దొంగతనానికి వచ్చి..

ABN , First Publish Date - 2020-12-27T06:09:31+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులో దొంగతనానికి వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందగా, ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది.

దొంగతనానికి వచ్చి..
మహేష్‌(ఫైల్‌)

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు 26: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శివారులో దొంగతనానికి వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందగా, ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మహేష్‌(26), ఒడిషా రాష్ట్రానికి చెందిన చందు(25) హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ వీరు రాత్రి సమయాల్లో అద్దె ఆటో తీసుకొని వచ్చి పాత ఇనుప సామగ్రిని దొంగిలిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 19న రాత్రి దండుమల్కాపురం శివారులోని హైటెక్‌ సిమెంట్‌ బ్రిక్స్‌ పరిశ్రమలో దొంగతనానికి వచ్చారు. పరిశ్రమ ప్రహరీని మహేష్‌ దూకగా, పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఉండటంతో అక్కడి వైర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మహేష్‌ మృతిచెందడంతో, చందు భయాందోళనకు గురై అక్కడే ఆటోను వదిలేసి పరారయ్యాడు. పరిశ్రమ యాజమాన్యం కూడా మృతదేహాన్ని గమనించలేదు. ఈ క్రమంఒలో చందు మహేష్‌ బంధువులకు ఫోన్‌ చేసి, మహేష్‌ కనిపించడం లేదని సమాచారం అందించాడు. బీదర్‌లో ఉన్న మహేష్‌ సోదరుడు వీరేష్‌ వచ్చి చందు తీరుపై అనుమానం వ్యక్తం చేశాడు. చందుపై ఒత్తిడి తేవడంతో, అసలు విషయం చెప్పాడు. మృతదేహం కోసం వారిద్దరు పరిశ్రమ వద్దకు శనివారం వచ్చారు. కాగా, శనివారం కంపెనీలో పనిచేసే ఎలక్ర్టీషియన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించింది. ఈ మేరకు పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా వచ్చిన చందును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, దొంగతనం విషయం బయటపడింది. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


వివాహిత ఆత్మహత్య

చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు26: క్షణాకావేశానికి గురై వివాహిత నైట్రేట్‌ రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. వలిగొండ మండలం రాఘవపురానికి చెందిన విజయలక్ష్మి(42) చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన గర్దాసు రాజు వివాహం 20సంవత్సరాల క్రితం జరిగింది. విజయలక్ష్మి తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడంతో, ఇటీవల విజయలక్ష్మీ తల్లి గారి ఆస్తిని అమ్మగా రూ.28లక్షలు వచ్చాయి. ఈ డబ్బులను హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేద్దామని విజయలక్ష్మి, గ్రామంలోనే పొలం కొందామని భర్త రాజు మధ్య మూడు నెలల నుంచి  గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయలక్ష్మి శనివారం ఇంట్లో నైట్రేట్‌ రసాయన ద్రావణం తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన విజయలక్ష్మీని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. విజయలక్ష్మికి ఇద్దరు పిల్లలున్నారు. 


గుట్కా ప్యాకెట్ల  స్వాధీనం

మోత్కూరు, డిసెంబరు 26: మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద శనివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ బైక్‌పై అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్‌ఐ యాదయ్య, పోలీస్‌ సిబ్బంది అనాజిపురం వద్ద వాహనాలు తనిఖీ చేశారు. వలిగొండ మండలం దుప్పెళ్లి గ్రామానికి చెందిన వ్యాపారి కందుకూరి నవీన్‌ కుమార్‌ బైక్‌(నంబరు ఏపీ 29 క్యూ 4577)కు సంచులు తగిలించుకుని వెళ్లుతుండగా పోలీసులు అతన్ని ఆపి సంచులు తనిఖీ చేశారు. వాటిల్లో రూ.10,875 విలువ కల్గిన నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉండగా వాటిని, బైక్‌ను సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యాపారి నవీన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


జైన్‌ ఇరిగేషన్‌ కంపెనీలో కార్మికుడి అనుమానాస్పద  మృతి 

కంపెనీ ఎదుట బంధువుల ధర్నా 

బీబీనగర్‌, డిసెంబరు 26: బీబీనగర్‌ మండలం కొండమడుగు మెట్టు వద్ద జైన్‌ ఇరిగేషన్‌ కంపెనీలో గొడుగు నారాయణ(55) అనే కార్మికుడు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడగండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు నారాయణ 15 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం భార్యా పిల్లలతో కలిసి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌కు వలస వచ్చాడు. అప్పటి నుంచి జైన్‌ ఇరిగేషన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. కాగా ఎప్పటిలాగే విధుల్లో చేరిన శనివారం ఆయన ఉదయం 9.30గంటల సమయంలో కిందపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కంపెనీ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. అయితే మృతుని ముఖంపై కనత నుదుడి భాగాల్లో గాయాలు అనుమానాలకు తావిస్తున్నాయని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంటి నుంచి ఎంతో సంతోషంగా డ్యూటీకి వచ్చిన తన భర్త ఏ కారణం లేకుండా ఎలా చనిపోతాడని భార్య సుగుణ ప్రశ్నించారు. మృతికి గల కారణాలు తెలుపాలని మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు కంపెనీ  ఎదుట ఆందోళనకు దిగారు.  కంపెనీ యాజమాన్యం కార్మికుడి బంధువులతో చర్చలు జరిపిన అనంతరం బాధిత కుటుంబానికి రూ.4లక్షల పరిహారంతో పాటు ఉద్యోగ పరంగా రావాల్సిన అన్నిచెల్లింపులను అందజేయనున్నట్లు హామీ ఇచ్చింది. నారాయణరావు బార్యకు కుటుంబానికి  ఉద్యోగం కల్పించేందుకు యాజమాన్యం ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు.  కాగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-27T06:09:31+05:30 IST