స్వచ్ఛందంగా బంద్‌

ABN , First Publish Date - 2020-07-28T10:32:24+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను ఆ తరువాత సడలిస్తూ వచ్చాయి.

స్వచ్ఛందంగా బంద్‌

లాక్‌డౌన్‌కు ముందుకువస్తున్న వ్యాపారులు

నల్లగొండలో 30 నుంచి..

భువనగిరిలో ఆగస్టు 14 వరకు

ఇప్పటికే పలు ప్రాంతాల్లో అమలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ను ఆ తరువాత సడలిస్తూ వచ్చాయి. దీంతో వ్యాపార సంస్థలు తెరుచుకోవడంతోపాటు రవాణా వ్యవస్థ మెరుగుపడి జనం రోడ్లపైకి రావడం ప్రారంభమైంది. వలస కార్మికులు పట్టణాల నుంచి పల్లెబాట పట్టారు. ఫలితంగా ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. అప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన కరోనా, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరగడమేగాక, మరణాలూ చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో ప్రజల్లో భయాందోళనలు మొదలై జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభమైంది. వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు నిర్ణయించడమేగాక కచ్చితంగా పాటిస్తున్నారు. మాస్కులు ధరించి వస్తేనే సరుకులు ఇస్తున్నారు. క్యాష్‌ కౌంటర్ల వద్ద ట్రాన్స్‌పరెంట్‌ షీట్లను అడ్డుగా ఏర్పాటు చేసుకున్నారు. డబ్బులకు బదులు ఎక్కువగా ఆన్‌లైన్‌ లావాదేవీలకే వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు డబ్బులను కూడా యంత్రాల ద్వారా శానిటైజ్‌ చేస్తున్నారు. కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ నిబంధన ఉల్లంఘిస్తున్న వ్యాపారులకు మునిసిపాలిటీ, పంచాయతీ సిబ్బంది జరిమానాలు విధిస్తున్నారు. ప్రభుత్వ కార్యాల యాల్లో సైతం పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.


హుజూర్‌నగర్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 30కేసులు నమోదు కాగా, స్థానిక ఏరియా ఆస్పత్రిలో నిత్యం 40 వరకు నిర్వహిస్తున్న రాపిడ్‌ టెస్టుల్లో సగం మందికి పాజిటివ్‌ నమోదవుతోంది. దీంతో పట్టణంలో పకడ్బందీగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు. దీన్ని ఉల్లంఘించిన వ్యాపారులకు మునిసిపల్‌ అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.40వేలు జరిమానా వసూలు చేశారు. 


పకడ్బందీగా లాక్‌డౌన్‌

దేవరకొండ డివిజన్‌లో ఇప్పటి వరకు 100కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పట్టణంతోపాటు, చింతపల్లి, పీఏపల్లి, డిండి మండలా ల్లో అత్యధిక కేసులు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఈ ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. దేవరకొండలో కిరాణా జనరల్‌, క్లా త్‌, చికెన్‌ సెంటర్లు ఈనెల 20 నుంచే లాక్‌డౌన్‌ పాటిస్తున్నాయి. ఆగస్టు 2వరకు దుకాణాలు మూసివేయాలని కిరాణా అసోసియేషన్‌ నేతలు నిర్ణయించారు. కొండమల్లేపల్లి, చింతపల్లి, వీటీనగర్‌లో సైతం మధ్యా హ్నం 12గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. పీఏపల్లిలో లాక్‌డౌన్‌ నిబంధన ఉల్లంఘించిన ఓ వస్త్ర వ్యాపారికి పంచాయతీ సిబ్బంది రూ.1000 జరిమానా విధించారు. మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 20 నుంచే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలవుతోంది. పట్టణ పరిధి లో వారం రోజుల్లో 160కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో నిత్యావసర సరుకులు, పాల ఉత్పత్తుల దుకాణాలను మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మధ్యాహ్నం 12గంటల తరువాత మూసివేస్తున్నారు. కిరాణా దుకాణాలు సైతం మంగళ, బుధవారాలు పూర్తిగా మూసివేసేందుకు అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. పండ్ల దుకాణాలు సైతం ఒక్క పూటే తెరిచి ఉంచుతున్నారు.


