మూసీ ఆయకట్టుకు ‘సన్న’ సంకటం

ABN , First Publish Date - 2020-05-30T09:31:46+05:30 IST

రైతులకు గిట్టుబాటు, సరియైున మార్కెటింగ్‌ గల పంటల సాగు వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం

మూసీ ఆయకట్టుకు ‘సన్న’ సంకటం

మూసీ కాల్వల కింద సన్నాలకు ససేమిరా

యాదాద్రి జిల్లాలో దొడ్డు ధాన్యానికే మొగ్గు

40శాతం సన్నరకాల సాగు కష్టమే..

భూగర్భ జలాధార సాగు మొత్తం సన్నరకమే


 యాదాద్రి, మే29(ఆంధ్రజ్యోతి): రైతులకు గిట్టుబాటు, సరియైున మార్కెటింగ్‌ గల పంటల సాగు  వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత వ్యవసాయ విధానం అమలు యాదాద్రిభువనగిరి జిల్లాలో అమలు అధికారులకు తలనొప్పిగా మారింది. జిల్లాలో ప్రధాన పంటల్లో వరిపైరులో సన్నరకం, దొడ్డు రకం సాగుకు ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సివస్తోంది. సన్నరకం ధాన్యం సాగు దిగుబడి పరంగా, పశుగ్రాసం పరంగా నష్టదాయకంగా భావిస్తున్న రైతులు దొడ్డు రకం వైపే మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్‌ శివారు జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతంలో వరిసాగులో ఇష్టమైన సాగుకు ప్రభుత్వం అనుమతించడంతో జిల్లా పంటల సాగు కార్యాచరణకు అనుగుణంగా ముందుకుసాగే పరిస్థితులు లేక క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు అవస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


జిల్లాలో 3,64,793 లక్షల ఎకరాల పంటల సాగు

యాదాద్రి భువనగిరి జిల్లాలో నియంత్రిత పంటల సాగు ప్రణాళిక ప్రకారం 3,64,793 లక్షల ఎకరాల పంటలు సాగు  చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లాలో ప్రధాన పంటలు పత్తి, వరి, కందుల సాగుకు ప్రత్యేకత. 1,74,023 ఎకరాల్లో పత్తి, 1,30,455 ఎకరాల వరి సాగు అంచనాలు. జిల్లాలో వరిసాగులో 40శాతం సన్నరకం, 60 శాతం దొడ్డురకంగా నిర్దేశించారు. దీని ప్రకారం 52,1082 ఎకరాల్లో సన్నరకం, 78,273 ఎకరాల దొడ్డురకం పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు.


జిల్లాలో భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, బీబీనగర్‌, చౌటుప్పల్‌, రామన్నపేట మండలాలను మూసీ పరివాహక ప్రాంతంగా వ్యవసాయ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా ప్రజా ప్రతినిధి ఒత్తిడి మేరకు మోత్కూరు, అడ్డగూడూరు మండలాలను కూడా మూసీ పరివాహకంగా గుర్తించారు. దీంతో జిల్లాలో మూసీ పరివాహకం కిందనే 91వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మూసీ ఆయకట్టులో వరి తప్ప ఇతర పంటలు సాగు చేయడానికి సానుకూలత ఏమాత్రం ఉండదు. అయితే సాధారణంగానే రైతులు సన్నరకాల సాగుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.  మూసీ పరివాహక ఆయకట్టులో సన్నధాన్యం సాగు లాభసాటి కాదనే రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. భూగర్భ జలాధారంగా బోరుబావులు, చెరువులు, కుంటల కింద కూడా సన్నరకం వరి సాగుకు  రైతులు ఇష్టపడటం లేదు.


పాడికి శ్రేయస్కరం కాని ‘సన్న’ పశుగ్రాసం

 సన్నరకం ధాన్యం దిగుబడి తక్కువ రావడం ఒక కారణం కాగా, పాడి పరిశ్రమ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా గల ఈ ప్రాంత రైతులు సన్నరకం పశుగ్రాసం పాడి పశువుల మేత శ్రేయస్కరం కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం పంటల సాగులో మొత్తం 1,30,455 ఎకరాల్లో మూసీ పరివాహక ప్రాంతంలోనే 91వేల ఎకరాలు మినహాయిస్తే మిగిలిన ఇతర ప్రాంతాల వరి సాగు చేసే విస్తీర్ణం కేవలం 39,455 ఎకరాల విస్తీర్ణం మాత్రమే. బోరు బావులు, చెరువులు కుంటల కింద మొత్తం ఆయకట్టు సన్నరకం సాగు చేసినా జిల్లా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం  40శాతం సన్నరకం 52,182 ఎకరాల సాగుకు సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి.


మూసీ ఆయకట్టు ఏతర ప్రాంతంలో నూటికి నూరు శాతం సన్న రకాలు సాగుచేసినా 40వేల ఎకరాలకు మించి  సాగు చేయడం సాధ్యం కాదు. అయితే మూసీ ఆయకట్టేతర ప్రాంతాల్లో కూడా వరి సాగు చేసే రైతులు చాలా మంది తమతమ ఆహార అవసరాల వరకే సన్నరకం సాగుకు మొగ్గు చూపుతున్నారు. దిగుబడి, పశుగ్రాసం పరంగా దొడ్డు రకం వరి సాగుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పంటల సాగుపై క్లస్టర్‌ స్థాయిలో రైతులకు కార్యాచరణ అవగాహన సదస్సులో ఆయా పంటల విభజన క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులకు పెద్దతలనొప్పిగా మారింది. జిల్లాలోని మూసీ ఆయకట్టు పరిమాణం ప్రకారం ప్రభుత్వం సన్న రకం సాగు విస్తీర్ణం 40శాతం కంటే తగ్గించాలని రైతులు, వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. 


Updated Date - 2020-05-30T09:31:46+05:30 IST