రోడ్లపైకి జనాలు, వాహనాలు
ABN , First Publish Date - 2020-03-24T11:57:26+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా ప్రజలు ధిక్కరించారు. సోమవారం రోడ్లపైకి జనాలతో పాటు వాహనాలు

సర్కార్ ఆదేశాలు ధిక్కారం
ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
అధిక ధరల నియంత్రణకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
నల్లగొండ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా ప్రజలు ధిక్కరించారు. సోమవారం రోడ్లపైకి జనాలతో పాటు వాహనాలు అధిక సంఖ్యలో వచ్చాయి. ఆదివారం ఒక్క రోజే జనత కర్ఫ్యూ ఉంటుందని అంతా భావించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించటంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులు తమ సొంత ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. ప్రజలు తమ సొంత వాహనాల్లో సోమవారం ఉదయం నుంచే బయలుదేరి వెళ్తున్నారు. చౌటుప్పల్ ప్రాంతంలోని పంతంగి, కేతేపల్లి ప్రాంతంలోని కొర్లపహాడ్ వద్ద గల టోల్‌గెట్ల వద్ద యథేచ్ఛగా వదిలివేయడంతో కోదాడ, వాడపల్లి ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఆయా ప్రాంతాల్లో పోలీసులు సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద వాహనాలను ఏపీలోకి రాకుం డా నిలిపివేశారు. అయితే ప్రజలు మాత్రం పోలీసుల చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిపోయారు. రోడ్లపై ఐదుగురికి మించి గుమికూడదని పోలీసులు ఆదేశించినా ప్రజలు తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చారు. అత్యవసరమైన దుకాణాలను తీయాలని చెప్పడంతో ఇతర షాపులను కూడా తెలిచారు. ప్రజలు 15 రోజులకు సరిపడా సరుకులను కొనుగోలు చేయడానికి వచ్చారు. మంత్రి జగదీ్‌షరెడ్డి ముడు జిల్లాల పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లి వియత్నాం వాసులను పరామర్శించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
కరోనా వైరస్ నియంత్రణలో భా గంగా వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్ చేసిన నేపథ్యంలో జిల్లా ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరా, అత్యవసర సర్వీసులైన విద్యుత్, మంచినీరు, అగ్నిమాపక ఏర్పాట్లను అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, రాహుల్‌శర్మలతో కలిసి ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. నిత్యావసర సరుకులకు ఏ సమస్యలు ఏర్పడకుండా కలెక్టరేట్‌లో 18004251442 టోల్ ఫ్రీ నెంబర్‌ను, 08682-244151 నెం బర్‌తో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. జిల్లాలో అధి క ధరలు, బ్లాక్ మార్కెట్‌పై 100, 08682- 22423, 9440795618 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలి పారు. ఈ కేంద్రాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటు లో ఉంటారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ ఫోన్ నెంబరు సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.