డ్వాక్రా మహిళలు.. కిస్తీలు కట్టాల్సిందే..!

ABN , First Publish Date - 2020-04-22T21:16:44+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా రుణాలు చెల్లించే పరిస్థితి ఉండదని గుర్తించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ నెల వరకు ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది

డ్వాక్రా మహిళలు.. కిస్తీలు కట్టాల్సిందే..!

డ్వాక్రాలకేదీ మారటోరియం?

నెలవారీ సొమ్ము చెల్లింపులకు ఇక్కట్లు

కిస్తీలు కట్టాల్సిందేనంటున్న ప్రభుత్వం


నల్లగొండ (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా రుణాలు చెల్లించే పరిస్థితి ఉండదని గుర్తించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ నెల వరకు ఈఎంఐల చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. మహిళలతో నడుస్తున్న స్వయం సహాయక సంఘాలు(డ్వాక్రా) ఏటా కోట్లాది రూపాయల రుణాలను బ్యాంకుల ద్వారా తీసుకుంటూ నెలసరి వాయిదా పద్ధతిలో చెల్లిస్తున్నాయి. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో పనులు లేక ఈ పొదుపు సంఘాల మహిళలు ఇంటివద్దే ఉంటున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాల చెల్లింపులపై ఎలాంటి మారటోరియాన్ని ప్రకటించలేదు. దీంతో ఏప్రిల్‌ నెల వాయిదా చెల్లించేందుకు పొందుపుసంఘాల మహిళలు ఇక్కట్లు పడుతున్నారు. వీటిని చెల్లించకుంటే డిఫాల్ట్‌గా గుర్తించి వడ్డీ మాఫీ(వీఎల్‌ఆర్‌) వర్తించకపోగా, అదనపు రుణసదుపాయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కుటుంబ పోషణే భారంగా మారగా, వాయిదా సొమ్ము చెల్లించే పరిస్థితి లేకపోవడంతో డ్వాక్రా మహిళల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి.


నల్లగొండ జిల్లాలో రూ.1338 కోట్ల రుణాలు

నల్లగొండ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో 14,386 డ్వాక్రా గ్రూపులు, అందులో 1.43లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపులకు 13 బ్యాంకు లు 156బ్రాంచ్‌ల ద్వారా 2019-20 ఆర్థికసంవత్సరంలో రూ.1,338కోట్ల రుణా లు ఇచ్చారు. అందులో రూ.1162కోట్లు సంఘాల్లోని సభ్యులందరూ తీసుకోగా, స్త్రీనిధి పథకం కింద వ్యక్తిగత రుణాలు రూ.176కోట్లు ఉన్నాయి. ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక సంఘాలు)లకు అందించే రుణాలపై ప్రతినెలా నూటికి 12.5శాతం (రూ.1.10పైసలు) వడ్డీ లెక్కిస్తుండగా, రూ.62పైసల వడ్డీని ప్రభుత్వం భరిస్తోంది. మిగతా రూ.48పైసల వడ్డీని క్రమం తప్పకుం డా వాయిదా చెల్లించే సంఘాలకు మాఫీగా ప్రకటించి నేరుగా వాటి బ్యాం కు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. దీంతో ఎస్‌హెచ్‌జీలు వడ్డీలేని రుణాలతో స్వయం ఉపాధి పొందుతున్నాయి.


ఈ నెల వడ్డీ రూ.14.71కోట్లు

లాక్‌డౌన్‌తో పొదుపు సంఘాల మహిళల ఆర్థిక పరిస్థితి చతికిల పడింది. దీంతో నెలసరి వాయిదా సొమ్మును చెల్లించే పరిస్థితులు లేవు. బ్యాంకర్లు మాత్రం వాటిని చెల్లించాల్సిందేనని రుణాలపై 12.5శాతం వడ్డీని లెక్కిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీలు తీసుకున్న రూ.1338కోట్ల రుణాలపై ఏప్రిల్‌ నెలలో రూ.14.71కోట్ల వడ్డీభారం పడనుంది.


వెసులుబాటు కల్పించాలి

లాక్‌డౌన్‌ అమలుతో కూలీ పనులు దొరక డంలేదు. ఉపాధిహామీ పథకం కూడా అమ లు కావడం లేదు. కూలీ దొరికితేనే పూట గడిచేది గగనం. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. పొదు పురుణాలు ఎలా చెల్లించాలి. మా పరిస్థితిని అర్థం చేసుకొని వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసకోవాలి.

- పుట్టల సదమ్మ, వేములపల్లి


ఎస్‌ఎస్‌జీలకు మారటోరియం వర్తించదు

స్వయం సహాయక సంఘాలకు మారటోరియం వర్తించదన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. డబ్బులున్న సంఘాలు కిస్తీలు చెలిస్తే అధిక వడ్డీ భారం తప్పి, ప్రభుత్వం అందించే వడ్డీ మాఫీ వర్తిస్తుంది. డిఫాల్ట్‌ సంఘాలుగా గుర్తిస్తే రుణ సదుపాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

- శేఖర్‌రెడ్డి, నల్లగొండ డీఆర్‌డీఏ పీడీ 

Updated Date - 2020-04-22T21:16:44+05:30 IST