నష్టం.. కష్టం

ABN , First Publish Date - 2020-12-27T05:44:58+05:30 IST

ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో సమ్మె కాలం అంధకారాన్నే మిగిల్చింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు మనోవేదనతో గుండెపోటుతో మృత్యువాతపడ్డారు.

నష్టం.. కష్టం

సమ్మె కాలంలో తనువు చాలించిన ఆర్టీసీ కార్మికులు

ఏడాది గడిచినా కార్మికులకు అందని బెన్‌ఫిట్స్‌

హామీలను విస్మరించిన యాజమాన్యం 

వేదన నింపిన సమ్మె

కష్టాల కడలిలో ఆర్టీసీ కార్మికులు 

(నార్కట్‌పల్లి/నల్లగొండ అర్బన్‌/కోదాడ రూరల్‌)

ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో సమ్మె కాలం అంధకారాన్నే మిగిల్చింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు మనోవేదనతో గుండెపోటుతో మృత్యువాతపడ్డారు. వారిపైనే ఆధారపడిన కుటుంబాలు ఇంటిపెద్దను కోల్పోయి నష్టపోగా, కుటుంబ భారాన్ని తమపై పడడంతో కష్టపడుతున్నాయి. ఉద్యోగం ఇచ్చినా, అది చేయలేక కొన్నిచోట్ల, బెన్‌ఫిట్స్‌ అందక మరికొన్ని చోట్ల పిల్లల చదువులకు, ఇంటి పోషణకు కుట్టుమిషన్‌పై ఆధారపడి, ఆటోలు నడుపుకుంటూ బతుకుబండిని లాగిస్తున్నారు. సమ్మె కాలంలో ఉమ్మడి నల్లగొండ రీజియన్‌ పరిధిలో ఏడుగురు ఆర్టీసీ కార్మికులు తనువు చాలించారు. నార్కట్‌పల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జమీల్‌ గుండెపోటుతో మృతి చెందగా, ఆమని వెంకటేశ్వర్లు అనే మరో డ్రైవరు మనస్థాపంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్నే నింపాయి. మృతుల భార్యలకు ఆర్టీసీ నల్లగొండ డిపోలో కండక్టర్లుగా ఉద్యోగం ఇచ్చినా, కుటుంబ పెద్దలేని లోటు పూడ్చలేదని ఇరు కుటుంబాలు పేర్కొంటున్నాయి. 

సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి ఏడాది కాలం గడిచింది. సంస్థలో కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై 55 రోజులపాటు సమ్మె నిర్వహించగా సమస్యలు పరిష్కరిస్తామంటూ సమ్మె విరమింపజేసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఉద్యోగులు వాపోతున్నారు. సమ్మె కాలానికి పూర్తి వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం 54 రోజులకు గానూ 42 రోజుల వేతనం మాత్రమే చెల్లించిందని, మిగతా 12 రోజుల వేతనం చెల్లించలేదని ఆర్టీసీ సిబ్బంది వాపోతున్నారు. పీఆర్సీ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయని, మూడు డీఏల కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారు.


పరిష్కారానికి నోచని సమస్యలు

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు అక్టోబరు 5న సమ్మెలోకి దిగారు. సమ్మె ఉధృతంగా కాగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కమిటీలను ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడే పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయో పరిమితిని పెంచి ఇతర అంశాలన్నీ మరిచిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రతకు సంబంధించి కేసులన్నీ అపరిష్కృతంగా ఉన్నాయంటున్నారు. యాజమాన్య సతాయింపులు, అధికారుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని సమ్మెకు ముందున్న కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మహిళా ఉద్యోగులకు 8గంటల పనిదినాన్ని కల్పించాలని, ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో ఒక శాతం నిధులు కేటాయించాలన్న డిమాండ్‌ నెరవేరలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక దసరా, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు అం దించే ఫెస్టివల్‌ అడ్వాన్స్‌ ఇవ్వడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు.


యాజమాన్యానికి అనుకూలంగా వెల్ఫేర్‌ కమిటీ!

సమ్మె అనంతరం సీఎం కేసీఆర్‌ కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రతి డిపో పరిధిలో ఓ వెల్ఫేర్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఆ కమిటీ ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం సూచన మేరకు అన్ని డిపోల్లో వెల్ఫేర్‌ కమిటీలు ఏర్పాటుచేశారు. కానీ కమిటీల దృష్టికి వచ్చిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఈ కమిటీ కేవలం యాజమాన్యానికి అనుగుణంగా మాత్రమే పని చేస్తోంది తప్ప, కార్మికుల పక్షాన పోరాడే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఉద్యోగం తప్ప.. బకాయిలు రాలేదు 

సమ్మె కాలంలో గుండెపోటుతో మృతిచెందిన కోదాడ ఆర్టీసీ డ్రైవర్‌ శంషొద్దిన్‌ కుటుంబానికి ప్రభుత్వం నుంచి బకాయిలు రాలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. శంషుద్దీన్‌కు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడికి కోదాడ ఆర్టీసీ డిపోలో సెక్యూరిటీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం ఇచ్చారు. రెండో కుమారుడు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. తమ కుటుంబానికి ఒక్క ఉద్యోగం తప్ప పీఎఫ్‌, గ్రాట్యుటీ బకాయిలు ఇంతవరకు రాలేదన్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమ్మె జరిగి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు బకాయిలు రాకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ తండ్రికి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కుమారుడు రియాజ్‌తో పాటు తల్లి ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.


