కరోనా అటెన్షన్‌

ABN , First Publish Date - 2020-03-19T11:57:36+05:30 IST

నగర శివారు జిల్లా యాదాద్రి భువనగిరి వ్యాప్తంగా కరోనా వైరస్‌ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా అమలు

కరోనా అటెన్షన్‌

(ఆంధ్రజ్యోతి- యాదాద్రి): నగర శివారు జిల్లా యాదాద్రి భువనగిరి వ్యాప్తంగా కరోనా వైరస్‌ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు జనసమర్ధ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతపాటించి కరోనాను దూరం పెట్టవచ్చని అవగాహనా కార్యక్రమాలు ముమ్మరంచేశారు.


దీనిలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని రైతు బజారు  కూరగాయల మార్కెట్‌ను బంద్‌చేయించి క్రిమిసంహారకమందులతో పరిశుభ్రంచేశారు. మార్కెట్‌లో ఎక్కువ మంది గుమిగూడకుండా ద్వారాలను క్రమబద్ధీకరించారు. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ ఆంక్షల కారణంగా జిల్లా రవాణా కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు పెద్దఎత్తున రద్దీ నెలకొంటోంది. దీంతో కార్యాలయం సిబ్బంది సందర్శకులకు శానిటరైజ్‌ సామగ్రిని అందజేసి చేతులు శుభ్రంచేయించారు. బ్యాంకులు, ఇతర కార్యాలయాల్లో కూడా ఒకేసారి పెద్దసంఖ్యలో తమతమ ఆవరణలోనికి అనుమతించడంలేదు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానాల సముదాయానికి గేటుపెట్టి, కక్షిదారులను గేటు బయటనుంచే వారివారి వాయిదాలను తెలిపిపంపించారు. కేవలం ముఖ్యమైన వ్యాజ్యాలను న్యాయవాదుల ద్వారా పరిశీలించారు. 


జిల్లా కేంద్రంలోనే  ఐసోలేషన్‌ కేంద్రాలు

కరోనా వైరస్‌ అనుమానితులను పరీక్షించడానికి ఎక్కడి జిల్లాలోని వారిని అక్కడి ఐసోలేషన్‌ కేంద్రాల్లో పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా కేంద్రం సమీపంలో అనుమానితులను ఐసోలేట్‌ చేయడానికి అనువైన ప్రాంతాలను ఎంపికచేయడానికి కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు పలుప్రాంతాల్లో ఆధునిక వసతులుగల భవనాలను పరిశీలించారు. 


యాదాద్రి ఆలయ సన్నిధిలో శానిటైజేషన్‌

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ ఉన్నతస్థాయి సమావేశం ఆదేశాలమేరకు యాదగిరిగుట్ట  లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో శానిటైజేషన్‌ చర్యలుచేపట్టారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడానికి అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశారు. క్యూలైన్ల బయట, లోపల, ఆలయాలు, ప్రాంగణాల్లో యాంటీ బ్యాక్టీరియా ద్రావణం పిచికారీచేయడమే కాకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు చేతులు శుభ్రం చేసుకోవడానికి నీటిని, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.


Updated Date - 2020-03-19T11:57:36+05:30 IST