బాధితురాలికి బాసటగా..

ABN , First Publish Date - 2020-11-26T06:29:18+05:30 IST

అత్యాచార ఆక్రందనలు బాధిత మహిళలను జీవితాంతం వెంటాడుతుంటాయి. తమ తప్పు, ప్రమేయం లేకుండానే జరిగిన దుస్సంఘటనలతో బాధిత మహిళలు కుటుంబంలో, సమాజంలో చులకనకు గురవుతుండడం పరిపాటిగా మారింది.

బాధితురాలికి బాసటగా..

ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా కామాంధుల  వంచనకు గురైన 585మంది బాలికలు, మహిళలు

ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం

భువనగిరి టౌన్‌, నవంబరు 25 : అత్యాచార ఆక్రందనలు బాధిత మహిళలను జీవితాంతం వెంటాడుతుంటాయి. తమ తప్పు, ప్రమేయం లేకుండానే జరిగిన దుస్సంఘటనలతో బాధిత మహిళలు కుటుంబంలో, సమాజంలో చులకనకు గురవుతుండడం పరిపాటిగా మారింది. దీంతో వారు మరింత వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వంఛనకు గురైన మహిళలు, బాధిత కుటుంబాల్లో కొంతమేర భరోసా నింపేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 585మందికి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ప్రారంభమైంది.   

రికార్డుల్లోకి నమోదు కానివి ఎన్నో

ప్రభుత్వ రికార్డుల ప్రకారం మూడేళ్లుగా  ఉమ్మడి జిల్లాలో అత్యాచారాలు, హత్యకు గురైన బాధిత మహిళలు 585మంది ఉన్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 380, సూర్యాపేట జిల్లాలో 123 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 82 మంది ఉన్నారు. వారిలో 10 మందికి పైగా హత్యకు గురాయ్యరు. అయితే రికార్డులకెక్కని సంఘటనలు మరెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. గుర్తించిన బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

ఆర్థిక సాయం ఇలా

ఆర్థిక సాయం చెల్లింపునకు వయస్సు ఆధారంగా రెండు కేటగిరీలుగా పరిగణిస్తారు. 18ఏళ్ల లోపు బాధితులను బాలికలుగా, ఆపై వయస్సు కలిగిన వారిని మహిళలుగా పరిగణిస్తారు. బాలికలకు రూ.లక్ష, మహిళలకు రూ.50వేలు, అట్రాసిటీ మహిళలకు అదన పు పరిహారం చెల్లిస్తారు. అదేవిధంగా న్యాయస్థానాల ఆదేశాల మేరకు మరింత సాయం అందుతుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ జీవో 28ప్రకారం అత్యాచారానికి గురైన బాలికల ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే రూ.25వేలు, కోర్టులో పోలీసులు ఛార్జిషీట్‌ వేశాక రూ.25వేలు, న్యాయస్థానంలో కేసు ముగిశాక రూ.50వేలు బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తారు. అలాగే మహిళలపై జరిగే అత్యాచార ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగానే రూ.12500, చార్జిషీట్‌ వేశాక రూ.12500, కేసు ముగిశాక రూ.25వేలు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన బాధితురాలికి కోర్టులో కేసు నిర్ధారణ అయితే ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.8 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే అత్యాచారానికి గురై హత్యకు గురికాబడిన అన్ని వర్గాలకు చెందిన బాధితురాలి కుటుంబాలకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆదేశం మేరకు రూ.5లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఈ ఉదంతంలో నిందితుల ఆస్తులు స్వాధీనం చేసుకొని విక్రయించడంతో వచ్చే సొమ్ము నుంచి పరిహారాన్ని అందిస్తారు. నిందితులకు ఆస్తిలేని పక్షంలో ప్రభుత్వమే ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. 

ఇప్పటివరకు  585మంది

ఉమ్మడి జిల్లాలో 2017, 2018, 2019 సంవత్సరాల్లో 585మంది బాధితులు అత్యాచారానికి గురి కాగా వారిలో 10మందికి పైగా హత్యకు గురయ్యారు. ఈమేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు 38మందికి, నల్లగొండ జిల్లాలో 40మంది బాధితులకు ఆర్థిక సాయం అందించగా సూర్యాపేట జిల్లాలో ప్రారంభ దశలో ఉన్నది. 

మాకు ఆర్థిక సాయం కాదు న్యాయం కావాలి

 బాధితురాలు

మా ప్రమేయం లేకుండానే మేము జీవితాంతం శిక్షకు గురికావాల్సి వస్తోంది. ఆ క్షణాలు మా వ్యక్తిగత, కుటుంబ ప్రతిష్టతను దిగజార్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం మాకు మరింత వేదనకు గురి చేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం పట్ల పలువురు మమ్మల్ని మరింత చులకనగా చూస్తున్నారు. మాకు కావాల్సింది ఆర్థిక సాయం కాదు. మా జీవితాలను ప్రశ్నార్థకం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. నింఽధితులకు శిక్ష పడినప్పుడే మాకు నిజమైన న్యాయం.  


Updated Date - 2020-11-26T06:29:18+05:30 IST