డ్రైపోర్టు ఎప్పుడు.. ఎక్కడ?
ABN , First Publish Date - 2020-07-27T12:02:07+05:30 IST
డ్రైపోర్టు ఏర్పాటుపై సందిగ్ధం వీడటం లేదు. జిల్లాలోనే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నట్టు గతంలో మంత్రి కేటీఆర్‌తోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు

చామతోటబావి, గాదిరెడ్డిపల్లిలో అధికారుల భూసర్వే!
పోర్టు ఏర్పాటైతే ఈ రెండు గ్రామాలు కనుమరుగు
చిట్యాల రూరల్, జూలై 26: డ్రైపోర్టు ఏర్పాటుపై సందిగ్ధం వీడటం లేదు. జిల్లాలోనే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నట్టు గతంలో మంత్రి కేటీఆర్‌తోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రకటించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో ఈ డ్రైపోర్టు ఏర్పాటుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో డ్రైపోర్టులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ 2014, నవంబర్ 27న ప్రకటించారు. ఆ తరువాత డ్రైపోర్టు ఏర్పాటుకు గుండ్రాంపల్లి శివారులోని రాంకీ యాజమాన్యానికి చెందిన భూములు అనువుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారని 2018, మార్చిలో అప్పటి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రకటించారు. దీంతో డ్రైపోర్టు ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. 2019లో నవంబర్ 1న దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ సైతం డ్రైపోర్టు విషయాన్ని ప్రస్తావించారు. కాగా, డ్రైపోర్టు ఏర్పాటుకు సుమారు 500 ఎకరాల నుంచి 1,500 ఎకరాల భూమి అవసరం ఉంటుంది.
గాదిరెడ్డిపల్లి, చామతోటబావి వద్ద డ్రైపోర్టు
గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారి పక్కన సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్క నాటిన ప్రాంతం వెనుక భాగంలోని భూముల్లో డ్రైపోర్టు ఏర్పాటు కానున్నట్టుగా తొలుత ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. కాగా, చిట్యాల మండలం నేరడ, వట్టిమర్తి గ్రామాల ఆవాస ప్రాంతాలైన గాదిరెడ్డిపల్లి, చామతోటబావిలో డ్రైపోర్టు ఏర్పాటుకానున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఏడాది మార్చి రెండో వారంలో అధికారులు భూ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. డ్రైపోర్టు ఏర్పాటుకు భూములు అనువుగా ఉన్నాయో లేదో, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఏమేరకు అందుబాటులో ఉన్నాయో అధికారులు సర్వే నిర్వహించినట్టు సమాచారం.
భూసర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు పంపిన సర్వే నెంబర్ల మ్యాప్ ఇదే అంటూ వాట్సా్‌పలో ప్రచారం జరిగింది. డ్రైపోర్టుకు 500 ఎకరాల నుంచి 1500 ఎకరాల వరకు భూములు అవసరం కానుండటంతో గాదిరెడ్డిపల్లి, చామతోటబావి గ్రామాలు కనుమరుగయ్యే అవకాశముంది. సర్వే నిర్వహించిన అధికారులు ఈ రెండు గ్రామాల్లో ప్రభుత్వ, పట్టాభూములు మొత్తం 1162.16ఎకరాలను గుర్తించినట్టు తెలిసింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దీనిపై పెద్దగా చర్చ జరగకున్నా భవిష్యత్తులో ఇళ్లు, భూములు కోల్పోయి వలసపోక తప్పదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
రాంకీ భూముల విక్రయం?
డ్రైపోర్టు ఏర్పాటుకు రాంకీ సంస్థకు చెందిన భూములు అనువుగా ఉన్నట్టు అధికారులు నిర్ధారించినట్టు 2018లో అప్పటి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రకటించారు. కాగా, రాంకీ సంస్థ భూములను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్థకు విక్రయించినట్టు తెలిసింది. ఆ భూముల విక్రయం జరగడంతో ఇక్కడ డైపోర్టు ఏర్పాటు చేస్తారా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది.
అధికారులు స్పష్టత ఇవ్వాలి..తీగల వెంకన్న, గాదిరెడ్డిపల్లి
గ్రామంలో డ్రైపోర్టు ఏర్పాటుపై జరుగుతున్న చర్చతో ఆందోళన ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, స్థానికంగా మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది. పోర్టుకోసం భూసేకరణకు సర్వేనంబర్ల వివరాలు రెవెన్యూ అధికారులకు అందినట్టు తెలిసింది. రెవెన్యూ, సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి.
డ్రైపోర్టు వస్తే ఊరంతా ఖాళీ..రామగిరి నర్సింహారావు, గాదిరెడ్డిపల్లి
గ్రామంలో డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే ఊరంతా ఖాళీ చేయాలనే ప్రచారం జరుగుతోంది. అసలు నిజమేంటో తెలియక అంతా ఆందోళన చెందుతున్నాం. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం వల్ల పోర్టుకోసం భూములు సర్వే చేసినట్టు తెలిసింది. పట్టా, ప్రభుత్వ భూముల వివరాలతో కూడిన జాబితా వాట్సా్‌పలలో చక్కర్లు కొడుతోంది. వాస్తవమేంటో అధికారులే చెప్పాలి
విషయం దృష్టికి రాలేదు..మాలి కృష్ణారెడ్డి, చిట్యాల తహసీల్దార్
డ్రైపోర్టు ఏర్పాటుకు విషయం మా దృష్టికి రాలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. స్థలపరిశీలన, భూముల సర్వే సమయంలో మాత్రమే మాకు సమాచారం ఇస్తారు. ఒకవేళ డ్రైపోర్టుకు సంబంధించిన అధికారులు భూములు పరిశీలించినా, అవి అనుకూలమని నిర్ధారణ చేశాక మాకు సమాచారం ఇస్తారు. ప్రస్తుతానికి డ్రైపోర్టు విషయంపై ఇప్పటి వరకు ఉన్నతాఽధికారుల నుంచి గానీ, ఆ శాఖ నుంచి గానీ సమాచారం లేదు.