స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశగా

యాదాద్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలవుతుండగా, భువనగిరి పట్టణంలో ఆ దిశగా వ్యాపారులు ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో వారం రోజులుగా పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వర్తక సంఘాలు వ్యాపార వేళలను కుదించుకున్నాయి. భువనగిరి పట్టణంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎ.ఆంజనేయులు ఆధ్వర్యంలో పలు వర్తక సంఘాల నాయకులు సమావేశమై ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే దుకాణాలు తెరవాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో ఇది అమలుకానుంది. చౌటుప్పల్‌, మోత్కూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు ఆగస్టు 14 వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా ఆలేరులో ఎరువుల దుకాణదారులు మధ్యాహ్నం 2గంటల వరకే తెరిచేందుకు నిర్ణయించారు.


మారిన వ్యాపార వేళలు

కరోనా విజృభిస్తుండటంతో వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల సమయం మారింది. కోదాడ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఉదయం 7గం టల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. ఆ తరువాత అన్ని వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. దీన్ని మునిసిపల్‌ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. చౌటుప్పల్‌లో సాధారణ రోజుల్లో రాత్రి 10గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక కిరాణ అసోసియేషన్‌ నిర్ణయం మేరకు సాయంత్రం 5గంటలకే దుకాణాలు మూసివేస్తున్నారు. వస్త్ర వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు సైతం పనిగంటలు తగ్గించుకునే యోచనలో ఉన్నారు. చిట్యాల పట్టణంలో ఈనెల 20నుంచే మధ్యాహ్నం 2గంటల తరువాత స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. మందులు, రైతు సంబంధిత దుకాణాలు తప్ప అన్నీ మూతపడుతున్నాయి. ఈనెల 17న నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో ఇక్కడి వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు నిర్ణయించారు. నిబంధన ఉల్లంఘిస్తే మునిసిపల్‌ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల తరువాత జనసంచారం లేక పట్టణంలోని రోడ్లు వెలవెలబోతున్నాయి.


ప్రభుత్వ కార్యాలయాల్లో పలు జాగ్రత్తలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కార్యాలయాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి థర్మల్‌స్కానింగ్‌ చేస్తున్నారు. ఫిర్యాదులను కిటికీల నుంచి తీసుకోవడం, లేదా కార్యాలయం బయట ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసేలా ఉద్యోగులు ఏర్పాట్లు చేశారు. నేరేడుచర్ల పోలీ్‌సస్టేషన్‌లో ఇటీవల ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా పట్టణంలో రోజుకో కేసు వెలుగు చూస్తోంది. దీంతో పోలీ్‌సస్టేషన్‌ ప్రధాన ద్వారం వద్ద ఉన్న గ్రిల్స్‌ నుంచే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలోనికి సైతం ఎవరినీ అనుమతించడం లేదు. కార్యాలయం బయట ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు చేశారు.


నల్లగొండలో ముందుకొచ్చిన వ్యాపారులు

నల్లగొండ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండటం తో స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు వ్యాపారులు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో వ్యాపారులు సోమవారం సమావేశమై ఈనెల 30 నుంచి ఆగస్టు 14వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కు ఏకగ్రీవంగా తీర్మానించారు. అత్యవసరాలు మినహా అన్ని వ్యాపార సంస్థలు మూసివేయనున్నారు. కూరగాయలు, ఆన్‌లైన్‌ తరగతులు నడుస్తున్నందున మొబైల్‌ దుకాణాలు మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచనున్నారు.


ప్రజారోగ్యం దృష్ట్యా నిర్ణయం

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా చిట్యాలలో మధ్యాహ్నం 2గంటల తరువాత దుకాణాలు మూసివేసేందుకు నిర్ణయించాం. అందుకు వ్యాపారులు, ప్రజలు సహకరిస్తున్నారు. స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిబంధనను ఉల్లంఘించి ఎవరు దుకాణాలు తెరచి ఉంచినా రూ.2వేలు, మాస్క్‌ను ధరించకుండా రోడ్లపై తిరిగేవారికి రూ.500 జరిమానా విధిస్తాం.

- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిట్యాల మునిసిపల్‌ చైర్మన్‌

Updated Date - 2020-07-28T10:32:24+05:30 IST