కరోనాకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
ABN , First Publish Date - 2020-08-16T10:14:25+05:30 IST
‘తెలంగాణ రాష్ట్రం సాధించాక ఏడోమారు స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.. ప్రస్తుతం

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో త్వరలో విద్యుత్ ఉత్పత్తి
రైతుబంధు ద్వారా రూ.608కోట్లు పంపిణీ
రూ.1100కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
స్వాతంత్య్ర దినోత్సవంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘తెలంగాణ రాష్ట్రం సాధించాక ఏడోమారు స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.. ప్రస్తుతం మనముందున్న సవాల్ కరోనా మహమ్మారి.. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. అందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, మునిసిపల్, పారిశుధ్య సిబ్బందిని అభినందిస్తున్నా’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా శనివారం కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల ద్వారా జిల్లాకు ఏ మేరకు లబ్ధి జరిగిందో వివరించారు.
రూ.30వేల కోట్ల వ్యయంతో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి ఆలా్ట్ర మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నామన్నారు. రైతుబంధు పథకం కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 4.55లక్షల మంది రైతులకు ఎకరానికి 5వేల చొప్పున రూ.608కోట్లు పంట పెట్టుబడి పంపిణీ చేశామని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1041మంది రైతులు మృతిచెందగా, 919మంది రైతుల కుటుంబసభ్యుల ఖాతాలో రూ.45.95కోట్లు బీమా సొమ్ము జమచేశామన్నారు. రైతుకు మద్దతు ధర చెల్లించేందుకు 275 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రబీ సీజన్‌లో 6.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అతి తక్కువ సమయంలో ఖరీదు చేసి, రూ.1100కోట్లు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు 2,467గృహాలు పూర్తి చేయగా, మరో 834 పురోగతిలో ఉన్నాయన్నారు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం జలాలతోపాటు డిండి ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. శ్రీరాంసాగర్ రెండో దశ ద్వారా 2.50 లక్షల ఎకరాలకు ఇప్పటికే గోదావరి జలాలు ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథలో భాగంగా నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, ఉదయసముద్రం, అక్కంపల్లి జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా రూ.2.226కోట్లతో 1,117 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాకు రెండు జాతీయ రహదారులు మంజూరయ్యాయన్నారు. ఎన్‌హెచ్-167 కోదాడ-జడ్చర్ల వరకు 267కిలోమీటర్లు, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, కల్వకుర్తి మీదుగా వెళ్తోందన్నారు. ఎన్‌హెచ్-565 మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రవేశించి నాగార్జునసాగర్ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా వరకు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ.రంగనాథ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కరరావు, నోముల నర్సింహయ్య, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.