బొమ్మ ఆడేనా..?!

ABN , First Publish Date - 2020-11-25T05:56:16+05:30 IST

కొవిడ్‌ కారణంగా సుమారు ఎనిమిది నెలల క్రితం మూతపడిన సినిమా థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

బొమ్మ ఆడేనా..?!

థియేటర్లను సిద్ధం చేస్తున్న యాజమాన్యాలు

ఫిలిం చాంబర్‌ సమావేశాల తర్వాతే తేదీ ఖరారు

తొలి రోజు తెరుచుకోని సినిమాహాళ్లు

 (ఆంధ్రజ్యోతి, యాదాద్రి /నల్లగొండ క్రైం, నల్లగొండ కల్చరల్‌: కొవిడ్‌ కారణంగా సుమారు ఎనిమిది నెలల క్రితం మూతపడిన సినిమా థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సినిమాహాళ్లను నడపవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఓవైపు సిబ్బంది నియామకాలు, వెండితెరపై వినోదం పంచేందుకు సిద్ధంగా లేని కొత్త సినిమాలు, కేవలం 50శాతం సీట్ల కెపాసిటీతో థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు రావడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది మార్చి 15వ తేదీ నుంచి మూతపడిన థియేటర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, అసోసియేషన్‌ నిర్ణయాల మేరకు తిరిగి తెరిచినా, కరోనా రెండో దశ వ్యాప్తిచెందుతుందన్న వార్తల నేపథ్యంలో పలు సందేహాల నడుమ యాజమాన్యాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 31 సినిమా థియేటర్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో థియేటర్లను రోజువారీ శుభ్రం చేసే స్వీపర్లు మొదలు ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌ వరకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే సినిమా థియేటర్లను తిరిగి తెరిచేందుకు నిబంధనలకు లోబడి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌-19 నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటిస్తూ థియేటర్‌లో భౌతికదూ రం పాటించేలా 50శాతం మేర మాత్రమే సీట్ల భర్తీకి అనుమతించింది. థియేటర్‌లో 24-30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నిబంధన పాటించాల్సి ఉంటుంది. ఆట ముగిసిన వెంటనే థియేటర్‌లోపల, ఆవరణ, కామన్‌ ఏరియాలను శానిటైజ్‌ చేయాలి. అలాగే థియేటర్ల ప్రవేశ, నిర్గమన మార్గాల (ఎంట్రీ, ఎగ్జిట్‌) వద్ద చేతులు శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్‌ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. సినిమాహాల్‌ ఆవరణలో ప్రేక్షకులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్‌, క్యాంటిన్లలో పనిచేసే సిబ్బంది కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. ఇలా పలు నిబంధనలను ప్రభుత్వం విధించింది.

ప్రేక్షకులు వచ్చేనా?

కరోనా ఉధృతి ప్రస్తుతం తగ్గినా వినోదం కోసం సినిమా థియేటర్లకు రావడం అలవాటు తప్పిన ప్రేక్షకులు వస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మంగళవారం యాదాద్రి జిల్లా కేంద్రంలో థియేటర్లు తెరిచిన యాజమాన్యాలు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఎనిమిది నెలలుగా ఉపాధి లేక చెల్లాచెదురైన సిబ్బంది, కార్మికులను తిరిగి రప్పించేందుకు యజమానులు ప్రయత్నాలు ప్రారంభించారు. కరోనాకు ముందటిలా కొత్త, పెద్దపెద్ద సినిమాలు ప్రదర్శించేందుకు వారు సిద్ధంగా లేదు. దీంతో ప్రేక్షకులను తిరిగి టాకీ్‌సలకు అలవాటు చేసేందుకు ముందుగా చిన్న సినిమాలతో ప్రయత్నాలు చేయాలని యో చిస్తున్నారు. విద్యుత్‌తో పాటు ఇతర ఖర్చులు 50శాతం సీట్ల భర్తీతో నెట్టుకొచ్చే అవకాశం లేకపోవడంతోనే థియోటర్లు ప్రా రంభించలేదని కొందరు నిర్వాహకులు తెలిపారు. 75శాతం సీటింగ్‌కు అనుమతిస్తే థియేటర్లు తెరిచే యోచనలో వారు ఉన్నారు. అయితే ప్రస్తుతం సగం సీట్లతో వ్యయ ప్రయాసల నడుమ సినిమా థియేటర్లను ఎలా, ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై చర్చించేందుకు రెండు, మూడు రోజుల్లో ఫిలిం చాంబర్స్‌ అసోసియేషన్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో నిర్ణయాల మేరకే సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభంకానున్నాయి. డిసెంబర్‌ రెండవ వారంలో థియోటర్లను పున: ప్రారంభించే అవకాశం ఉన్నట్లు పలువురు పేర్కొన్నారు. దీంతో తొలి రోజు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ఎక్కడా థియేటర్లలో సినిమాలు నడవలేదు.

అసోసియేషన్‌ నిర్ణయం మేరకు : తెలుకుంట్ల చంద్రశేఖర్‌, థియేటర్‌ యజమాని, చండూరు

ఫిలించాంబర్‌ అసోసియేషన్‌, థియేటర్ల అసోసియేషన్‌ నిర్ణయం మేరకు ఎప్పుడు ప్రారంభించాలో నిర్ణయం తీసుకుంటాం. కరోనా నిబంధనల మేరకు థియేటర్లలో మార్పులు చేయాల్సి ఉంది. సిబ్బంది కూడా అందుబాటులో లేరు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి ఉంది.


Read more