దోచెయ్‌ కరోనా ప్యాకేజీలు సిద్ధం

ABN , First Publish Date - 2020-08-01T11:20:03+05:30 IST

దోచుకునేందుకు ఇదే అదును అనుకున్నట్టుంది మిర్యాలగూడ డాక్టర్స్‌ కాలనీలోని ఓ ప్రైవేటు వైద్యుడు

దోచెయ్‌ కరోనా ప్యాకేజీలు సిద్ధం

రాపిడ్‌ టెస్టు, మందులకు రూ.20వేలు

డాక్టర్స్‌ కాలనీలో ఛాతి వైద్యుడి దందా


నల్లగొండ, జూలై 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దోచుకునేందుకు ఇదే అదును అనుకున్నట్టుంది మిర్యాలగూడ డాక్టర్స్‌ కాలనీలోని ఓ ప్రైవేటు వైద్యుడు. నిబంధలు పక్కనపెట్టి, భయాందోళనతో వస్తున్న పల్లె జనాన్ని నిలువునా దోచుకుంటున్నాడు. ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా పరీక్షల కిట్లు పూర్తిస్థాయి లో లేకపోవడం, కిట్లు వచ్చిన రోజే లెక్కకు మించి జనం ఉండటంతో, అనుమానితులు ఆందోళన చెందుతున్నారు. ఇలా భయం భయంగా ఉన్న వారిని కనిపెట్టి మిర్యాలగూడ చుట్టుపక్కల నుంచి వచ్చే వారిని ల్యాబ్‌ నిర్వాహకులు సంప్రదిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయా? లేవా? ఉంటే ఎంత తీవ్ర త ఉందో చెప్పాలంటే సిటీ స్కానింగ్‌ చేయాలని రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఇది కొంత కాలంగా గుట్టుప్పుడుకాకుండా సాగుతుండగా, వ్యవహారం ముదిరి రాపిడ్‌ టెస్టులు, కరోనా మందుల పేరిట కొత్త దందా మొదలైంది.అనుమానితులను ల్యాబ్‌ నిర్వాహకుడు ఛాతి డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లి, అక్కడ రహస్యంగా కరోనా రాపిడ్‌ పరీక్ష, సిటీ స్కానింగ్‌ చేస్తున్నారు. ఆ తరువాత మందులు రాసి ఒక్కొక్కరి నుంచి రూ.20వేలు వసూలు చేస్తున్నారు. రాపిడ్‌ పరీక్షకు రూ.2,700, సిటీ స్కానింగ్‌కు రూ.3వే లు, రూ.14వేలు మందులకు వసూలు చేస్తున్నారు.


కరోనా పరీక్షలు ప్రైవేటు వ్యక్తులు నిర్వహించాలన్న, వైద్యం చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ అనుమతి తప్ప ని సరి. అయితే వీటిని పట్టించుకోకుండానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మిర్యాలగూడలో పరీక్షలకు తెరలేపారు. హైదరాబాద్‌ నుంచి రాపిడ్‌ కిట్లు తెచ్చి మిర్యాలగూడ లో పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షకు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన ధర రూ.700 కాగా, అనధికారికంగా రూ.2700 వసూలు చేస్తున్నారు. కరోనా తీవ్ర లక్షణాలు ఉన్న వారికి నిర్ణయించిన కొన్ని మందులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా ఎక్కడ పడితే అక్కడ లభించవు. అయినా మిర్యాలగూడలోని సదరు డాక్టర్‌ మాత్రం కరోనా మందుల పేరుతో రూ.14వేలు వసూలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, నల్లగొండలో ఒకరిద్దరు డాక్టర్లు కరోనా ప్యాకేజీ రూ.10వేల పేరుతో సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పల్స్‌ ఆక్సీమీటర్‌, మాస్క్‌, గ్లౌజ్‌, మందులు, ఆన్‌లైన్‌లో వైద్యం చేస్తున్నారు. 


ఈ చికిత్సా విధానం ఎంత మేరకు వాస్తవం, దీనికి అనుమతులు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎ.కొండలరావును వివరణ కోరగా ‘ప్రైవేటు వ్యక్తులు కరోనా పరీక్షలు నిర్వహించడం, మందుల పేరుతో వ్యాపారం చేయడం నేరం. అలా చేసినవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజ లు వాస్తవాలు గుర్తించాలి ఆందోళనకు గురై ఆరో గ్యం, డబ్బు పోగొట్టుకోవద్దు. ఆన్‌లైన్‌ వైద్యం, కరోనా కిట్స్‌ ప్యాకేజీపై ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకొని చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

Updated Date - 2020-08-01T11:20:03+05:30 IST