ధరణి సంసిద్ధం
ABN , First Publish Date - 2020-10-28T10:49:53+05:30 IST
నూతన రెవెన్యూ చట్టం మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ను ఈ నెల 29న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

పోర్టల్ ఆధారితంగా రిజిస్ట్రేషన్లు
తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు
వ్యవసాయేతర భూములకే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పరిమితం
రేపటి నుంచి ప్రారంభం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)/నల్లగొండ
నూతన రెవెన్యూ చట్టం మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ను ఈ నెల 29న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. భూ యాజమాన్య హక్కుల నమోదులో పారదర్శకత, వివాదాలకు ఆస్కారం లేకుండా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం తో ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుండగా, తహసీల్దార్ కార్యాలయా ల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకే పరిమితం కానున్నాయి. భూములు, ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ రెవె న్యూ యంత్రాంగం, స్థానికసంస్థల అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, నూతన రెవెన్యూ చట్టం అమలుకోసం ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 27వ తేదీ నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ నెల 29న ధరణి పోర్టల్ ప్రారంభం కానుండగా, రిజిస్ట్రేషన్ల ప్రక్రి య ప్రారంభానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
ఆస్తుల క్రయ, విక్రయాలు ఇకపై కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం రూ పొందించిన ధరణి పోర్టల్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు జాయింట్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ జిల్లాలో 31, సూర్యాపేట జిల్లా లో 23, యాదాద్రి జిల్లాలో 17 తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ధరణి పోర్టల్‌లోని భూయాజమాన్య హక్కులు, వివరాల మేరకు క్రయ విక్రయదారుల దస్తావేజు, రిజిస్ట్రేషన్‌తోపాటు ఆస్తిమార్పిడి, మ్యుటేషన్ కూడా వెనువెంటనే జరగనుంది. ఉమ్మడి జిల్లాలో 15 సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈకార్యాలయా లు ఇకపై వ్యవసాయేతర భూములు, ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ మాత్రమే చేయనున్నాయి. ఇప్పటికే ధరణి పోర్టల్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల వివరాల నమోదు జరుగుతుండగా, ఆస్తుల మా ర్కెట్‌విలువ, ఎన్‌కంబర్స్‌మెంట్, వారసత్వ వివరాలు సైతం అందుబాటులో ఉండనున్నాయి. యాదాద్రిజిల్లాలో 17 మండలాల్లో మొత్తం 8,19,313ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయి. వీటి వివరాలను ఆయా రెవెన్యూ గ్రా మాలు, మొత్తం 9,21,493 సర్వేనెంబర్ల వారీగా నమోదు చేశారు. వీటిలో 6,00,491 ఎకరాల వ్యవసాయ భూమి, 37,834 ఎకరాల అసైన్డ్, 26,728 ఎకరాల అటవీ, 2,870 ఎకరాల వక్ఫ్, దేవాదాయ, ఇతర కేటగిరీలకు చెందిన భూములు ఉన్నాయి. వ్యవసాయేతర భూముల రికార్డులతోపాటు పట్టణాలు, పల్లెల్లో ఆవాస ప్రాంతాలు, గ్రామ కంఠంలోని ఇళ్లు, పరిశ్రమలు, ఇతర కట్టడాలు, వాటి పరిధిలోని ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు ప్రక్రియను మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల సిబ్బం ది చేస్తున్నారు. క్రయ, విక్రయదారులు ముందుగా స్లాట్ బుక్ చేసిన దాని ప్రకారం దస్తావేజుల ప్రక్రియను పారదర్శకంగా అమలు చేయడమే ధరణి పోర్టల్ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.
మార్కెట్ విలువల నమోదులో రిజిస్ట్రేషన్ల శాఖ
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమూల మార్పులతో పాటు మార్కెట్ విలువను పెంచనున్నారని ప్రచారం సాగుతోంది. ఈమేరకు పెరిగిన ధరలకు అనుగుణంగా మార్కెట్ విలువను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ ఆధ్వర్యంలో కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని పోర్టల్స్‌లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలను సర్వే నెంబర్ల వారీగా, పట్టణాల్లోని వార్డుల వారీగా అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆయా కేటగిరిలు, సర్వే నెంబర్లు, వార్డుల్లో పెంచిన ఆస్తుల విలువలను ధరణి పోర్టల్ అప్‌డేట్ చేయనుంది. వీటి వివరాలను ఒక మీట నొక్కడం ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సందిగ్ధం
ధరణి పోర్టల్ ద్వారా మండలాల్లో వ్యసాయ భూముల రిజిస్ట్రేషన్ సేవలు అందనుండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం గురువారం నుంచి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర చర, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లపై సందిగ్ధం నెలకొంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తుల వివరాల నమోదు ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో నమోదుచేయకపోవడం వల్లే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలిసింది.
రెవెన్యూ అధికారులకు శిక్షణ
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలు చేపట్టనున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. అదేవిధంగా వారం రోజులుగా వ్యవసాయ భూముల ప్రయోగాత్మక రిజిస్ట్రేషన్ల ప్రకియ కూడా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు అవరసమైన కంప్యూటర్లు, స్కానర్లు, సీసీ కెమెరాలతో పాటు ఇతర సామగ్రి కూడా ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాలకు అందజేశారు. ఇప్పటివరకు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా 250కి పైగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు నిర్వహించి, సాంకేతిక సమస్యలు, ఎదురైన ఇబ్బందులపై అధికారులు తగిన వివరణలు అందజేశారు. ఈనెల 29న ధరణి పోర్టల్ ప్రారంభంకానుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు మంగళవారం మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్‌లో ప్రత్యేక శిక్షణ కూడా నిర్వహించారు.