పక్కా స్కెచ్‌తో బ్యాంకు చోరీ.. శ్మశానం పక్కన, రాళ్ల కుప్పల్లో లక్షలకు లక్షలు దాచారు.. కానీ..
ABN , First Publish Date - 2020-11-27T21:34:02+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నడికుడి ఎస్‌బీఐ శాఖలో రూ.85లక్షలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అక్కడి పోలీసులు గురువారం నల్లగొండ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన కేదారి వినయ్‌రామ పాత ఇనుప సామాగ్రి వ్యాపారం చేస్తుండగా

బాబాయ్... అబ్బాయ్ బ్యాంకును దోచారు
సీసీ కెమెరా ఫుటేజి పట్టించింది
ఏపీలో బ్యాంకు చోరీ కేసులో పురోగతి
ఈ నెల 21వ తేదీన ఘటన
నిందితులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడవాసులు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మిర్యాలగూడ అర్బన్ (నల్లగొండ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నడికుడి ఎస్‌బీఐ శాఖలో రూ.85లక్షలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అక్కడి పోలీసులు గురువారం నల్లగొండ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన కేదారి వినయ్‌రామ పాత ఇనుప సామాగ్రి వ్యాపారం చేస్తుండగా, ఇదేకాలనీకి చెందిన కేదారి ప్రసాద్ ఓ టీస్టాల్‌లో బాయ్‌గా పనిచేస్తున్నాడు. వరుసకు బాబా య్ అబ్బాయ్‌లైన వీరిద్దరూ గతంలో ఏపీ రాష్ట్రంలో పలు ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
బ్యాంకు పరిసర ప్రాంతాల్లో రెక్కీ
దాచేపల్లి మండలంలో కొంతకాలంగా పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తున్న వినయ్‌రామ నడికుడిలోని ఎస్‌బీఐ శాఖలో దొంగతనానికి ప్రణాళిక రూపొందించుకున్నాడు. కొన్ని రోజులు ప్రసాద్‌తో కలిసి బ్యాంకు పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన బ్యాంకుకు అధిక మొత్తంలో నగదు వచ్చిందని తెలుసుకుని అదేరోజు రాత్రి చిన్న గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్‌తో బ్యాంకు తాళాలను తొలగించి లాకర్ గదిలోని ఓ పెట్టెలో ఉన్న రూ.85లక్షలు దొంగిలించారు.
ఆధారాలు లేకుండా పక్కా వ్యూహం
తాళాలు వేసిన ఇళ్లలో చేరీలకు పాల్పడ్డ సందర్బాల్లో వేలిముద్రలు, సీసీ కెమెరా పుటేజీలు, డాగ్ స్క్వాడ్ ఆధారాలతో పోలీసులకు చిక్కిన వీరు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పక్కా వ్యూహంతో వ్యవహరించారని పోలీసులు నిర్ధారించారు. బ్యాంకు తాళాలను, లాకర్‌ను తొలగించే సమయంలో వేలిముద్రలు పడకుండా గ్లౌజులు ధరించారు. డాగ్‌స్క్వాడ్ పసిగట్టకుండా ఉండేందుకు బ్యాంకులో కారంపొడి చల్లారు. బ్యాంకులో అలారం మోగకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సీసీ కెమెరాలో ఫుటేజీ నమోదు కాకుండా కేబుల్‌ను కట్ చేశారు.
దోచారు.. దాచారు
నడికుడి బ్యాంకులో చోరీ చేసిన రూ.85లక్షల నగదులో రూ. 45లక్షలు దాచేపల్లి మండల కేంద్రంలోని సుబ్బమ్మ హోటల్ సమీపంలోని శ్మశాన వాటిక గోడపక్కన గోతిలో దాచిపెట్టారు. అనంతరం మిర్యాలగూడకు ఓ లారీలో వచ్చారు. మిగిలిన సొమ్మును ఇద్దరూ ఇళ్లలో దాచిపెట్టారు. గురువారం తెల్లవారుజామున నిందితుల ఇళ్లను సోదా చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. వినయ్‌రామ తన ఇంట్లో రూ. 16లక్షలు, ప్రసాద్ ఇంటి ఎదురుగా ఉన్న బండరాళ్లకుప్పలో రూ. 15.70లక్షల నోట్లకట్టలను పోలీసులు గుర్తించారు. మిగిలిన నగదును నిందితులు ఏం చేశారన్నది తెలియాల్సి ఉంది.
పట్టించిన సీసీ ఫుటేజి
నిందితులిద్దరూ పక్కా వ్యూహంతో వ్యవహరించినా బ్యాంకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు బ్యాంకులో చీటీపై రాసిఉన్న ఫోన్ నెంబరు ఆధారంగా పోలీసులు పలువురిని విచారించారు. దాచేపల్లిలోని సుబ్బమ్మహోటల్ సమీపంలోని శ్మశానవాటిక సమీపంలో నిందితులు ఉపయోగించిన గ్యాస్ కట్టర్‌ను పోలీసులు గుర్తించారు. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసుల సహకారంతో గురువారం తెల్లవారుజామున నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.