రిజిస్ట్రేషన్లలో గందరగోళం
ABN , First Publish Date - 2020-12-15T06:04:55+05:30 IST
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ముందుకుపడటం లేదు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ముందుకుసాగని వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు
చెప్పింది పాత పద్ధతి.. వివరాలు కొత్త పద్ధతిలో..
మొరాయిస్తున్న సర్వర్లు
ఎల్‌ఆర్‌ఎస్ లేకుంటే అంతే సంగతి
ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఏడు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ముందుకుపడటం లేదు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తొలుత సర్వర్ బిజీ, ఆ తరువాత ఎల్‌ఆర్‌ఎస్ లేని భూములు, మార్ట్‌గేజ్, గిఫ్ట్ డీడ్‌లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. మీ-సేవలోనూ స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇచ్చినా ఫలితం లేదు. ఉమ్మడి జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మూడు రోజుల్లో తొమ్మిది స్లాట్లు బుక్ కాగా, ఏడు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఒకటి సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉండగా, మరొకటి డమ్మీ స్లాట్. ఇక కొత్త స్లాట్లు బుక్ కాలేదు. రోజుకు 300 రిజిస్ట్రేషన్లు జరిగే చోట ఏడుకే పరిమితంకావడంతో, రిజిస్ట్రార్ ఆఫీసులకు వందలాదిగా వచ్చి న క్రయ, విక్రయదారులు నిట్టూరుస్తూ వెళ్లడం రివాజుగా మారింది.
పాత పద్ధతి అని చెప్పినా..
పాత పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని మంత్రులు, అధికారులు చెబుతున్నా అది జరగడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కావడం లేదు. వేకెంట్ ల్యాండ్ పన్ను కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. ధరణి పోర్టల్ ప్రకారం వివరాలు అడుగుతుండగా, ఈ పోర్టల్‌లో లింక్ డాక్యుమెంట్లు చూపడం లేదు. 200 గజాల భూమి కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన కొలతలు చూపకుండా హద్దులు మాత్రమే చూపిస్తోంది. దీంతో ఓపెన్ ప్లాట్‌ల వారికి చుట్టు పక్కల వారితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇంటి రిజిస్ట్రేషన్ చేసేందుకు పోర్టల్‌లో లింక్ డాక్యుమెంట్లు లేవు. ఆ ఇంట్లో కొంత భాగం విక్రయించేందుకు ఎలాంటి ఆప్షన్ లేదు. ఒకరికి 600 గజాల ఓపెన్ ప్లాట్ ఉంటే, 100 గజాలు విక్రయిస్తే, మొత్తం స్థలానికి రిజిస్ట్రేషన్ అడుగుతోంది. లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ జరిగితే బ్యాంక్ లోన్లు మంజూరుకావని లీగల్ అడ్వయిజర్లు, బ్యాంక్ మేనేజర్లు స్పష్టం చేస్తుండటంతో రిజిస్ట్రేషన్‌కు వెళ్లేందుకు విక్రయదారులు జంకుతున్నారు.
సతాయిస్తున్న సర్వర్
ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, గతంలో నిత్యం 150 నుంచి 300 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. కొత్త విధానంతో మూడు రోజుల్లో ఏడు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగ్గా, స్లాట్ బుకింగ్‌లు లేవు. ఉమ్మడి జిల్లాలో కోదాడలో మూడు, మిర్యాలగూడలో రెండు, మోత్కురు, నల్లగొండ, సూర్యాపేట, బీబీనగర్‌లో ఒకటి చొప్పున మొత్తం తొమ్మిది స్లాట్లు బుక్ కాగా, మిర్యాలగూడ, మోత్కూరు నుంచి ఒక్కో దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నాయి. వేలిముద్రను బయోమెట్రిక్ యంత్రం తీసుకోకపోవడంతో మోత్కురులో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాలేదు. ఇక మిర్యాలగూడలో ఒక డమ్మీ స్లాట్ కావడంతో అది రిజిస్ట్రేషన్ కాదు. ఇక మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు నిత్యం క్రయ విక్రయదారులు రావడం వెళ్లడం జరుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు వస్తున్నా స్టాట్లు బుక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగక బోసిపోతోంది. కూతురు వివాహ ఖర్చులకు భూమి విక్రయించిన వారికి రిజిస్ట్రేషన్ కాక డబ్బులు అందని పరిస్థితి ఏర్పడింది. భూమి కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చి నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్‌కాక పూర్తికాక, డబ్బు చెల్లించకపోవడంతో అడ్వాన్స్‌లు ఉంటాయో? లేదో తెలియని అయోమయంతో ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్లాట్ బుక్ చేసుకోవడం లేదు : ప్రవీణ్ కుమార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్
స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. మీ-సేవలో కూడా స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించాం. స్లాట్ బుకింగ్ చేసుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తాం. ఎటువంటి సాంకేతిక సమస్యలు లేవు.
ఆ ఒక్కటీ పెండింగ్
మోత్కూరు, మిర్యాలగూడ, చౌటుప్పల్ టౌన్: మోత్కూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇప్పటి వరకు ఒక్క స్లాట్ మాత్రమే బుక్ అయింది. ఆత్మకూరు(ఎం) మండలం పల్లెపహాడ్‌కు చెందిన ఒకరు కూతురి పేరున గిఫ్ట్ డీడ్ చేసేందుకు స్లాట్ బుక్ చేశాడు. 70ఏళ్ల పైబడి వయసు ఉన్న అతడి వేలిముద్ర బయోమెట్రిక్‌లో నమోదుకాలేదు. దీంతో ఆ రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పడింది. మరొకరు ఇంటిని మార్ట్‌గేజ్ చేసేందుకు స్లాట్ బుకింగ్‌కు యత్నించగా, మునిసిపల్ కార్యాలయంలో అప్రూవ్ కాలేదని రిజిస్ట్రేషన్ కాలేదు. మిర్యాలగూడలో ఒకటి రిజిస్ట్రేషన్ కాగా, చౌటుప్పల్‌లో స్లాట్ బుక్ కాలేదు.