వటపత్రశాయికి.. వరహాల లాలీ

ABN , First Publish Date - 2020-03-02T11:49:41+05:30 IST

‘వటపత్రశాయికి వరహాల లాలీ, రాజీవనేత్రునికి రతనాల లాలీ’ అంటూ భక్తజనులు జగత్‌ కల్యాణకారకుడు

వటపత్రశాయికి.. వరహాల లాలీ

శ్రీమన్నారాయణుడి సుమధుర లీలా ఘట్టం

చిన్నికృష్ణుడి అలంకారంలో యాదాద్రి నృసింహుడు

యాదాద్రి క్షేత్రంలో వైభవంగా తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు


 (ఆంధ్రజ్యోతి- యాదాద్రి/ యాదాద్రిటౌన్‌): ‘వటపత్రశాయికి వరహాల లాలీ, రాజీవనేత్రునికి రతనాల లాలీ’ అంటూ భక్తజనులు జగత్‌ కల్యాణకారకుడు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడిని బాలకృష్ణుడిగా అలంకరించి బాలాలయ మండపంలో సేవించారు. అవతార పురుషుడైన శ్రీమహావిష్ణువు తన శ్రీకృష్ణుడి అవతారంలో ప్రదర్శించిన బాల్యచేష్టల లీలా మహత్యాలను భక్తులకు చూపేలా నారసింహుడిని ఆదివారం వటపత్రసాయిగా ముగ్ధ మనోహర అలంకారంలో పూజించారు. లోక కల్యాణం, విశ్వశాంతి కోసం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు స్వామివారిని వటపత్రసాయిగా చిన్ని కృష్ణుడిగా విశేష అలంకారంలో సేవించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వటపత్రంపై శయనించిన చిన్నికృష్ణుడిని పుష్పాలంకృతమైన పల్లకిలో భక్తుల జయ జయ ద్వానాల మధ్య బాలాలయంలో ఊరేగించారు.


భక్తజనబాంధవుడు యాదాద్రి నృసింహుడే చిన్నికృష్ణుడుగా తలపించే సన్నివేశాన్ని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశం చెందారు. రుత్వికులు, అర్చకులు, వేదపండితులు పారాయణాలు, వేద పఠనాలతో మంగళవాయిద్యాల మధ్య వటపత్రసాయి అలంకార సేవను బాలాలయ ఉత్సవ మండప వేధికపై అధిష్టింప చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆధ్యాత్మిక పర్వాలను యాజ్ఞీకులు ప్రణీతాచార్యులు, దేవస్థాన స్థానాచార్యులు సందుగుల రాఘవాచార్యులు, ప్రధానార్చకులు నల్లన్‌ధిగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చక బృందం, వేదపడింతులు, రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అనువంశిఖ ధర్మకర్త బి నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి, సిబ్బంది అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో ాల్గొన్నారు.


నిత్య హోమం..సామూహిక పారాయణాలు

బ్రహ్మోత్సవ కైంకర్యాలలో భాగంగా ఆదివారం బాలాలయ యాగశాలలో ఉదయం నిత్య హోమ పూజలు నిర్వహించారు. పంచసూక్త, వేద మంత్ర పఠనాలతో హోమం జరిపి నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు. రుత్వికస్వాములు, వేదపండితులు స్వామివారి అలంకార సేవ ముందు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్రజప పఠనాలు చేశారు.


పొన్న వాహనంపై చిలిపి కృష్ణుడి చిద్విలాసం

భక్తపరాయణుడు, జగద్రక్షకుడు శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం అవతరించిన అవతార రూపాల్లో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో దివ్య వాహన సేవలు  అందుకుంటున్నారు. ఆదివారం రాత్రి స్వామి పొన్నవాహన సేవపై బాలాలయ మండపంలో ఊరేగుతూ భక్త జనులకు దర్శనమిచ్చారు. పొన్న చెట్టు నీడలో చిలిపి కృష్ణుడి లీలలు భాగవతంలో పేర్కొన్న రీతిలో ఈ వాహన సేవ  ఆహ్లాదకరంగా  నిర్వహించారు.  


 బ్రహ్మోత్సవాల్లో నేడు

ఉదయం: 4.30 గంటలలకు నిత్య హవన పూజలు

9 గంటలకు వేద పారాయణాలు, మూలమంత్ర జపాలు

10గంటలకు గోవర్ధన గిరిధారిగా లక్ష్మీనృసింహుడి అలంకార సేవోత్సవం

రాత్రి  9 గంటలకు సింహవాహన సేవలో బాలాలయంలో ఊరేగింపు

స్వామి సన్నిధిలో ప్రభాతభేరి కార్యక్రమం

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవైష్ణవ సేవసమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాతభేరి నిర్వహిస్తారు. ఆలయ తిరువీధుల్లో విష్ణుసహస్రనామ, నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ పఠనంతో స్థానిక శ్రీవైష్ణవ స్వాములు స్వామిని కొలుస్తూ బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు ప్రభాతభేరి కార్యక్రమాన్ని బాలాలయం చెంత సంప్రదాయరీతిలో శ్రీవైష్ణవస్వాములు నిర్వహిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో సైడ్‌ లైట్స్‌ 

ఐదో రోజైన ఆదివారం ఉదయం 4.30 గంటలకు నిత్య హోమం నిర్వహించారు.

వటపత్రసాయి అలంకార సేవోత్సవం 25 నిమిషాల ఆలస్యంగా ఆరంభమైంది.

ధార్మిక సాహిత్య సభల ఏర్పాట్లు, వైభవోత్సవ కల్యాణం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.


భక్తజనులకు ఉచిత వైద్య సేవలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన వైద్యశాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్‌ ఎం ఎస్‌ రాంబాబు, డాక్టర్‌ జి శ్రీనివాస్‌,అపోలో ఆసుపత్రి, సాహి సంస్థ హైదరాబాద్‌ వైద్యులు రోగులకు చికిత్సలు అందజేశారు. దేవస్థాన వైధ్యులు డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏఎన్‌ఎం అనురాధ, యాదగిరి, చంద్రమౌళి రోగులకు మందులను ఉచితంగా అందజేశారు.


Updated Date - 2020-03-02T11:49:41+05:30 IST