ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో దందా
ABN , First Publish Date - 2020-09-18T06:57:37+05:30 IST
దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభు త్వం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తేగా, ఇదే అదునుగా కొందరు వసూళ్లకు దిగుతున్నా రు

డాక్యుమెంట్ రైటర్లు, ఆర్కిటెక్ట్‌ల వ్యాపారం ఫ దరఖాస్తుకు రూ.3వేలు అదనం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)
దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభు త్వం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తేగా, ఇదే అదునుగా కొందరు వసూళ్లకు దిగుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ జీవోల్లో స్పష్టత లేక మార్పులు చేస్తుండటం, మునిసిపల్ సిబ్బందికి శిక్షణ లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. తాజా గా, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటనకు అనుగుణంగా జీవో రాకముందే దళారు లు జనాన్ని పిండటం ప్రారంభించారు.
అనధికార లేఅవుట్లు, వ్యక్తిగత ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఈనెల 1 నుంచి ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవు ట్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ప్రవేశపెట్టింది. ప్లాట్ల క్రమబద్ధీకరణకు యజమానులు ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజు చెల్లించా ల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్లాటుకు వెయ్యి రూపాయలు, వెంచర్ అయితే రూ.10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవా లి. ఈ ఏడాది ఆగస్టు 26లోపు సేల్‌డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన భూ యజమానులు అక్టోబరు 15లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మునిసిపల్ సిబ్బంది సర్వే నిర్వహించి, చెల్లించాల్సిన మొత్తానికి నోటీసు ఇస్తారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు వాయిదా పద్ధతిలో దీన్ని చెల్లించే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ తెరపైకి రాగానే ప్రతీ పట్టణంలో దళారి వ్యవస్థ పుట్టగొడుగులా పుట్టుకొచ్చింది. ఆర్కిటెక్ట్‌లు, డాక్యుమెంట్ రైటర్లు అన్ని పనులు తామే చేసి పెడతామంటూ ప్రచారం మొదలు పెట్టారు. డాక్యుమెంట్ మొదటి పేజీ, కొలతలు ఉన్న పేజీ, ఆధార్ కార్డు జీరాక్స్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఇస్తే మునిసిపల్ ఆఫీసుల్లో పనులన్నింటినీ చక్కబెడతామని ప్రచారం చేస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి టాక్స్ నిర్ధారణకు నిర్వహించే సర్వేకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది వెళతారని, వారితో ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రధాన పట్టణాల్లో దందాకు తెరతీశారు. ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
రూ.3వేలు అదనంగా వసూలు
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుకు ప్రభుత్వం రూ.1000 ఫీజుగా నిర్ధారించగా,దళారులు రూ.3వేలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, మునిసిపాలిటీల్లో ఇబ్బందులు లేకుండా ఫైల్ మూమెంట్ చూ స్తామని డిమాండ్ చేస్తున్నారు. వెంచర్లకు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10వేలు కాగా, అదనంగా మరో రూ.10వేలు వసూలు చేస్తున్నారు. కొందరు డాక్యుమెంట్ రైటర్లు, మునిసిపల్ ప్లానర్లు, ఆర్కిటెక్ట్ విభాగాల్లో పనిచేసేవారు జోరుగా దందా ప్రారంభించగా,ఆదినుంచి వీరికి మునిసిపల్ సిబ్బందితో పరిచయాలు ఉండటంతో జనం నమ్ముతున్నారు.
దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చివరి రోజు ఇచ్చిన హామీ మేరకు సవరణ ఉత్తర్వు గురువారం విడుదలైంది. క్రమబద్ధీకరణకు తాజా మార్కెట్ విలువ కాకుండా, ఆ భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్ రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్ స్లాబుల తో క్రమబద్ధీకరణ రుసుము వసూలు చేయనున్నారు. ఫలితంగా చెల్లించాల్సిన మొత్తం భారీగా తగ్గనుండటంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ఇలా..
- భూముల క్రమబద్ధీకరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం చాలా సులువు. స్మార్ట్‌ఫోన్‌పై అవగాహన ఉన్నవారు ఇంట్లో ఉండే 15నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎల్‌ఆర్‌ఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఎల్‌ఆర్‌ఎ్‌స.తెలంగాణ.జీవోవి.ఇన్ టైప్ చేయగానే అప్లై ఫర్ ఎల్‌ఆర్‌ఎస్-2020 అని వస్తుంది.దీన్ని క్లిక్‌చేయాలి.
- మొబైల్ నెంబర్ వివరాలు ఇవ్వగానే ఓటీపీ వస్తుం ది. దాన్ని ఎంటర్ చేయగానే దరఖాస్తు ఓపెన్ అవుతుంది.
- వ్యక్తిగత ప్లాట్, లేఅవుట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో సరైనది ఎంచుకోవాలి.
- ప్లాట్ ఏరియా గ్రామపంచాయతీ, మునిసిపాలిటీ, కా ర్పొరేషన్ అనే ఆప్షన్లు వస్తాయి, వీటిలో ఒకటి ఎంచుకోవాలి.
- జిల్లా, మునిసిపాలిటీ, మండలం పేరు, వార్డు నెంబర్ అడుగుతుంది. వీటిని నింపాలి.
- ప్లాట్ వివరాలు, ప్లాట్ నెంబర్, విస్తీర్ణం, సర్వే నెంబర్, గ్రామం పేరు, లొకాలిటీ, సేల్ డీడ్ నంబర్, కొనుగోలు చేసిన సంవత్సరం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంత వివరాలు నమోదు చేయాలి.
- ప్లాట్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. (1ఎంబీ సైజుకు మించకూడదు)
- ఆ తరువాత దరఖాస్తుదారుడి వివరాలు నమోదు చేయాలి.
- అనంతరం దరఖాస్తు ఫీజు చెల్లిస్తే ప్రక్రియ ముగుస్తుంది.
- ఎల్‌ఆర్‌ఎస్ విధివిధానాలు ఇంకా రూపొందలేనందున దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది.
దళారులను ఆశ్రయించవద్దు
ప్రైవేటు వ్యక్తుల దందా నా దృష్టికి రాలేదు. మా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పంపి వివరాలు తెప్పి స్తా. నిర్ధారణ జరిగితే సంబంధి త వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ జీవో ఇంకా మావరకు రాలేదు. వాటిని అధ్యయ నం చేశాక, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలర్లకు వివరిస్తాం. ఆ తరువాత వార్డుల వారీగా తిరిగి ఏ ప్లాటు కు ఎంత ఎల్‌ఆర్‌ఎస్ చార్జీ ఉంటుందో చెప్పి, ప్లెక్సీలు, కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
- చీమ వెంకన్న, మునిసిపల్ కమిషనర్, మిర్యాలగూడ
ఎల్‌ఆర్‌ఎస్ నిరంతరం ఉండాలి
ఎల్‌ఆర్‌ఎస్ అనేది నిరంతరం ఉండాలి. ఒక వ్యక్తి తన ప్లాట్ ను విక్రయించినప్పుడు, సదరు వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేసినతేదీన మార్కెట్ విలు వ ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేలా ప్రక్రియ ఉండాలి. తాజా జీవో ఆగస్టు 31 వరకు వర్తిస్తుండగా, అప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ డేట్ పెట్టాలి. ప్రభుత్వ అవసరానికి కాకుండా, భూ యజమాని అవసరానికి పెద్ద పీట వేయాలి.
- గుమ్మల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు