ఉపాధ్యాయులపై కరోనా పంజా
ABN , First Publish Date - 2020-09-12T09:39:46+05:30 IST
కరోనా వైరస్ ఉపాధ్యాయులపై పంజా విసురుతోంది. సుమారు ఐదునెలలు పాఠశాలల మూత అనంతరం

ఉమ్మడి జిల్లాలో వైరస్‌బారిన 232 మంది, ఇద్దరి మృతి
నల్లగొండ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వైరస్ ఉపాధ్యాయులపై పంజా విసురుతోంది. సుమారు ఐదునెలలు పాఠశాలల మూత అనంతరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల పేరుతో గత నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయులు తిరిగి విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు ఉపాధ్యాయులు విధులకు హాజరవుతూనే ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, గత నెల 27 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 232 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడగా, ఇద్దరు మృతి చెందారు. అందులో నల్లగొండ జిల్లాలో 119 మంది, సూర్యాపేట 60, యాదాద్రి జిల్లాలో 53 మంది ఉన్నారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మొత్తం ఇద్దరు కరోనాతో మృతిచెందారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు, కొన్ని పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం సరిగా లేక ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే రేపటినుంచి ఈనెల 20 వరకు పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని, 21నుంచి 50 శాతం టీచర్లు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
విద్యుత్ కోతలతో ‘ఆన్‌లైన్’కు అంతరాయం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల పాఠశాలలు ఉన్నాయి. అందులో 13వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 2051 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 5వేల పైచిలుకు ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండడంతోపాటు సెల్ సిగ్నల్ సమస్య కారణంగా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా ఆన్‌లైన్ విద్య కొందరికే అందుతోంది. దీనికి తోడు ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటంతో తరగతుల పర్యవేక్షణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.