లక్ష్యానికి బహుదూరం

ABN , First Publish Date - 2020-12-03T06:17:18+05:30 IST

ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా, భారీ వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. ధాన్యం సేకరణ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, లక్ష్యానికి మాత్రం దూరంగానే ఉంది.

లక్ష్యానికి బహుదూరం
భువనగిరి శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రం

అంచనాల కంటే తగ్గిన దిగుబడి

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ఆపసోపాలు 

జిల్లాలో కొనుగోళ్ల లక్ష్యం 3.65 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటివరకు 1.41 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ 

మిల్లర్ల కొర్రీలు, ఆన్‌లైన్‌ నమోదులో జాప్యం

రైతులకు చెల్లింపుల ఆలస్యం

యాదాద్రి, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా, భారీ వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. ధాన్యం సేకరణ ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, లక్ష్యానికి మాత్రం దూరంగానే ఉంది. ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం ప్రకారం జిల్లాలో 3.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ఐకేపీ, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా కేంద్రాలు ఏర్పాటుచేశారు. దాదాపు 90శాతానికి పైగా వరికోతలు పూర్తయినా నిర్ణీత లక్ష్యంలో ధాన్యం సేకరణ సగానికి కూడా చేరుకోలేదు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖరీఫ్‌ దిగుబడికి అనుగుణంగా చివరి ధాన్యం బస్తావరకు  కొనుగోలు చేయడానికి అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. అందుకనుగుణంగా దిగుబడి గల ప్రాంతాల్లో రైతులకు  అందుబాటులో ధాన్యం కొనుగోళ్లు ఏర్పాటుచేశారు. అయితే వరికోతలు ముమ్మరంగా సాగుతుండటం, అందుబాటులో కేంద్రాలు ఉండటంతో రైతులు నేరుగా తమ ధాన్యాన్ని తరలించి విక్రయించుకుంటున్నారు. అయితే రైతులు విక్రయించుకున్న ధాన్యానికి 48 గంటల్లో బ్యాంకు  ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో రైస్‌ మిల్లర్ల కొర్రీలు, ఆన్‌లైన్‌లో జాప్యంవంటి సమస్యల కారణంగా చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందనే విమర్శలున్నాయి. 


సాధారణ విస్తీర్ణానికి అధిగమించి సాగు 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో చెరువులు, కుంటలతోపాటు భూగర్భజలాలు  అందుబాటులోకి రావడంతో సాధారణ విస్తీర్ణానికి అధిగమించి వరి సాగు చేశారు. జిల్లాలో భూగర్భజలాలపై ఆధారపడిన బోరుబావుల కింద తక్కువగా సాగు జరిగినప్పటికీ, మూసీ పరివాహక ప్రాంతాల్లో లక్ష్యాన్ని అధిగమించి పంటను సాగుచేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా, వ్యవసాయ అధికారుల దిగుబడి అంచనాల ప్రకారం ఈఏడాది ఖరీ్‌ఫలో జిల్లాలో దాదాపు 3.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలి. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని పీఏసీఎస్‌, ఐకేపీ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి అధికారుల సమక్షంలో కొనుగోలు చేస్తున్నారు.

 

జిల్లాలో 267 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులకు అందుబాటులో ఉండేలా 267 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇందిరాక్రాంతి పఽథం (ఐకేపీ) ఆధ్వర్యంలో 98, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎ్‌స)ల ద్వారా 165,  వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ద్వారా 4 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో ఈఏడాది 3.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికిగాను ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1.46లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిపారు. అయితే ఈఏడాది వరికోతలకు వచ్చిన దశలో భారీవర్షాల కారణంగా పంట నీటమునిగింది. కొన్నిచోట్ల పైరు నేలకొరిగి తీవ్ర పంటనష్టం వాటిల్లింది. కల్లాల వద్ద తడిసి రంగుమారింది. దీంతో రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు నిరాకరించడంతో మూసీ పరివాహక మండలాల్లో కొనుగోళ్లు మందగించాయి. అదేవిధంగా భూగర్భజలాలపై ఆధారపడి సాగుచేసే మూసీయేతర ప్రాంతాల్లో నియంత్రిత సాగులో భాగంగా సన్నధాన్యం సాగుచేశారు. అయితే సన్నధాన్యం కొనుగోళ్లకు సైతం మిల్లర్లు ముందుకు రాకపోవడం, కనీస మద్దతు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఆమేరకు నిర్ణయం తీసుకోకపోవడంతో ధాన్యం సేకరణలో జాప్యం జరిగింది. దీంతో జిల్లా యంత్రాంతం ఆశించిన లక్ష్యంమేరకు ధాన్యం సేకరణ ఘణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.


తేమ, నాణ్యత పేరిట మిల్లర్ల అక్రమ కోతలు

రైతులు పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు విక్రయించుకోకుండా, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టింది. ఏ-గ్రేడ్‌ క్వింటాల్‌ ధాన్యానికి రూ.1888 కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాల్లో తేమ, నాణ్యతను పరిశీలించిన తర్వాత  రైతులనుంచి ధాన్యం తూకంవేసి మిల్లులకు చేరవేస్తున్నారు. అయితే మిల్లుల వద్ద సేకరించిన ధాన్యం దిగుమతి చేసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తూ అదనంగా ధాన్యం కోతలు విధిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉంది, నాణ్యత లేక నూక శాతం పెరుగుతుందంటూ మరో 5శాతం నుంచి 10శాతం తూకంలో కోతలు విధిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే మిల్లర్లు లారీల్లోని ధాన్యం తిప్పి పంపిస్తామని బెదిరిస్తుండటంతో వారి చెప్పినట్లు కోతలకు అంగీకరించక తప్పడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


చెల్లింపుల్లో తీవ్ర జాప్యం

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో చెల్లింపుల్లో సైతం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందుకు కొనుగోలుకేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుల్లో దిగుమతి చేసుకున్న తర్వాతే నిర్వాహకులు, రైతుల వివరాలను చెల్లింపులకోసం పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. మిల్లుల వద్ద కోతలు, ఖరారుకు జాప్యంతోపాటు నమోదు చేయడంలో సిబ్బంది చేస్తున్న ఆలస్యం కారణంగానే చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుంది. దీంతో మొత్తంగా రైతులకు ధాన్యం తూకం వేసిన తర్వాత నగదు బ్యాంకు ఖాతాలో జమ కావడానికి పదిహేను రోజులు పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు 21,065 మంది రైతుల నుంచి 1,46,266 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రూ.266 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు 17,459 మంది రైతులకు రూ.179కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా రైతులకు దాదాపు రూ.87కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 


నిధుల కొరత లేదు: అధికార యంత్రాంగం

ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెల్లింపులకు ఎలాంటి నిధుల కొరత లేదని, కొనుగోళ్ల వివరాల నమోదులో క్షేత్రస్థాయిలో జాప్యం కారణంగానే కొంతమేర ఆలస్యం జరుగుతుందని, రైతులందరికీ వెంటవెంటనే చెల్లించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంటోంది.

Updated Date - 2020-12-03T06:17:18+05:30 IST