నేరాలు, ప్రమాదాలు తగ్గాయి
ABN , First Publish Date - 2020-12-30T06:26:35+05:30 IST
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గింది. నేర పరిశోధనలో పోలీ్‌సశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో కేసుల దర్యాప్తులో వేగం పెరిగింది. అంతేగాక చోరీ అయిన సొత్తు రికవరీ శాతం కూడా పెరిగింది.

చోరీ కేసుల్లో పెరిగిన రికవరీ
1578 ప్రమాదాలు, 696 మంది మృతి
723 దొంగతనాల్లో రూ.3.39కోట్లు రికవరీ
సాంకేతికతను వినియోగించుకుంటూ పోలీస్ శాఖ ముందుకు
యాదాద్రి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి) /నల్లగొండ క్రైం, సూర్యాపేట క్రైం: ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గింది. నేర పరిశోధనలో పోలీ్‌సశాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో కేసుల దర్యాప్తులో వేగం పెరిగింది. అంతేగాక చోరీ అయిన సొత్తు రికవరీ శాతం కూడా పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం చివరిలో కరోనా మహమ్మారి ఉధృతి పెరగడంతో దాని నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలులో పోలీసులు భాగస్వాములై విస్తృతంగా సేవలందించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యాచార ఘటనల్లో దర్యాప్తును వేగంగా పూర్తిచేసి నేరస్థుడు మర్రి శ్రీనివా్‌సరెడ్డికి ఉరిశిక్ష పడేలా విచారణ, సాక్షాలను సేకరించడంలో యాదాద్రి జిల్లా పోలీసులు చూపిన ప్రతిభతో పలువురి మన్ననలు పొందారు. నల్లగొండ జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ పీడీఎస్ బియ్యం, గంజాయి, ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది నల్లగొండ జిల్లాలో 845 ప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది 681 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 311 మంది మృతిచెందగా, 657 మంది ప్రయాణికులు గాయపడ్డారు. జాతీయ రహదారిపై 237 ప్రమాదాలు జరగ్గా, 114 మంది మృతి చెందారు. 202 మంది గాయపడ్డారు. అదే విధంగా రాష్ట్ర రహదారులపై 191 ప్రమాదాలు చోటు చేసుకోగా, 88 మంది మృతి చెందారు. 175 మందికి గాయాలయ్యాయి. ఇతర రోడ్లపై 253 ప్రమాదాలు జరుగ్గా, 101 మంది మృతిచెందారు. 280 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డీటీఆర్‌బీ ఆధ్వర్యంలో ఆర్ట్ టీంలు ఏర్పాటయ్యాయి. రోడ్డు ప్రమాదం జరగ్గానే ఈ బృందం సంఘటనా స్థలాన్ని, ప్రమాద తీరును పరిశీలించి నివారణకు చర్యలు తీసుకుంది. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 503 రోడ్డు ప్రమాదాలు నమోదుకాగా, 182 మంది మృతి చెందారు. 490మంది గాయపడ్డారు. భువనగిరి పట్టణ శివారులో డిసెంబరు చివరి వారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. లాక్‌డౌన్‌తో పాటు ట్రాఫిక్ నియంత్రణ కారణంగా గత ఏడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గాయని పోలీసులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపిన 1,36,858 మందిపై కేసులు నమోదు చేసి రూ.7కోట్ల20లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 968 మందిపై కేసులు నమోదు చేశారు.
పెరిగిన రికవరీలు
నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది మొత్తం 276 చోరీ కేసులు నమోదు కాగా, పోలీసులు 162 కేసులను ఛేదించారు. రూ.3,30,88,088 విలువైన సొమ్ములో రూ.1,73,94,140లను రికవరీ చేశారు. యాదాద్రి జిల్లా పరిధిలో 259 దొంగతనాల కేసులు నమోదు కాగా, అందులో 120 కేసులను పరిశోధించి నిందితులను అరెస్టులు చేశారు. ఈ కేసుల్లో రూ.1,63,18,793 విలువగల ఆస్తులు చోరీకి గురికాగా, రూ.59,31,850లను రికవరీ చేశారు. సూర్యాపేట జిల్లాలో 188 దొంగతనాలు జరగ్గా, 124 కేసులను ఛేదించారు. మొత్తం రూ.1,39,6500 సొత్తు చోరీ జరగ్గా, రూ.1,06,3100లను పోలీసులు రికవరీ చేశారు.
నేరాలు, ఘోరాలు
యాదాద్రి జిల్లాలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. జిల్లాలో 18 హత్య కేసులు, ఒక పెటా కేసు నమోదైంది. చిన్నపిల్లలపై అత్యాచారాలతో పాటు మిస్సింగ్ కేసులు పెరిగాయి. 66 పోస్కో, 295 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 252 మిస్సింగ్ కేసులను పోలీసులు ట్రేస్ చేశారు. ఇందులో అధికంగా ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలవే అధికంగా ఉన్నాయి. పేకాట, కోడి పందేలు వంటి జూదం కేసులు 39 నమోదు చేసి, రూ.22,98,656 సొత్తును సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 4,539 వివిధ రకాల కేసులు నమోదయ్యాయి. 12,988 పిటీ కేసులు పెట్టారు. సూర్యాపేట జిల్లాలో గంజాయిని రవాణా చేస్తూ విక్రయించే వారిపై 14 కేసులు నమోదు చేసి 490 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.35లక్షల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకుని 141 మందిపై కేసులు నమోదు చేశారు. తరచూ నేరాలు పాల్పడే 58మందిపై రౌడీషీట్లు తెరవడంతోపాటు, మరో ఇద్దరిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. అదేవిధంగా 641 మందిని బైండోవర్ చేశారు. నల్లగొండ జిల్లాలో 27 హత్యలు, 6886 ఇతర నేరాలు జరిగాయి.
మానవ మృగానికి ఉరిశిక్ష
అభం శుభం తెలియని చిన్నారులను నమ్మించి అత్యాచారం ఆ తరువాత హత్యచేసి బావిలో పూడ్చిన హాజీపూర్ ఘటన నిందితుడు మర్రి శ్రీనివా్‌సరెడ్డికి ఉరి శిక్ష పడటంలో పోలీసుల కృషి అభినందనలు పొందింది. 11, 14, 17 ఏళ్ల బాలికలపై హత్యాచారం కేసులో నిందితుడు మర్రి శ్రీనివా్‌సరెడ్డికి నల్లగొండ పోక్సో ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఊరిశిక్షను ఖరారు చేసింది. ఘటన వెలుగుచూసిన 90 రోజుల్లోనే కేసు దర్యాప్తును పోలీసులు పూర్తిచేశారు.
దొంగతనాలు
జిల్లా కేసులు ఛేదించినవి చోరీకి గురైన సొత్తు రికవరీ చేసిన సొత్తు
నల్లగొండ 276 162 రూ.3,30,88,088 రూ.1,73,94,140
యాదాద్రి 259 120 రూ.1,63,18,793 రూ.59,31,850
సూర్యాపేట 188 124 రూ.1,39,65,000 రూ.1,06,31,000
మొత్తం 723 406 రూ.6,33,71,881 రూ.3,39,56,990
రోడ్డు ప్రమాదాలు ఇలా..
జిల్లా ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
నల్లగొండ 681 311 617
సూర్యాపేట 394 203 443
యాదాద్రి 503 182 490
మొత్తం 1578 696 1550