పల్లెప్రగతి పనులు సకాలంలో పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-02-08T10:55:08+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో డంపింగ్‌యార్డులు, వైకుంఠదామాలు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్

నల్లగొండ, ఫిబ్రవరి 7: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో డంపింగ్‌యార్డులు, వైకుంఠదామాలు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఉదయాదిత్య భవనంలో నల్లగొండ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, పంచాయతీరాజ్, ఐబీ, ఎంఆర్‌ఎ్‌సఎల్‌బీసీ, ఈఈలు, ఏఈలతో ఆయా మండలాల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠదామాల ప్రగతి గ్రామ పంచాయతీ వారీ గా సమీక్షించారు.
పల్లెప్రగతిలో ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠదామం ప్రతి జీపీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని సూచించారు. పల్లెప్రగతితో గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు, పచ్చదనం పెంపొందించాలని, గ్రామం పరిశుభ్రంగా, అద్దంగా కనిపించాలన్నారు. పల్లెప్రగతి మొదటి, రెండో దశ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో గుర్తించి, పనులు మొదలు పెట్టిన డంపింగ్ యార్డులు, కంపో్‌స్టషెడ్‌లు, వైకుంఠదామాలు మార్చి 10లోగా పూర్తి చేయాలని ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వ యంగా పల్లెప్రగతి కార్యక్రమం పర్యవేక్షిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతిలో చేపట్టిన పనులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శించి ప్రభుత్వానికి రిపోర్టు చేస్తాయని అన్నారు.
పంచాయతీ రాజ్ ఈఈలు మార్కెట్ ఫౌండేషన్ స్టేజ్, ప్లాట్‌ఫాం లెవెల్, శ్లాబ్ లెవెల్, పూర్తి అయినవి ఎన్ని మండల వారీగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మండలంలో డంపింగ్ యార్డు, వైకుంఠదామాలు గ్రామ పంచాయతీల వారీగా ఎన్ని మంజూరు చేశారు? ఎన్ని పూర్తి చేశారు? ఎన్ని నిర్మాణాలు మొదలు పెట్టారు? ఎన్ని ప్రగతిలో ఉన్నాయో సమీక్షించారు. ఈ నెల20లోగా ఎన్ని పూర్తి చేస్తారు? మార్చి 10లోగా ఎన్ని పూర్తి చేస్తారు? అనేది మినిట్స్‌లో రికార్డు అయినందున అందుకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మళ్లీ 15రోజుల తర్వాత ఫిబ్రవరి 22న సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పనుల ప్రగతి సమీక్షించనున్నట్లు తెలిపారు.
నేమ్ బోర్డులు పెట్టాలి
గ్రామ పంచాయతీలో పూర్తి చేసిన డంపింగ్‌యార్డులు, వైకుంఠదామాల వద్ద జిల్లా వ్యాప్తంగా అంతటా ఒకే విధంగా, ఒకే కలర్‌లో ‘నేం బోర్డు’లు పెట్టాలని, వీటికి గ్రామ పంచాయతీ జనరల్ నిధులు ఉపయోగించాలని సూచించారు. వివాదాలు ఉన్న భూములు తహసీల్దార్లు, ఏఈ పంచాయతీరాజ్‌లు పరిష్కరించాలని అన్నారు. అటవీ వివాదాలు ఉన్న భూములు డీఎ్‌ఫవో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఇన్‌చార్జి సీఈవో సీతాకుమారి, ఆర్‌డీవోలు జగదీశ్వర్‌రెడ్డి, లింగ్యానాయక్, రోహిత్ సింగ్, సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
సమావేశాలకు సకాలంలో హాజరుకావాలి
పల్లెప్రగతిలో డంపింగ్ యార్డులు, వైకుంఠదామాల ప్రగతిపై ఏర్పాటు చేసిన సమావేశానికి కొందరు ఎంపీడీవోలు ఆలస్యంగా రావడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశాలకు సమయపాలన పాటించాలని, ఆలస్యంగా వస్తే రెండు సార్లు చార్జి మెమోలు చేసి, మూడోసారి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సమావేశంలో పలువురు ఎంపీడీవోలు సెలవులో ఉండడం గమనించి ఎంపీడీవోలు సెలవుకు కలెక్టర్ అనుమతి తీసుకోవాలని, తహసీల్దార్‌కు, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ రికమెండ్ చేయాలని సూచించారు.