బీజేపీలో జోష్‌

ABN , First Publish Date - 2020-12-05T05:54:16+05:30 IST

నిన్న దుబ్బాక, నేడు బల్దియా ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో నూతనోత్సాహాన్ని నింపాయి.

బీజేపీలో జోష్‌
హాలియాలో విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్న బీజేపీ నేతలు

ఉత్సాహాన్నిచ్చిన బల్దియా ఫలితాలు 

పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా

ఇన్‌చార్జి డివిజన్లు అన్నింటిలో ఓటమి, టీఆర్‌ఎ్‌సలో నైరాశ్యం

ఎమ్మెల్సీ, సాగర్‌ ఉప ఎన్నికలపై ప్రభావం

జానా తనయుడు రఘువీర్‌కు బీజేపీ ఆహ్వానం

నల్లగొండ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిన్న దుబ్బాక, నేడు బల్దియా ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో నూతనోత్సాహాన్ని నింపాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ, అంచనాలకు మించి అత్యధిక స్థానాలు గెలవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కేడర్‌ అంతా సంబురాలు చేసుకుంటోంది. త్వరలో జరగబోయే నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికపై ఈ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తుండడంతో అందరి చూపు అటువైపే పడింది. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా చేయడం, జిల్లా ఎమ్మెల్యేలు ఇన్‌చార్జిలుగా ఉన్న గ్రేటర్‌లో దాదాపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరూ ఓటమి చెందడంతో ఇటు కాంగ్రెస్‌, అటు టీఆర్‌ఎస్‌ నేతలు  నైరాశ్యంలోకి వెళ్లారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాట డంతో కమలనాథుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోం ది. ఈ ఫలితాలు సమీపంలో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాపై వెనువెంటనే తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పీసీసీ అధ్యక్ష పీఠానికి ఉత్తమ్‌ రాజీనామా సమర్పించగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 10మంది ఎమ్మెల్యేలు ఇన్‌చార్జిలుగా ఉన్న అన్ని డివిజన్ల లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అంతా ఓటమి పాలుకావడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు ఇన్‌ఛార్జిగా ఉన్న డివిజన్‌లోనే అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఈ ఫలితాలు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, సాగర్‌ ఉప ఎన్నికల్లో కొత్త ఊపునివ్వడం ఖాయమని కమలనాథులు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 


సాగర్‌ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్‌ 

ఉమ్మడి నల్లగొండ జిల్లావాసులు నివసించే ఎల్‌బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లోని 13 డివిజన్లలో మొత్తానికి మొత్తంగా కాషాయం జెం డా ఎగరడంతో ఆపార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో బాంబులు కాల్చి విజయోత్సవ సంబురాలు నిర్వహించి సంకేతాలు వదిలారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.  ‘మొదటి స్థానంలోకి రావాలి అంటే ముందుగా రెండో స్థానంలోకి రావాలి, 3, 4 స్థానాల్లో ఉంటే మన లక్ష్యాన్ని సాధించలేం’ అంటూ రెండేళ్ల క్రితం అమిత్‌ షా రాష్ట్ర, జిల్లా నేతలకు ఉద్బోఽధ చేశారు. ఇప్పుడు ఆ దిశగా ఉమ్మడి జిల్లాలో అడుగులు వేయాలని భావిస్తోంది. ముందుగా కాంగ్రె్‌సను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి రావాలి. అది ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలే వేదిక కావాలని ఆపార్టీ నేతలు లెక్కల్లో ఉన్నారు. గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ద్వారా జానా తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ‘నాన్నగారు ఈనెల 7న కేరళ నుంచి వస్తారు, వారు వచ్చాకే నిర్ణయం జరుగుతుందని’ యువనేత సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. మాస్‌ ఎన్నికల్లోనే ఘన విజయం సాధించాం, ఆలోచనపరులైన ఓటర్లు ఉండే పట్టభుద్రల ఎన్నికల్లో కష్టపడితే విజయం ఖాయమన్న ధీమాల్లో కాషాయం నేతలు ఉన్నారు. ముందు రోజుల్లో ఈ ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపడం ఖాయమంటున్నారు. 


టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ రాజీనామా 

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యం లో తన పదవికి రాజీనామా చేస్తున్నానని, కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ను చేపట్టాలంటూ నల్లగొడ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధిష్ఠానానికి లేఖరాశారు. హు జూర్‌నగర్‌, దుబ్బాక ఉప ఎన్నికలు, తాజా గా గ్రేటర్‌ ఫలితాల్లో ఓటమితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌లో కనీసం 15 స్థానాలు వస్తాయని, ఆ తరువాత సాగర్‌ ఉపఎన్నికతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరి పోయవచ్చన్న అంచనాలో ఉండగా ఊహించని ఫలితంతో ఉత్తమ్‌ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 


జీహెచ్‌ఎంసీలో విజేతలుగా మన నేతలు 

గ్రేటర్‌ హైద రాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్ని కల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేత లు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రా మానికి చెందిన దూసరి లావణ్య శ్రీనివా్‌సగౌడ్‌ గోల్నా కా డివిజన్‌ కార్పోరేటర్‌గా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదేవిధంగా బేగంపేటకు చెందిన రషీదాబేగం చింతల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా టీఆర్‌ఎ్‌స నుంచి గెలుపొందారు. వలిగొండ పట్టణానికి చెందిన అయిటిపాముల విఠల్‌ కుమార్తె శాంతి సాయిజెన్‌ శేఖర్‌ కార్పొరేటర్‌గా గెలుపొందారు. నాచారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. వీరి ఎన్నికతో ఆయా గ్రామాల్లో విజయోత్సవాలను నిర్వహించారు. కాగా పలు కారణాలతో నాగారం మండల కేంద్రానికి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి గెలుపు వాయిదా పడింది. 

Updated Date - 2020-12-05T05:54:16+05:30 IST