ధనుర్మాస ఉత్సవాలు ఆరంభం
ABN , First Publish Date - 2020-12-17T06:04:53+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాలు సంప్రదాయ రీతిలో ఆరంభమయ్యాయి. బాలాలయం, పాతగుట్ట ఆలయంలో ఆండాల్ అమ్మవారిని ఆరాధిస్తూ అర్చకులు వేదమంత్రాలతో తిరుమంజనం నిర్వహించారు.

యాదాద్రీశుడికి ఘనంగా నిత్యారాధనలు
యాదాద్రి టౌన్, మఠంపల్లి, నల్లగొండ కల్చరల్, డిసెంబరు 16: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాలు సంప్రదాయ రీతిలో ఆరంభమయ్యాయి. బాలాలయం, పాతగుట్ట ఆలయంలో ఆండాల్ అమ్మవారిని ఆరాధిస్తూ అర్చకులు వేదమంత్రాలతో తిరుమంజనం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ముత్యాల అభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆండాల్ అమ్మవారిని బాలాలయంలో ప్రత్యేక వేదికపై అధిష్ఠించారు. రంగనాథుడిని ఆరాధిస్తూ 30పాశురాల పఠనం చేశారు. అనంతరం తిరుప్పావై వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. అదే విధంగా ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను అభిషేకించి అర్చనలు, హోమం, నిత్యతిరుకల్యాణం నిర్వహించారు. అనుబంధ చరమూర్తుల ఆలయంలో నిత్యపూజా కైంకర్యాలు శైవాగమ సంప్రదాయ రీతిలో జరిగాయి. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.8,36,590 ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా, యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ప్రధానాలయానికి ఉత్తర దిశలో రక్షణ గోడ నిర్మాణ పనులను వైటీడీఏ అధికారులు వేగిరం చేశారు. 12మీటర్ల ఎత్తు, 30మీటర్ల పొడవుతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులను బుధవారం ప్రారంభించారు. మఠంపల్లి మండలం మట్టపల్లిలోని లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గోదాదేవి అమ్మవారిని నూతన పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరించి కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించారు. రెండో భద్రాద్రి ఆలయంగా పేరొందిన నల్లగొండ రామగిరిలోని సీతారామచంద్ర స్వామి సన్నిధి, వీటీ.కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయం, బీట్ మార్కెట్ శ్రీరామకోటి స్తూప దేవాలయం, షేర్ బంగ్లాలోని సంతోషిమాత ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి.