సాగర్ ఉప ఎన్నికపై బీజేపీ నజర్
ABN , First Publish Date - 2020-12-29T05:46:48+05:30 IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న ఆ పార్టీకి సాగర్‌లో ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతుండటం, ఎవరికి వారుగా ప్రచారం నిర్వహిస్తుండటంతో శ్రేణుల్లో గందరగోళం ఏర్పడటం తలనొప్పిగా మారింది. దీనికి చెక్‌పెట్టి అన్ని పార్టీలకంటే ప్రచారంలో ముందుండి ఫలితం సాధించాలని బీజేపీ చూస్తోంది.
నల్లగొండ,డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న ఆ పార్టీకి సాగర్‌లో ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతుండటం, ఎవరికి వారుగా ప్రచారం నిర్వహిస్తుండటంతో శ్రేణుల్లో గందరగోళం ఏర్పడటం తలనొప్పిగా మారింది. దీనికి చెక్‌పెట్టి అన్ని పార్టీలకంటే ప్రచారంలో ముందుండి ఫలితం సాధించాలని బీజేపీ చూస్తోంది. అందుకు ఉప ఎన్నిక సమన్వయకర్తలుగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చాడా సురే్‌షరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, టీడీపీ, బీజేపీలో సంకినేని అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ఆయన్ను ఉప ఎన్నిక కో-ఆర్డినేటర్‌గా ఖరారు చేశారు. పక్షపాతానికి తావు లేకుండా ఉండేందుకు ప్రతీ ఎన్నికకు పక్క జిల్లాకు చెందిన సీనియర్ నేతను నియమించడం బీజేపీలో ఆనవాయితీ. ఆ క్రమంలోనే చాడా సురే్‌షరెడ్డిని మరో సమన్వయకర్తగా నియమించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు వీరు బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా, సాగర్ నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్న కంకణాల దంపతులు, కడారి అంజయ్య యాదవ్ ఎవరికి వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో పార్టీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, ఇరువురు ఆశావహులను సమన్వయం చేసి అంతిమంగా బీజేపీని గెలిపించేలా ప్రచారం చేయడంతోపాటు, పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని తొలగించడం సమన్వయకర్తల ముందున్న సవాల్. ప్రస్తుతం పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. పోటీ చేసేందుకు ఇద్దరు ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. అభ్యర్థి ఎవరనేది ఇప్పట్లో తేలే పరిస్థితి లేదు. ఆశావహుల సమన్వయం, పార్టీని బూత్ వారీగా బలోపేతం చేయడం సమన్వయకర్తల లక్ష్యం. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో లాగా సాగర్‌లోనూ గెలుపొందాలనేది బీజేపీ లక్ష్యం. కాంగ్రెస్‌లో 19 మంది గెలిస్తే 13 మంది పార్టీ మారారని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒకే గూటి పక్షులంటూ బీజేపీ ప్రచారం చేయనుంది. రాష్ట్రం కోసం బలిదానం చేసిన కుటుంబాలను టీఆర్‌ఎస్ పట్టించుకోకపోవడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వంటి అంశాలను బీజేపీ ప్రధాన ఎజెండాగా తీసుకోనుంది. అంతేగాక గ్రేటర్ ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను దూరంగా పెట్టడాన్ని కూడా ఆ వర్గాల్లో బలంగా తీసుకెళ్లాలని బీజేపీ చూస్తోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ అనుమతించడంతో ఆ రెండు పార్టీలు ఒక్కటే అని మహాకూటమి బలంగా ప్రచారం చేసింది. దీంతో బీజేపీకి సంప్రదాయంగా ఉన్న ఓట్లు కూడా ఆ ఎన్నికల్లో పోల్‌కాలేదు. ఆ తరువాత పరిణామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరడం, బీజేపీ నుంచి గెలిచిన, ఓడిన అభ్యర్థులు పార్టీతోనే ఉండటం, ఇటీవలి ఎన్నికల ఫలితాలు కలిసివచ్చాయి. సాగర్‌లోనూ ఆ వాతావరణం ఉంటుందని కాషాయదళం ప్రచారం చేయాలని నిర్ణయించింది. అందుకు ఇద్దరు ఆశావహులు కలిసి పనిచేయాలని సమన్వయకర్తలు ఉద్బోధించనున్నారు.
సాగర్ బరిలో ఎంఎస్పీ
మందకృష్ణ పిలుపుతో శ్రేణుల్లో ఉత్సాహం
త్రిపురారం: సాగర్ ఉప ఎన్నికల బరిలో దిగేందుకు మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్పీ) సన్నాహాలు చేస్తోంది. ఇటీవల హాలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, సాగర్‌లో అభ్యర్థిని నిలబెట్టి సత్తా చాటుతామని ప్రకటించారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని, సాగర్ ఉప ఎన్నిక తమ బలానికి గీటురాయిగా మారుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో గిరిజన సామాజికవర్గం తరువాత ఎస్సీ ఓట్లు అధికంగా ఉండటంతో, కలిసివస్తుందని నేతలు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో సాగర్ బరిలో నిలిచిన ఎంఎస్పీ అభ్యర్థి నాలుగో స్థానం సాధించారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున స్వయంగా ప్రచారం చేస్తానని మందకృష్ణ చెప్పడంతో ప్రధాన పార్టీల ఓట్లపై ప్రభావం చూపనుంది.