బీజేపీలోకి జానారెడ్డి చేరిక వార్తలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-05T23:16:54+05:30 IST
గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి...

గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం కావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ హస్తవాసి మారకపోవడంతో తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు బీజేపీనే బలమైన ప్రత్యర్థి పార్టీగా ప్రజలు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దుబ్బాకలో గెలిచి అధికార టీఆర్ఎస్కు షాకిచ్చిన కమలం పార్టీ.. గ్రేటర్ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చి కారును బేజారు చేసింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో మంచి జోష్‌లో ఉన్న తెలంగాణ బీజేపీ వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యూహప్రతివ్యూహాలకు అప్పుడే పదును పెడుతోంది. అందులో భాగంగా.. వలసలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ నుంచి గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న నేతలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. నాగార్జునసాగర్ నుంచే అందుకు శ్రీకారం చుట్టింది.
నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్న జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే.. గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ద్వారా జానా తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ‘నాన్నగారు ఈనెల 7న కేరళ నుంచి వస్తారు, వారు వచ్చాకే నిర్ణయం జరుగుతుందని’ యువనేత సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. జానారెడ్డి బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. జానారెడ్డి నుంచి ఫోన్‌కాల్ రాలేదని.. అయితే, జానారెడ్డి, ఆయన తనయుడు వేర్వేరు కాదని జానా చేరికపై బండి సంజయ్ పరోక్ష సంకేతాలిచ్చారు. జానారెడ్డి బీజేపీలో చేరితే.. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు.