆయిల్‌లో తడవడంతో అక్షరాలు చెరిగిపోయాయి. అక్షరాలను గుర్తించేందుకు పోలీసులు నిపుణులను సంప్రదిస్తున్నారు. ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు షెడ్డులో లభ్యమైన మృతదేహం ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణయ్‌ హత్యకేసు విచారణ మొదలవుతున్న తరుణంలో లభ్యమైన మృతదేహం ఎవరిదన్న సందేహాన్ని నివృత్తిచేసే దిశగా పోలీ్‌సశాఖ పనిచేస్తోంది.


ప్రణయ్‌ హత్యకేసుతో ఈ మృతదేహానికి ఏమైన సంబంధం ఉన్నదా..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే మృతదేహం లభ్యమైన వెంటనే ఇక్కడి పోలీసులు ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేషన్లలో మిస్సింగ్‌ కేసుల విచారణ చేపట్టగా ఎక్కడా కేసులు నమోదు కాలేదని నిర్ధారించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిఽధిలోని అన్ని పోలీ్‌సస్టేషన్లకు మృతదేహం ఫోటోలను ఆదివారం పంపించారు. ఫోటోలోని ఆనావాళ్ల ఆధారంగా ఆయా పోలీ్‌సస్టేషన్లలో నమోదైన మిస్సింగ్‌ కేసుల తాలుకు ఫోటోలతో పోల్చి చూడగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఆంధ్రా సరిహద్దుకు 25 కిలోమీటర్లదూరంలో ఉన్న మిర్యాలగూడలో లభ్యమైన మృతదేహం ఆంధ్రాప్రాంతానికి చెందినదై ఉంటందా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆంధ్రాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు మృతదేహం ఫోటోలను పంపించి ఆయా పోలీ్‌సస్టేషన్ల పరిధిలో నమోదైన మిస్సింగ్‌ కేసుల ఫోటోలతో పోల్చిచూస్తూ ఆచూకీ తెలుసుకునే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మారుతీరావు షెడ్డుకు ఆవల ఉన్న రిలయన్స్‌ పెట్రోల్‌బంక్‌లోని సీసీ కెమెరాల పూటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసు విషయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిననట్లు సీఐ సదానాగరాజు తెలిపారు.


ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు. శనివారం సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం మృతుడి చేతి వేలిముద్రలు సేకరించేందుకు ప్రయత్నించగా కుళ్లిపోవడంతో సరిగ్గా నమోదు కాలేదు. దీంతో ఆదివారం నిర్వహించిన పోస్టుమార్టంలో భాగంగా మృతుడి చేతివేళ్లను కత్తిరించి తీసుకున్నారు. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రినుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో పోస్టుమార్టం ప్రక్రియను వైద్యులు పూర్తి చేశారు. మృతదేహం నుంచి కీలక ఆవయవాలను సేకరించిన నిపుణులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. మృతుడు ధరించిన జిన్‌ప్యాంట్‌, బ్లూకలర్‌ షర్టు, చేతిగడియారాన్ని పోలీసులు భద్రపరచారు.  

Updated Date - 2020-03-02T11:38:15+05:30 IST