మంటెక్కిస్తున్న వంట గ్యాస్
ABN , First Publish Date - 2020-12-20T05:27:32+05:30 IST
కరోనా దెబ్బతో ఉన్న ఉపాధిపోయి భారంగా బతుకులీడుస్తున్న బడుగు జీవులపై గ్యాస్ ధర భారమవుతోంది. గతంలో గృహ అవసరాల వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచి తే, అందులో సుమారు 75శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది.

15 రోజుల్లో సిలిండర్ ధర రెండుమార్లు పెంపు
పెరిగిన ధర రూ.100, సబ్సిడీ 90పైసలు
అదనంగా డెలివరీ చార్జీల బాదుడు
ఈ నెల 2 నుంచి అందని సబ్సిడీ
(మోత్కూరు)
కరోనా దెబ్బతో ఉన్న ఉపాధిపోయి భారంగా బతుకులీడుస్తున్న బడుగు జీవులపై గ్యాస్ ధర భారమవుతోంది. గతంలో గృహ అవసరాల వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచి తే, అందులో సుమారు 75శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. ప్రస్తుతం సబ్సిడీని ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నెల లో 15రోజుల్లో సిలిండర్ ధర రూ.100 అదనంగా పెరగ్గా, ప్రభుత్వం మాత్రం సబ్సిడీని 90పైసలే పెంచింది.
గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) వంట గ్యాస్ సిలిండర్ ధర 15 రోజుల్లో రెండుమార్లు పెరిగింది. నవంబరు నెలాఖరు వరకు సిలిండర్ ధర రూ.663.50 ఉండగా, ఈ నెల 2న రూ.50 అదనంగా పెరగడంతో రూ.713.50 అయింది. 14న మరోసా రి రూ.50 పెరగడంతో ధరను రూ.763.50కు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.91 అదనంగా పెరగడంతో రూ.1512 అయింది. నవంబరు నెలాఖరు వరకు డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.663.50 ఉండగా, ప్రభుత్వం రూ.46 సబ్సిడీ ఇచ్చింది. ఈ నెల 2న ధర రూ.50 పెరగ్గా, 14వ తేదీ వరకు సిలిండర్ తీసుకున్న వారికి నేటికీ సబ్సిడీ రాలేదు. 14న మరోమారు రూ.50 అదనం గా ధర పెరిగి రూ.763.50కు చేరగా, ప్రభుత్వం రూ.46.90 సబ్సిడీ మాత్రమే ఇస్తోంది. అదికూడా సక్రమంగా రావడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఇక ఈ నెల 2న పెరిగిన సిలిండర్ ధరకు సంబంధించిన సబ్సిడీ నేటికీ వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలే దు. దీనికి సంబంధించిన సబ్సిడీపై స్పష్టత లేదు. ఈ నెల 16న సిలిండ్ తీసుకున్న వారి లో కొందరికి శనివారం రూ.46.90 సబ్సిడీ బ్యాంకు ఖాతాలో జమ అయింది.
డోర్ డెలివరీ ఏజెన్సీల బాదుడు
వంట గ్యాస్ ధరకు తోడు డోర్ డెలివరీ ఏజెన్సీల బాదుడుతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రాంతం నుంచి 5కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా సిలిండర్ డోర్‌డెలివరీ చేయాల్సి ఉంది. అయితే డెలివరీ ఏజెన్సీలు వినియోగదారుల నుంచి రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నాయి. ఐదు కిలో మీటర్ల పరిధి దాటి వెళ్తే రూ.30 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు.
వినియోగదారులపై ఏడాదికి సుమారు రూ.24కోట్ల భారం
నల్లగొండ జిల్లాలో 4,15,805, యాదాద్రి జిల్లాలో 2,29,588, సూర్యాపేట జిల్లాలో 3,24,567 చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం 9,69,960 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సుమారు రెండు లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.100, కమర్షియల్ సిలిండర్‌పై రూ.91 ధర పెరగడంతో వినియోగదారులపై సుమారు నెలకు రూ.2కోట్ల చొప్పున ఏడాదికి రూ.24కోట్ల భారంపడుతోంది.
15 రోజుల్లో రెండుమార్లు ధర పెంచారు : చంద్రయ్య, వినియోగదారుడు, బ్రాహ్మణపల్లి
నేను రైతును. పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే పట్టించుకోని ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం 15 రోజుల్లో రెండుమార్లు పెంచింది. నవంబరు వరకు 663.50 ధర ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ.763.50 చేరింది. నవంబరు వరకు రూ.46 సబ్సిడీ ఇవ్వగా ఇప్పుడు రూ.46.90 సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు.
సబ్సిడీ అందడం లేదు : ఎలిమినేటి లక్ష్మి, గృహిణి, ఆత్మకూరు(ఎం)
ప్రభుత్వం సిలిండర్‌పై సబ్సిడీ ఇచ్చేదే తక్కువ. అది కూడా సక్రమంగా అందడం లేదు. మాకు దీపం పథకం కనెక్షన్ ఉంది. సిలిండర్ డోర్‌డెలివరీ చేసేవారు రూ.40 తీసుకుంటున్నారు. మూడేళ్లుగా మాకు సబ్సిడీ రావడం లేదు. మోత్కూరు భారత్‌గ్యా్‌స కార్యాలయానికి, బ్యాంకు ఎన్నోమార్లు తిరిగి విసిగి సబ్సిడీపై ఆశ వదులుకున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్సిడీ వచ్చేలా చూడాలి.