ఇంటి ఎదుట శవ ఖననానికి యత్నం

ABN , First Publish Date - 2020-12-14T04:40:00+05:30 IST

కుమారుడి మృతికి కారణమైన ట్రాక్టర్‌ యజమాని ఇంటి ఎదుట మృతదేహాన్ని ఖననం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించటం ఉద్రిక్తతకు దారితీసింది.

ఇంటి ఎదుట శవ ఖననానికి యత్నం
ట్రాక్టర్‌ యజమాని అంజయ్య ఇంటి ఎదుట తీసిన గొయ్యిలో కూర్చున్న శ్యాం కుటుంబసభ్యులు

తిరుమలగిరి, డిసెంబరు 13: కుమారుడి మృతికి కారణమైన ట్రాక్టర్‌ యజమాని ఇంటి ఎదుట మృతదేహాన్ని ఖననం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించటం ఉద్రిక్తతకు దారితీసింది.ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన పులిగిల్ల అంజయ్యకు చెందిన ట్రాక్టర్‌పై చిర్రబోయిన గట్టయ్య మేస్త్రిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన గట్టయ్య కుమారుడు శ్యాం(20) స్నేహితులతో కలిసి ట్రాక్టర్‌పై పనులకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడిన శ్యాం చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. దీంతో శ్యాం కుటుంబానికి నష్టపరిహారంగా రూ.8 లక్షలు ఇచ్చేందుకు ట్రాక్టర్‌ యజమాని అంజయ్య అంగీకరించాడు. అయితే డబ్బులు ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం,పోస్టుమార్టం ఆలస్యం కావడంతో ఈ నెల 12న జరగాల్సిన అంత్యక్రియలను ఆదివారానికి వాయిదావేశారు.అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న క్రమంలో ఒప్పుకున్న నష్టపరిహారం అంతా చెల్లించలేనని;రూ.4లక్షలు మాత్రమే ఇస్తానని అంజయ్య చెప్పడంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు అంజయ్య ఇంటి ముందు మృత దేహాన్ని ఉంచి జనగాం- సూర్యాపేట రోడ్డుపై బైఠాయించారు. మూడు గంటల పాటు రాస్తారోకో చేయటంతో పోలీసులు, పెద్దమనుషులు ఆందోళన చేస్తున్న వారితో చర్చించినా ఫలితం రాలేదు. అప్పటికే ట్రాఫిక్‌ జాం కావడంతో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వారిని చెదరగొట్టి రాకపోకలను పునరుద్ధరించారు. ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బం ధువులు అంజయ్య ఇంటిముందు గొయ్యి తీసి  మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని స్వల్పలాఠీచార్జీ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నష్టపరిహారం చెల్లించేలా చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు చెప్పినా వినకుండా గొయ్యిలోకి దిగి కూర్చున్నారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తుంగతుర్తి సీఐ రవీందర్‌, ఎస్‌ఐ డానియోల్‌తో పాటు వివిధమండలాల ఎస్‌ఐలు తమ సిబ్బ ందితో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చివరకు రూ.5లక్షల పరిహారం చెల్లించేందుకు అంజయ్య ఒప్పుకోవడంతో మృతుడి కుటుంబసభ్యులు అక్కడి నుంచి వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.  

Updated Date - 2020-12-14T04:40:00+05:30 IST