ఏడాది గడిచినా

నల్లగొండ డిపోలో సమ్మె కాలంలో ఏడీసీ మల్లయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చారు. కానీ నేటికీ బెనిఫిట్స్‌ అందలేదు.


కండక్టర్‌గా చేయలేనని చెప్పినా వినడంలేదు 

నార్కట్‌పల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేసిన జమీల్‌ భార్య షమీ ‘ఆంధ్రజ్యోతి’తో వ్యక్తం చేసిన ఆవేదన ఇది. తన భర్త మృతి తర్వాత సీఎం ఆదేశాల మేరకు నల్లగొండ డిపోలో తనకు కండక్టర్‌ ఉద్యోగం ఇచ్చారని కానీ తాను ఆ ఉద్యోగం చేయలేనని ఇందుకు కొంత మా మతాచారం కూడా అడ్డువస్తుందని విజ్ఞప్తి చేసినా ఆర్టీసీ ఉన్నతాధికారులు వినలేదు. చివరకు ఆఫీ్‌సలో అటెండర్‌ ఉద్యోగమైనా చేస్తానని వేడుకున్నా మా చేతుల్లో ఏమీ లేదన్నారు. దీంతో మా కుటుంబానికి దిక్కులేకుండా పోయింది... అధికారులు మానవతా హృదయంతో స్పందించాలి.


పిల్లల చదువు మాన్పించాల్సిందే..

ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోగా కార్మికులను ఉద్యోగాలనుంచి తీసేస్తామని చేసిన హెచ్చరికతో గుబులుచెందిన చెందిన నా భర్త జమీల్‌ గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతితో నేనూ, నా ముగ్గురు పిల్లలు వీధిన పడ్డాం. సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. ఆస్తి పాస్తులు లేవు. టైలరింగ్‌ చేస్తూ అర్థాకలితో అలమటిస్తున్నాం. భర్త చేసిన అప్పులు అలాగే ఉంటే పిల్లల చదువులకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. కరోనాతో అవి కూడా పుట్టేట్టు లేవు. ఇలాగైతే మా పిల్లలను చదువు మాన్పించాల్సిందే. మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు.


కుమారుడికి ఉద్యోగం ఇప్పించండి : ఆర్టీసీ ఉద్యోగి భార్య వేడుకోలు 

నార్కట్‌పల్లి డిపోలో పనిచేసిన పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ప్రభుత్వ వైఖరితో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్యకు పిల్లలమర్రి పద్మకు కండక్ట ర్‌ ఉద్యోగం ఇచ్చారు. కానీ తాను ఉద్యోగం చేయలేనని పేర్కొన్నారు. వయ సు మీదపడడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో తనకు వేరే ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నారు. అయినా స్పందన లేదు. వయసు రీత్యా ఆమెకు తగిన ఉద్యోగం ఇవ్వాలని నల్లగొండలో తనకు ప్రభుత్వం నుంచి రూ.2లక్ష ల చెక్‌ అందజేసే సమయంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఆర్‌ఎంకు సూచించారు. అయినా కూడా అధికారులు కనికరించ లేదు. చివరకు బస్‌భవన్‌కు వెళ్లి ఆర్టీసీ ఎండీని కూడా కలిసి మొరపెట్ట్టుకున్నా నిబంధనలు ఒప్పుకోవు కండక్టర్‌గానే చేయాలని చెప్పారు. కనీసం తనకు బదులు తన కొడుకు కైనా ఉద్యోగం ఇప్పించాలని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతు న్నామని అంటున్నారు. సంస్థ నుంచి రావాల్సిన సెటిల్‌మెంట్‌ డబ్బులు కూడా రాలేదని లాక్‌డౌన్‌తో కుదరలేదని అధికారులు చెబుతున్నారని, ఉద్యోగం ఇవ్వకుంటే కుమారుడి చదువు ఆపేయాల్సి వస్తుందని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.


భర్త మరణంతో పెద్ద దిక్కు కోల్పోయాం

సమ్మె పరిణామాలు, ప్రభుత్వ వైఖరితో మనస్థాపం చెందిన నా భర్త వెంకటేశ్వర్లు ఆత్మహత్యతో మేం పెద్ద దిక్కు కోల్పోయాం. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త సంపాదనే తప్ప మరో ఆధారం లేదు. భర్త మరణంతో నాకు నల్లగొండ డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు. వారం రోజుల పాటు శిక్షణకు వెళ్లి వచ్చా. కానీ భాష, వయసు, ఆరోగ్యం రీత్యా తాను ఆ ఉద్యోగం చేయలేనని ఆర్‌ఎం కార్యాలయంలో అటెండర్‌ పోస్టు లేదా డిస్పెన్సరీలో వార్డ్‌వుమెన్‌ ఉద్యోగం ఇవ్వాలని వేడుకున్నా. కానీ ఎవరూ ఇవ్వడంలేదు.

Updated Date - 2020-12-27T05:44:58+05:30 IST